⚜️ శరంగుత్తి దాకా ఏనుగుపై మకర విళక్కు ఊరేగింపు ⚜️
శబరిగిరికి వెడలు తీర్థయాత్రీకులు జ్యోతి దర్శనము (మకర విళక్కు) చూడక అచ్చటి నుండి మరలినచో అన్ని కష్టములకు సహించి చేసిన యాత్రకు ఎట్టి ప్రయోజనము లేదనియే పూర్వకాలము నుండి ఉన్న అభిప్రాయము , విశ్వాసము. కాని ఆ విశ్వాసము ననుసరించి నిలబడి యుండువారు కొందరే. మకర సంక్రాంతి దినము రాత్రి పలువిధ వాయిద్యములతో గూడి మకర విళక్కు ఊరేగించెదరు. (భక్తాదులు ఈ సందర్భమున ఒక విషయమును తెలుసుకొనవలెను. మకర విళక్కు వేరు , మకర జ్యోతి వేరు) శబరిగిరి యొక్క ప్రధాన ఉత్సవము ఈ మకర విళక్కు ఉత్సవము. అసలు ఈ ఉత్సవము 7 రోజులు జరుగును. అది పుష్యమాసము 1 వ తేది నుండి ప్రారంభమై 7 వ రోజు ముగియును. పుష్యమాసము మొదటి దినము అయ్యప్ప స్వామిని పరిణయ మాడ నిశ్చయించి తపము చేయు మాళికా పురత్తమ్మ వారి యొక్క పట్టపుటేనుగు ఆలయమునకు ప్రదక్షిణము చేసి వచ్చి శరంకుత్తి వరకూ వెడలి తిరుగును. ఎందుకనగా ఏ ఏట ఒక్క కన్నిస్వామి గూడా శబరిగిరికి రారో ఆ సంవత్సరము నిన్ను వివాహ మాడుతానన్న మణికంఠ స్వామి యొక్క మాట మీరక అమ్మవారు తపము చేయుచున్నారు. ఆ ఏనుగు వచ్చి కన్నిస్వాములు వచ్చియుందురో , లేదో శరములు వీడి యున్నవో లేవో అని చూచుట ఆ సంక్రాంతి దినమున భక్తులు చూడవచ్చును.
ఏటేటా వేలకొలది పెరుగుతున్న కన్ని అయ్యప్పస్వాములవారి సంఖ్యకు వారు
వీడిపోయిన శరములే సాక్షి. ఈ శరములను గాంచిన పట్టపుటేనుగు ఈ ఏడాది కూడా మన అమ్మవారికి వివాహము లేదన్న దుఃఖముతో అమ్మవారికి ఈ వార్తను తెలియజేయుట కొరకై తిరిగివచ్చును. ఈ ఏనుగు మీద వెలిగించి ఊరేగింపబడే జ్యోతికి లేక దీపమునకు *'మకరవిళక్కు'* అని పేరు. ఈ జ్యోతి వెలుగుతోనే ఏనుగు శరంగుత్తి ఆల్ నందు గ్రుచ్చబడియున్న శరములను చూచి తిరిగి వచ్చును. ఆ ఊరేగింపునందు వావరుస్వామి వంశీయులు ఆయుధధారులుగా వెంటరావడము పద్ధతి. ఏడవ దినమున ఉత్సవము అంత్య దినము. ఆ రోజున వన దేవతలకు , మిగిలిన దేవతలకు కురిది జరిపి వారిని తృప్తి పరచెదరు. ఈ కురిది పూజ ముగిసిన పిదప ఎవరును శబరిగిరి క్షేత్రము వద్ద ఉండకూడదన్నది నిర్ణయము.
వావరు స్వామికునూ , మాళికాపురత్తమ్మ సన్నిధానమునకు దక్షిణ భాగమున కొంత దూరములో *'వావరుకురిది'* పూజ గూడా చేయుదురు. మండల వ్రతము అనుష్టించి మండల భజనను జరుపుకొనవలెనని అనుకొనెడి కొంతమంది భక్తులు తులామాసము
(మలయాళ మాసము) చివరలో శబరిగిరి చేరి మండల వ్రత మనుష్ఠించెదరు. మండల భజన ముగిసి వారి వారి స్థలములకు మరలి పలువురు మరల మకర సంక్రాంతి దినమునకు *'పదునెనిమిది మెట్లపై'* ఎక్కి సన్నిధానము చేరుదురు. ఈ విధమైన యాత్ర మిక్కిలి సుఖప్రదము , ఫలప్రదము అగును.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏