శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 13 - బ్రహ్మ, శివుడు గోవత్స రూపములు ధరించుట

P Madhav Kumar


🌻 *బ్రహ్మ, శివుడు గోవత్స రూపములు ధరించుట* 🌻

🍃🌹నారదుడు హుటాహుటీగా సత్యలోకమునకు వెడలినాడు. తండ్రి అయిన బ్రహ్మదేవునకూ, తనకూ చదువులకూ తల్లి అయిన సరస్వతీదేవికీ ప్రణామాలు చేసినాడు. ‘ఏమిటి విశేషాలు!’ అన్నాడు బ్రహ్మ. ‘తండ్రీ! లోగడ మీరు లోకోపయుక్తమయిన ఒక ఆలోచన నాకు చెప్పియున్నారు. 


🍃🌹ఆ ఆలోచన శ్రీమహావిష్ణువును భూలోకమునకు రప్పించుటను గూర్చి, అందుకై నేను చేసిన ప్రధమ ప్రయత్నము యొక్క ఫలితమును మీకు చెప్పుటకై వచ్చియున్నాను. నా ప్రయత్నము వలన శ్రీ మహావిష్ణువునకూ, లక్ష్మీదేవికి ఎడబాటు కలిగినది. రమాదేవి కొల్లాపురములో తపస్సు చేస్తూయున్నది. 


🍃🌹శ్రీ మహావిష్ణువు శేషాద్రిపై ఒక పుట్టలో నివసిస్తూ పాపము తిండీ తిప్పలు లేక, నిద్రలేక ఆరోజుకారోజు మిక్కిలి శుష్కించి పోవుచున్నాడు. తండ్రీ! మీరేదియో ఒక విధముగ శ్రీమహావిష్ణువునకు ఆహారము లభించునట్లు చూడవలసినదని నారాయణుని యెడల గల తన సహజాభిమానముతో అభ్యర్థించాడు. 


🍃🌹నారదుడు ఆ విధముగా అభ్యర్థించగా బ్రహ్మదేవుడు తన జనకుడయిన శ్రీమహావిష్ణువును గూర్చి యాలోచించసాగినాడు. తండ్రి కష్టదశలోనున్నప్పుడు తనయుడతని కుపకరించి తీరవలెను గదా! ‘సరియే ఆ సంగతి నేను ఆలోచించి కార్యమున పెట్టెదను’ అనెను బ్రహ్మదేవుడు. అది నారదునకు కొంత సంతోషమునకు కారణమయినది. శలవుగైకొని నారదమహాముని తన దారిన వెడలినాడు.


🍃🌹బాగుగా ఆలోచించిన వెనుక, బ్రహ్మ శివుడుండు వెండికొండకు వెడలినాడు బ్రహ్మరాకకు శంకరుడానందమును వ్యక్తమొనర్చుచు, ఆయనకు సకల మర్యాదలు చేసి, గౌరవించి, ఉచితాసన మలంకరింపజేసి ‘విధాతా! విశేషములేమైన నున్నచో నెఱిగించెదవా! అనెను.


🍃🌹అనగానే ‘‘శంకరా! భక్తవశంకరా! లక్ష్మీదేవి ఎడబాటు వలన శ్రీమహావిష్ణువు భూలోకమున శేషాచలమును చేరి ఒక పుట్టలో నివసించడము ప్రారంభించాడు. నిద్రాహారములు లేక శుష్కించి, శ్రీమన్నారాయణుడా పుట్టలో నున్నాడు. ఉపవాసములతో ఆయన దినదినమునూ కృశించుచున్నట్లు నారదుని వలన తెలిసినది. 


🍃🌹కనుక మనమీ దశలో నారాయణునకు ఉపకారము చేయవలసియున్నది. మన మిరువురమూఆవు యొక్క దూడయొక్క రూపములు ధరించి నారాయణుడున్నటువంటి పుట్టను చేరి ఆయనకు ఆహారముగా పాలనిచ్చిన, కొంతలో కొంత ఆయన కుపకారము చేసినవారమగుదుము’’ అనినాడు బ్రహ్మదేవుడు.


🍃🌹అది విని శంకరుడు ‘‘విధాతా! అంతకన్న మనకు కావలసినదేమున్నది? ఆపదయందున్నవారి నాదుకొనుటకన్న గొప్ప యగునదేమున్నది? అదియును గాక నారాయణుని పట్ల ఆ మాత్రము వ్యవహరించుట మనకు విధిగా నెంచుట తగును. నీ వనినట్లే చేయుదుము’’ అన్నాడు.


🍃🌹మన కార్యములు సాధించుటకు సంధానము చేయు వారలు ఎప్పుడూ కావలసియే వుండును గదా! అందువల్లనే బ్రహ్మ, శివుడూ యిద్దరూ సరాసరి భూమండలానికి వెళ్ళి కొల్లాపురము చేరినారు. 


🍃🌹అచ్చట తపస్సు చేసుకొనుచున్న రమాదేవిని దర్శించి ‘‘అమ్మా కోపము చాలా చెడు వస్తువు సుమా! చూడు నీవు విష్ణువు పై కోపగించి భూతలానికి వచ్చేసిన కారణముగా పండంటి మీ సంసారములో కలతల అగ్ని కణాలు రేగాయి, అవి మీ సంతోషాన్ని దహించివేశాయి. 


🍃🌹విష్ణువు విషయము నీకు తెలిసిందా అమ్మా ఆయన యిప్పుడు మునుపటివలె కళాకాంతులతో చిరునవ్వులు చిందించే విష్ణువు కాదు. దైన్యదశలోనున్నాడు. నీకై క్షణమొక యుగముగా భూతలమునకు వచ్చి వెదకుచూ వెదకి వెదకి వేసారి శేషాద్రిచేరి, అక్కడున్న ఒక పుట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక దిగాలు పడి శుష్కించి శుష్కించి వున్నాడు. 


🍃🌹ఆయన కెట్లయిననూ ఆహారము నందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము ముగ్గురము ఆనందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము యావుదూడల రూపములు ధరించెదము నీవు గొల్లభామ వేషం ధరించి ఆవు దూడలమయిన మమ్ము తోలుకొని చోళరాజునకు అమ్మవలెను. 


🍃🌹ప్రతిదినమూ ఆ చోళరాజు యొక్క మందతో కలసివెళ్ళి మేము పుట్టలో నున్న శ్రీమహా విష్ణువునకు క్షీరాహారము నిచ్చుట ప్రారంభించెదము, కనుక మా కోరిక మన్నించవలెనని అన్నారు. విధాత, శంకరుల మాటలకు లక్ష్మీదేవి వెనువంటెనే సమ్మతించినది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat