🔱 శబరిమల వనయాత్ర - 60 ⚜️ మకర జ్యోతి దర్శనము ⚜️

P Madhav Kumar

⚜️ మకర జ్యోతి దర్శనము ⚜️


మకర సంక్రాంతి దినమున దీపారాధన పొన్నంబలమేడు (కాంతమల)లో జరుగును. ఇచ్చటనే స్వర్ణమందిరములో సాక్షాత్తు అయ్యప్పస్వామి యుందురని విశ్వసింతురు. దేవతలు , ఋషులు అయ్యప్పస్వామికి పూజలు , దీపారాధనలు జరుపుదురని అనేకులు
విశ్వసింతురు. శబరిగిరికి ఎదురుగా నున్న కాంతమల శిఖరాగ్రమున దీపారాధన సమయము నందు భక్తి పరవశులై ఆ ఆనందమూర్తిని శరణాలతో స్తుతించుచుండెడి
భక్తాగ్రేసరులకు ఉత్తరభాగమున కొంచెము తూర్పుగా ఆ దివ్యజ్యోతి స్వరూపమును కాంచుటకు సాధ్యమగును. పుష్యమాసము 1 వ దినము శబరిగిరి సన్నిధిలో చేరియున్న
వారందరు సాయంత్రము నుండియూ జ్యోతిని గాంచవలయుననెడి ఆపేక్షతో శబరిగిరి ఆలయమునకు ఎదురుగా నున్న 'కాంతమల' శిఖరాగ్ర భాగమునే చూచుచుందురు. ఆ అయ్యప్ప స్వామిని జ్యోతి స్వరూపముగా దర్శించుటకు గదా మనము కార్తీక వ్రతము పూని కఠిన నియమ నిష్టలు గైకొని కొండకోనలు దాటి ఇచ్చటకూడి యున్నాము. కావున ఏ మారక ఆ జ్యోతిని గాంచవలెను అనెడి ధృడ దీక్ష ప్రతి వారిలోన కనిపించును. సాయంత్రము సుమారు గం. 6.30 ని॥ మొదలు 7 గంటల లోపున హరిహర సుత అయ్యప్పస్వామివారు కాంతమల శిఖరముపైనున్న స్వర్ణ మందిరము నుండి కలియుగ మానవ భక్తులకు జ్యోతి స్వరూపమున 'జ్ఞానజ్యోతి'గా దర్శన మొసంగెదరు. మొదట
జ్యోతి అనునది ఒక చిన్న నక్షత్రముగా ప్రకాశించుటకు మొదలుపెట్టి కొంచెము
కొంచెముగా పెరిగి జ్వాలగా వెలుగుచూ , మనచూపుకు ఒక మెర్క్యురీ లైటంత పెరిగి పిదప కొద్ది కొద్దిగా చిన్నదై అదృశ్యమగును. ఇదంతయూ సుమారు ఏడు నిమిషముల కాలములో జరిగి ముగియును. ఆహా ! ఇపుడు గదా ! మన జన్మము ధన్యమైనదన్న
భావనతో హృదయము పులకాకింతమగును. అప్పుడు ఆ శబరిగిరిపై అందరు పలికెడు
శరణు ఘోష ఎట్టివారినైనా ఆవేశపూరితుల గావించును.

ఈ తరుణమున నోరువిప్పి మాట్లాడలేని ఎందరో మూగవారికి , మాటవచ్చి తమకు మాట్లాడు శక్తి వచ్చినది గూడా గ్రహించలేని పరిస్థితిలో శరణములు పలికెదరు. వారు
ఎంతటి భక్తి శ్రద్ధలు కలవారో ! అట్టి అనుగ్రహము స్వామినుండి పొందుటకు గత క్షణము వరకూ మాట్లాడలేని స్థితిలో యున్నవారు ఇట్లు ఇప్పుడు ఇతరులతో సహజముగా సంభాషించే స్థితికి వచ్చిన ఆ మూగ అయ్యప్పలను కాంచువేళ ఆ క్షేత్రములోని కానరాని దైవశక్తిని మనము నేత్ర ప్రత్యక్షముగా గాంచగల్గుదుము అట్లే కుంటి వారెందరో
సహజముగా నడువ గల్గుదురనియూ , మహా మహా ఘోరవ్యాధులు గలవారు కూడా అత్యద్భుతముగా తమ తమ వ్యాధులు పొగొట్టుకుని స్వస్థులైనవారు ఎందరో కలరనియూ అనుభవజ్ఞులైన పళమ స్వాములు చెప్పుచుందురు. స్వామి అనుగ్రహ భాగ్యము పొందగల్గిన వారి భక్తి , విశ్వాస , శ్రద్ధలకు నమస్కరించిన చాలును మనమూ భాగ్యశాలులమైనట్లే. ఇక మరోవైపు కూడా మనము చూడవలయును కదా ! మరి
వ్రతానుష్టానములు , భక్తి , శ్రద్ధ గలవారిని స్తుతించాము. అవి లేనివారి సంగతేమో వారి వారికే తెలియును. వ్రతానుష్టానములు లేని వారికినీ , సంశయగ్రస్తులకునూ , మూడులకునూ , డంబా చారులైన అజ్ఞానులకునూ ఆ దివ్యజ్యోతి దర్శనము లభించదు. ఆ చిన్మయరూపునికి దేవతలు , ఋషులు పూజలు , దీపారాధనలు జరిపిడి ఆ దివ్య ముహూర్తము నందు వెలిగెడి ఆ దివ్యజ్యోతి దర్శనము లభించదు.

రేగిచెట్టు క్రింద గ్రుడ్డివాని కథకు మల్లె జ్యోతి దర్శించిన భక్తులు అదిగో జ్యోతి , ఇదిగో జ్యోతి అని చెప్పుకొనుచుండ మాకూ కన్పించిందని చెప్పుదురో కాని , మురియునట్లు
నటించెదరో కాని వారి వారి హృదయములకు తెలియదా ? ఆ సాక్షీస్వరూపునికి తెలియదా ? ఇంతటి మహాజ్యోతి గురించి ఆలంగాట్టు యోగతిలే గురుభూతుడునూ ,
శబరిమల వెలిచప్పాడు స్థానము పొంది నలుబది సంవత్సరములకంటే అధికముగా శబరిగిరి యాత్ర చేసిన వ్యక్తియునూ , వారికి సమానులైన పెద్దలునూ ఎంతో విశేషముగా చెప్పియున్నారు. వర్ణించియున్నారు. కనుకనే మకరజ్యోతికి అంతటి
ప్రాధాన్యత అనియూ , మకరజ్యోతి దర్శనము పుణ్యమనియూ అట్టి పెద్దలు చెప్పి యున్నారు. మన యాత్రా పరిపూర్ణత అంతయూ జ్యోతి దర్శనమే అనినచో ఇక అంతకన్నా జ్యోతిని గురించి చెప్పవలయునా ? జ్యోతి దర్శనము కాంచిన క్షణమే మన శబరిగిరి యాత్ర ముగిసినట్లు అనిపించును. అంతవరకూ ఇళ్ళు , వాకిళ్ళు , బంధువులను లౌకిక విషయములను అందరూ మరచి ఒక వివశత్వములో యుందురు ఇక
ఇప్పుడు అందరికీ వాటిపై దృష్టి మరలును. అనేకమంది ముస్లిము మిత్రులు జ్యోతి దర్శనము ముగిసిన వెంటనే కొండదిగి వెడలుదురు. కొంతమంది జ్యోతిని చూచిన పిదప ఆలయమునకు పశ్చిమభాగపు మెట్ల ద్వారా ప్రవేశించి స్వామిని 'తిరువాభరణ' అలంకార సేవలో దర్శించి పిదప కొండ దిగుటకు తయారగుదురు. కాని ఇంకా కొంత మనము చేయవలసిన కర్తవ్యమచటనున్నది అని మనవి చేసుకొనుచున్నాను. అదియే కుంభదళత్తోడు స్నానము

🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌻🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat