⚜️ పందళ రాజుకు పొన్నంబల దర్శనం ⚜️
శ్రీ స్వామివారి సద్బోధనల వలన జ్ఞానము పొందిన పాండ్య భూపాలుడు స్వామి ఆజ్ఞమేరకు ఆలయము నిర్మింపతలపెట్టి , పరివారముతో అడవికి వచ్చి , కులగురువు మరియు అగస్త్య మునీశ్వరుల ఆదేశానుసారము మిక్కిలి భయభక్తితో
కార్యక్రమములు జరిపించు చుండువేళ , అందరూ గాఢనిద్రలో యున్నవేళ రాజుకు మాత్రము నిద్రపట్టలేదు. తలపెట్టిన కార్యము నిర్విఘ్నముగా జరుగవలయుననే పలు విధములుగా ఆలోచించుచూ , అన్నిటికి సర్వేశ్వరుడైన అయ్యప్పే యున్నాడని తలస్తూ శ్రీ స్వామివారి మహామంత్రమగు "శ్రీ భూతనాథ సదానందా సర్వభూత దయాపర ! రక్షరక్ష మహాబాహో శాస్త్రి తుభ్యుం నమో నమః అను శ్లోకమును జపిస్తూ పడుకొని యుండినవేళ ఆ రాజు ముంగిట ఒక మెరుపు మెరసి అందుండి యొక శేష్ట పురుషుడు
ప్రత్యక్షమై ఇట్లనెను."ధాగద్యో శివాన్ భూపం కచ్చిత్ పురుషసత్తమ రక్షహే మాలయస్తేన భూతనాథేన శోధితః అహంవాపర సంజ్ఞస్వా ఆనేతుం స్వామి సన్నిధౌ అతునైవ గమిష్వావ పురుఃసుబత్ ప్రభోతనాత్ " (భూతనాధోపాఖ్యానము 21-22 శ్లోకములు)
*"హే రాజన్ ! నేను స్వర్ణాలయమున కొలువుండే భూతనాథ స్వామి వారి యొక్క భటుడను. నాపేరు వావరుడు. మిమ్ములను అచ్చటికి తిసికొనిరమ్మని శ్రీ స్వామి వారి ఆజ్ఞ. మిగిలినవారు మేల్కొనక మునుపే మనము తిరిగి వచ్చెదము త్వరగా రండి"* అని పిలిచెను. ఆ మాటలకు మిక్కిలి సంతసించిన రాజు వావరునితో త్వర త్వరగా స్వర్ణ మందిరము చేరుకొనెను. స్వర్ణమందిర దర్శనము లభించిన రాజు మహదానందము చెందెను. అచ్చట కోటి సూర్య ప్రకాశముతో దేవఋషి గణ వంద్యుని నవరత్న ఖచితమైన జ్ఞానపీఠమును , దేవతలు పడుకొనియుండిన అష్టాదశ సోపానములును వీటితో గూడిన స్వర్ణ మందిరమును , రాజు జ్ఞాననేత్రముతో చూడగలిగెను. వేదవేద్యుడైన స్వామి కొలువుండే స్థలమున సత్యము , ధర్మము ద్వారపాలకులై , అంతః కరణశుద్ధి , ఈశ్వర విశ్వాసము , సమత్వము , కరుణ , మనోధైర్యము , భక్తి , సంతోషము ఇంద్రియ నిగ్రహము మొదలగు ఎనిమిది ధర్మములు సత్యధర్మములందిమిడి అచ్చట కాపలామూర్తులై యున్నవి. పదునెనిమిది తత్వములు దేవతా మూర్తులై మెట్లయి ప్రకాశించుచున్నారు. రత్న సింహాసనమున చక్రవర్తియై భూతనాథ స్వామి అమరియున్నారు. ఈ దృశ్యము గాంచిన వెంటనే భక్తి సుధాబ్ధిలో మునిగిన రాజు
*"అయ్యా కరుణాసింధో! భక్తవత్సలా! పాహిమాం! పాహిమాం!"* అని స్తోత్రము చేసెను. అప్పుడు శ్రీ అయ్యప్పమూర్తి"హే రాజన్ నీకు మంగళము కలుగుగాక ! సర్వ విధములా నీ చర్యలచే మేము సంపూర్ణ తృప్తి చెందినాము.
మేము నీ పెంపుడు కొడుకై యుండిన సమయమున రాజధానిలో చేసుకొన్న
దైవిక కార్యక్రమములు గాంచిన రాజగురువు భక్తిమేరకు నన్ను చూపించి *"ఇతడు భవిష్యత్తులో గొప్ప చక్రవర్తి కాగలడు"* అని పలికిన వచనములను ఋజువు చేయుటకొరకు మేమిచ్చట చక్రవర్తిగా వెలయుచున్నాము. ఆ దృశ్యమును నీవు చూచి ఆనందించవలయుననియే ఇచ్చటికి నిన్ను రప్పించినాము. “పట్టబంధము (యోగ స్థితి) పూని చిన్ముద్రధారిగాయున్న నన్ను ధ్యానించుటయే మిక్కిలి శ్రేష్ఠము. నా విగ్రహము ఎలా నిర్మించాలి అనునది అంజనా శాస్త్ర నిపుణుడొకడు వచ్చి వివరించును.(పరశురాముడు అనునది గుప్త పరచడమైనది). అతడే ప్రతిష్ఠా కార్యక్రమము నిర్వహించును. “తత్వమసి" "అహం బ్రహ్మాస్మి" మున్నగు ప్రమాణ వచనములను
స్మరించువారి చిత్తము నా క్షేత్రమగును. నా శక్తియే ప్రపంచమంతట వ్యాపించి
యున్నది. దేహులకు గల దేహమే క్షేత్రము. అందున వెలసియున్న జీవుడే నా విగ్రహము. దీనిని చక్కగా
గ్రహించి కార్యక్రమములను నిర్వహించుము" అని చెప్పి అంతర్థాన మయ్యెను. తదుపరి రాజు తాను జ్ఞాన నేత్రములతో గాంచిన స్వర్ణ మందిరమును భూజను లెల్లరు చూడవలయునను భావనలో నిర్మించబడినదే నేటి శబరిగిరీశ్వరుని సన్నిధానము.
🙏🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏