🌻 *నారదుడు బ్రహ్మలోకమునకు వెడలుట* 🌻
🍃🌹మునులారా! నారదుడు మహాభక్తుడు. అతడు మరి ఎవరోకాడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుని కుమారుడే, భగవద్భక్తులను అభిమానించు నారదుడు సజ్జనుల పాలిట కామధేనువుగ నుండి గర్వముతో పెటపెటలాడు వారిని ఒక చూపు చూసి గర్వపు కోరలను తీసి వినోదించు స్వభావము కలవాడు.
🍃🌹నిరంతరము శ్రీమన్నారాయణుని నామస్మరణతో పరవశుడై గానము చేయుచూ ఎచ్చట నాటంక మనునది లేకయే త్రిలోకములలో సంచరించు నారదుని మహిమ నారాయణునకు తెలియును. నారాయణుని లీలలు నారదునకు తెలియవలసినంతగా తెలియును.
🍃🌹ఒకనాడు తన జనకుడగు బ్రహ్మదేవుని సందర్శించుటకై సత్యలోకమునకు ప్రయాణమయి వెడలినాడు. పద్మాసనమున నాలుగు మోములతో చక్కగ కూర్చునియున్నాడు బ్రహ్మ, ఆయన భార్య అందాల రాశి, చదువుల తల్లియయిన సరస్వతీదేవి వీణపై సామగానము చేస్తూ భర్తచెంత కూర్చోని యున్నది. ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు, సూర్యుడు మున్నగు కాంతులీను గ్రహములూ, అనేక మంది మునులు, ముఖ్యముగా సప్తఋషులు, అప్పటికే ఆ సభలో తము అర్హమైన ఆసనముల నలంకరించియుండిరి.
🍃🌹అటువంటి మహాసభకు నారద మునీంద్రుడు విచ్చేసి వినయ పూర్వకంగా బ్రహ్మ, సరస్వతులకు నమస్కరించాడు. వారు నారదునను గ్రహించి దీవించినారు. నారదుడు ఆ సభకు వచ్చుట సభాసదులకాసక్తికరముగా నుండెను. కారణము నారదుడు త్రిలోక సంచారి కదా. అతడు దేవతల వద్దకు వెడలును, రాక్షసుల వద్దకు వెడలును ఆయన ఎక్కడకు వెడలినను అడ్డు ఆపులుండవు కదా!
🍃🌹అందువలన అచ్చటి విశేషము లిచ్చటను, ఇచ్చటి విశేషము లచ్చటను ముచ్చటించుట ఆయన కుండనే యున్నది. అందువలననే నారదాగమనం ఆనందకరమగుట బ్రహ్మదేవుడు తనయుని ఉచితాసనమలంకరింపజేసి యిట్లనెను - కుమారా! నారదా! నీవు మహాభక్తులలో ఒకడవు.
🍃🌹లోకోపకార కార్యక్రమములు నిర్వహించుట యందు నీ ఆసక్తి, శక్తి నాకు తెలియనివి కావు. నీచే నాకొక మహాకార్యము జరుగుదగియున్నది. అందువలన నీ వర్హుడవని నేననుకొందును. ఇంతకు అది ఏమనగా....
🍃🌹మానవులందరూ దైవభక్తియనునది దానంతయులేక నాస్తిక భావములతో నజ్ఞానాంధ కారమున కొట్టుమిట్టాడుచున్నారు. మూర్ఖభావములు కలిగి, ఆ మనుష్యులు బరితెగించి ఇష్టము వచ్చినట్లు చేయరాని పాపము లెన్నియో చేస్తూ యున్నారు.
🍃🌹తల్లితండ్రుల మాటలు పిల్లలు వినుట లేదు. భర్తల మాటలకు భార్యలు విలువనిచ్చుట లేదు. పెద్దవారిని గౌరవించుట, గురువుల పట్ల భక్తి కలిగియుండుట ఇవి భూలోకమున నీ కలియుగమున నల్లపూసలగుచున్నవి.
🍃🌹ఇవి అన్నియు మానవులందు పొడజూపుటకు కారణము ఈ సర్వలోకములకూ సర్వగ్రహ నక్షత్రాదులకు మొత్తము మీద సర్వ ప్రకృతి సృష్టికి కారకుడైన దైవము యొక్క చింతన లేకపోవుటయే. పైగా ఈ కలియుగమందు శ్రీమహావిష్ణువు యొక్క అవతారము లేకపోయెను.
🍃🌹కనుక, నారదా! ఇంతకూ నేను చెప్పబోవునదీ, నీవు చేయవలసినదీ యేమనగా నీ యొక్క నేర్పు చూపించి, యోచించి ఎట్లయిననూ శ్రీమహావిష్ణువు భూలోకమున అవతరించునట్లు చేయవలెను. దానివలన మానవ కళ్యాణమగును. మరల భూలోకవాసులందు ఆస్తికత్వము ప్రబలుటకు వీలుండును అనెను.
🍃🌹సభలో గల ఇంద్రాదులకు బ్రహ్మదేవుని ఆలోచన ఆనందమును రేకెత్తించినది. జనకుని మాటలను శ్రద్ధగా విని, నారదుడు తన పనిని చేయుటకు లోకోపకారమని భావించి చేయుటకు నిశ్చయించుకొని మరల తండ్రికి నమస్కరించి శెలవు గైకొని వీడి వెడలినాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏