🙏🔱బసవ పురాణం - 5 వ భాగము🔱🙏

P Madhav Kumar


అంతేకాదు ఆటలలో కూడా బాల బసవడు శివపూజ చేస్తున్న ఆటలే ఆడేవాడు. బుద్ధులెదిగే వయస్సులో భక్తులను శివునిగా తలంచడం నేర్చుకున్నాడు. అయితే బసవన్న సర్వజ్ఞుడైన నందికేశుడు కాబట్టి సర్వవిద్యలూ సహజంగానే వచ్చాయి.

అట్టి బసవన్నకు ఎనిమిదవ యేట తండ్రి ఉపనయం చేయాలని ముహూర్తము పెట్టించగా, అది విని బసవన్న తండ్రితో ఇట్లా అన్నాడు.

*‘‘నాయనా! ఈ ఉపనయనమేమిటి? శివభక్తుడవు నీవు జడుడ వెట్లయినావు? పరమాత్ముణ్ణి గురువుగా కొలిచే మనకు దుర్నరుడు గురువెట్లా అవుతాడు? అది నరకం కాదా! పూర్వజన్మ (ద్విజత్వము) ఏమిటి? ఇది పతనహేతువు. నిర్మలమైన గురుకృపాన్వీత జన్మానికి కర్మజన్మమేమిటి? ఆ గురుపాదార్చన చేసే శైవునికి అగ్నిలో హవిస్సులో వ్రేల్చడం దోషం కాదా?*

*పరమశివ మంత్రం వదలి వేరే మంత్రాలు నేర్చుకోవడం పాపం. ఆ భక్తులకు నమస్కరించే చేతులతో తాటిమాలలకు నమస్కరించడం తప్పు కాదా! కర్మపాశం తెగకోసిన మనం తిరిగి కర్మకాండను నేర్పేతాళ్లు (జంధ్యాలు) కట్టుకోవడమేమిటి? భస్మ రుద్రాక్షలు ధరించిన మనం క్షుద్రముద్రలు ఎలా ధరిస్తాము? ఈ విధంగా యజ్ఞోపవీతానికి దూరమైన వీరమాహేశ్వరాచార దీక్షితుని, ఉభయ కర్మ నిర్మూలుని నన్ను వడుగు పేర కర్మ సముద్రంలో ముంచుట నీకు ధర్మము కాదు తండ్రీ!*

*ఎవడు బ్రహ్మ తలను నరికాడో ఆ శివుడు బ్రహ్మ వంశుడెలా అవుతాడు? జాతికి గోత్రానికి అతీతుడై సద్గురుకర కమల సంజాతుడైన శివాచారపరుణ్ణి తిరిగి జాతి గోత్ర క్రియలను ఆశ్రయింపజేయడం తప్పు కదా!* *కుల రహితుడైన శివుని భక్తులమైన మనకు కులమేమిటి నాయనా! కాబట్టి ఏ విధంగా చూచినా ఉపనయనం కూడదు’’* అనగా తండ్రి విని బసవనితో ఇలా అన్నాడు.

*‘‘బ్రాహ్మణ మార్గంలోని ఆగమ పద్ధతిలో షోడశ సంస్కారాలున్నాయి. అందులో ఉపనయనం ఒకటి. గర్భ సంస్కారంతో ప్రారంభమై సాగే ఈ పదహారు సంస్కారాలలో మనం ఏదైనా సంస్కారాన్ని స్వీకరించకపోయినట్లయితే ఉత్తమ కులానికి చెందిన వారము కాకుండా పోతాము. అంతేకాక ఉపనయన సంస్కారమంతా శైవధర్మసంబంధమైనదే కదా! ఉపనయన పూజలో రుద్ర గణాన్ని, నందిని పూజిస్తాము. అప్పుడు, చెప్పే గాయత్రీ మంత్రంలో ప్రణవము, రుద్రుడు మాత్రమే పరమ దైవమని అర్థమవుతున్నది.*

*ఉపవీత సూత్రము, శివుడు ధరించిన సర్పానికి సంకేతము. వటువుపట్టిన పాత్ర, శివుడు పట్టిన బ్రహ్మ శిరస్సు. పాలాశదండం శూలం. కూకటి జుట్టు శివుని జడలు. వటువు ధరించిన జింక చర్మం శివుడు దాల్చిన* *గజచర్మానికి సంకేతం. చందనమే భస్మం. వటువు భిక్షాటన చేయడం, శివుని భిక్షకు సంకేతం. ఈ విధంగా ఉపనయ సంస్కారంలో వటువు శివ రూపం ధరిస్తే తప్ప బ్రాహ్మణుడగా అంగీకరింపబడడు.*  అందుచేత *ఉపనయనం శివభక్తుడు తిరస్కరించవలసిన సంస్కారమేమీ కాదు.* *ఉపనయనంవల్ల భక్తి ఏమీ తగ్గదు.నీవు పసివాడవు. నీకేమి తెలుసు? మేము చెప్పినట్లు చేయడం నీ ధర్మం. ఇట్టి విపరీతపు మాటలు ఇంతకుముందు విన్నవీ కాదు కన్నవి కాదు. నీవేదో సుపుత్రుడివి వంశోద్ధారకుడవు పుట్టినావని సంతోషపడితే ఈ దుర్బుద్ధులేమిటి? కులదీపకుడు పుడితే కులమంతా వర్థిల్లుతుంది


. ఒక కులనాపకుడు పుడితే వానివల్ల కులమంతా నశిస్తుంది.* 

*నీవు వడుగును తిరస్కరిస్తే బ్రాహ్మణులు నన్ను కులమునుండి వెలివేస్తారు. కాబట్టి ఇంతగా చెపుతున్నాను నా మాట విను, విననంటావా ఇంక నీవూ, నీ భక్తి కలిపి నీ ఇష్టం వచ్చిన చోటికి పోయి పడండి’’* అని తీవ్రంగా కొడుకును తిట్టాడు. అప్పుడు బసవన్న మిక్కిలి రోషముతో ఇలా అన్నాడు.

*‘‘తండ్రీ! భక్తికి, బ్రాహ్మణ ధర్మానికి బొత్తిగా సంబంధమే లేదు. బ్రాహ్మణ దర్శనం వేరు. దైవం వేరు. మంత్రం వేరు. ఆచార్యుడు వేరు. వేషధారణమూ వేరే అవుతుంది. ధ్యానమూ, బాహ్య క్రియలూ ఆచార్య మార్గమూ అన్నీ భక్తి మార్గానికన్నా భిన్నమైనవే! కాకుంటే అగ్ని ముఖము, బ్రహ్మ శిరము, రుద్రశిఖ, ప్రాణాదివాయువులు ప్రాణములు, విష్ణు గర్భము భూయోని కలిగి వుంటుందది. గాయత్రి ఇరవై నాలుగు అక్షరాలు కలిగి సంఖ్యాయనస గోత్రంతో త్రిపాదియై షట్కుక్షియై ఉంటుంది.* 

*ఈ విధమైన ఉపనయనమూ ఉపనయన మంత్రమూ శివమతమని చెప్పడం తగదు. అలాగే బ్రహ్మజ్ఞ కర్మలు కూడా శివేతరమైనవే!*

*శైవము షడ్దర్శనాతీతమైనది. శ్రుతివిహితమైనది. షడక్షరిని మించిన మంత్రరాజం లేదు.*

🙏 హర హర మహాదేవ 🙏


J N RAO 🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat