శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 31 - శ్రీనివాసుని పద్మావతి రాళ్ళతో కొట్టించుట

P Madhav Kumar


🌻 *శ్రీనివాసుని పద్మావతి రాళ్ళతో కొట్టించుట* 🌻


🍃🌹చెలెకత్తెలు శ్రీనివాసుని సమీపానికి వెడలి ‘‘అయ్యా మీరెవరో తెలుసుకొనగోరుచున్నాము. మీ నామధేయమేమి? మీరు యిచ్చటికి యెందు వచ్చిరి మార్గము తప్పి వచ్చితిరా! ఈ శృంగారవనానికి పురుషులు రాకూడదని మీకు తెలియదా!’ అని ప్రశ్నించిరి. 


🍃🌹అంతట శ్రీనివాసుడు ‘‘కన్యలారా! మీరు వేసిన ప్రశ్నలన్నింటికి మీ రాజకుమార్తెకు స్వయముగా సమాధాన మివ్వగలవాడను’’ అని అంటూ పద్మావతిని సమీపించినాడు. 


🍃🌹శ్రీనివాసుడు వేటకు వెళ్ళేదారి వేషం ధరించియున్నందువలన అతడు నిజముగా బోయవాడనియే పద్మావతి భ్రమించినది, కోపములో ఆమె మీరీవిధముగా స్ర్తీలుండే వనానికి రావడము సబబా? మీ దేశము యే దేశము?’ అని శ్రీనివాసునిపైప్రశ్నల వర్షం కురిపించినది. 


🍃🌹శ్రీనివాసుడన్నాడు గదా ‘‘ఓ సుందరీ! నాకెవరూ లేరు. ప్రస్తుతము నాకు బంధువులునూ లేరు. చెప్పుకొనుటకు నివాసమునూ లేదు. పూర్వము నాకు నివాస మొకటి వుండేది. ఇప్పుడు సంచారినగుటచే సర్వదేశములున్నూ నావే, పూర్వకాలములో లక్ష్మీ సంపన్నుడిగా నుండిననూ ప్రస్తుతము నేను బీదవాడను, నీవెవ్వరివి? నీ శుభనామమేమి? నీ మాతాపితలెవ్వరు? అని అడిగినాడు.


🍃🌹జవాబు యివ్వకపోవుట మర్యాద కాదనీ ఆమెకు తెలుసు. అందుచే ‘నా తండ్రి ఆకాశరాజు, నా తల్లి ధరణీదేవి, నా పేరేమో పద్మావతి’ అని చెప్పి. మీరిచ్చటనుండి త్వరగా వెళ్ళుడు. పురుషులు యీ ప్రాంతమున నుండరాదనెను. 


🍃🌹అందులకు శ్రీనివాసుడు ‘సుందరీ’! నీ చక్కదనము చూచిన క్షణమునుండి యిచ్చటనుండి మరలి వెడలుటకు నా మనస్సు ఒప్పుకొనుటలేదు. నీవు లక్ష్మివలె నున్నావు. నిన్ను నేను ప్రేమించుచున్నాను. నన్ను వివాహము చేసుకొనుము’ అన్నాడు. ఒడలు మండిపోయినది పద్మావతికి ‘‘ఓయీ! మూర్ఘ స్వభావుడా! క్రిందు మీదెరుగకు పలుకుచున్నావు. 


🍃🌹క్రూర స్వభావుడవైన, బోయవాడవైన నిన్ను నేను వివాహము చేసుకొనవలెనా? నీవు మతిభ్రమవలన యీ విధముగా మాట్లాడుచుంటివా? మా తండ్రిగారైన ఆకాశరాజుగారికి యీ విషయము తెలిస్తే యింకేమయినా వుంటుందా? నిన్ను ఖండఖండాలుగా చేస్తారు తెలుసా! లెంపలు వేసుకొని యింటికి వెళ్ళిపో’ అని గర్జించింది. 


🍃🌹శ్రీనివాసుడు ముఖములో చిరునవ్వు చిందులాడుచుండగా ‘‘ప్రేమకు ఆశాశ్వతమైన సంపదలతో సంబంధము వుండదు. ప్రేమ హృదయాలకు సంబంధించినది.అది మమత, అనురాగము, అభిమానము మున్నగువానితో ముడివేసుకొని వుంటుంది. నిన్ను వివాహము చేసుకోకపోతే నేను జీవించలేను. నన్ను కాదనకు!’ అని కొంచెము దర్జాగా వెళ్ళాడు ఇక వూరుకొని లాభము లేదనుకొన్నది పద్మావతి. 


🍃🌹వెంటనే చెలులను పిలచి ‘మీద మీదకు వస్తున్న ఈయనను రాళ్ళతో కొట్టండి’ అన్నది. ఆ చెలికత్తెలందరూ రాళ్ళు తీసుకొని శ్రీనివాసుని కొట్టసాగారు. అందరూ ఒక్కసారిగా కొట్టిన ఆ రాళ్ళ దెబ్బలకు శ్రీనివాసుడు తట్టుకొనలేక పోయాడు. శరీరమంతా రాళ్ళ దెబ్బలవలన రక్తము కారుచుండగా, శృంగారవనము నుండి శ్రీనివాసుడు నిష్క్రమించి, తన నివాస స్థానమగు శేషచలము చేరుకున్నాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat