⚜️ శయన ప్రదక్షిణము ⚜️
ఎవరికి వారు స్వయముగానూ
లేక ఇతరులను నియమంచి ఈ శయన ప్రదక్షిణము (అడుగడుగు దండాలు లేక పొర్లు దండాలు) జరుపవచ్చును. స్వయముగా శరీరమున బలము ఉండి చేసినచో కలిగెడి ఫలసిద్ధి అన్యులచే చేయించినచో కలుగదు. మనకు ఆకలి
అయిన వేళ ఇంకొకరు భుజించినచో మన ఆకలి తీరదు కదా ! మనమే భుజించి మన ఆకలి తీర్చుకోవలెను. అట్లే స్వయముగా భగవత్సేవ చేసి పుణ్యమార్జించుకో వలయును. వృద్ధులు , బలహీనులు , రోగిష్టులు అయిన వారి విషయము వేరు. స్వామికి మాత్రము వారి వారి స్థితి గతులు తెలియకపోవునా ? మాళికాపురత్తమ్మ సన్నిధినుండి పదునెనిమిదవ మెట్టు వరకునూ , అట్లే పదునెనిమిదవ మెట్టుకు పైభాగమున నున్న క్షేత్రమును చుట్టి శయన ప్రదక్షిణము చేయుదురు. ఈ శయన ప్రదక్షిణము చేయదలచిన వ్యక్తి భస్మతీర్థమునందు స్నానమాడి తడి వస్త్రములతోనే ప్రదక్షిణము చేయవలెను. శయన ప్రదక్షిణ సమయమునందు అచ్చట గూడియుండెడి భక్తాదులు రెండు పార్శ్వములుగా చీలి , వారికి అడ్డము తొలగి , ప్రదక్షిణమునకు దారి
వదలడమూ , శరణ ఘోషమును ఉచ్ఛస్థాయిలో ఘోషించుచూ , ప్రదక్షిణము చేయు స్వామికి వెనుకగా నడచి అతనికి సాయపడటమూ చేయుదురు. మానసిక , శారీరక రుగ్మతలు కలవారికి ఈ శయన ప్రదక్షిణము దివ్యౌషదమని పలువురు భక్తుల విశ్వాసము.
కనుక భక్తులెల్లరు వారి వారి శారీరక ఆర్థిక స్థితిగతికి తగినట్లు ఆ శబరిగిరీశుని ఆరాధన చేసి తరించుదురుగాక ! అట్లుగాక అహంకారముతోనూ , మిగిలిన భక్తుల వద్ద తమ యొక్క ఆడంబరము చూపించుటకుగానూ , ఎదుటివారిని కించ బరచుచూ తామే ఏదో గొప్పగా చేయించు చున్నామని డంబాలు పలుకుచూ ఎంత గొప్పగా చేయించిననూ స్వామివారి అనుగ్రహమునకు గాక ఆగ్రహమునకు పాత్రులగుదురు. ఇంకనూ మరియొక రకమున్నారు. భక్తి యున్ననూ ఆర్థిక స్థితి బాగుగా లేని కన్నిస్వాముల చేత ఆ ఆరాధన చేయించవలెను. ఈ ఆరాధన చేయించవలెను అనుచూ , బాధించి ఆర్భాటముతో ఆరాధనలు చేయించినచో స్వామివారి ఆగ్రహమునకు పాత్రులుగాక తప్పదు. మరి ఇంకొక విషయమును జ్ఞప్తి యందుంచుకొని ఆరాధన చేయించవలెను. ఏదో ఒకటి ఆరాధన కార్యక్రమము ముఖ్యముగాని వస్తువు ముఖ్యముగాదని తలచువారూ ఉందురు. మనకు ఉపయోగించుటకు తగని వస్తువు లేక ఏ ఒక్క పదార్థముతోనూ , అశుభ్రమైనదియునూ , పాడైపోయినదయిననూ అయిన పూజా ద్రవ్యములచే స్వామిని ఆరాధించుటయునూ నేరమగును. కావున స్వాములెల్లరూ సూక్ష్మ గ్రాహులై స్వామి అనుగ్రహమునకు పాత్రులగుదురు గాక ! అని ప్రార్థించుచూ , ఆరాధనా కార్యక్రమ వివరణను ముగించు చున్నాను.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏