ప్ర : మనధర్మాన్ని 'మనువాది' అని, దానిని వ్యతిరేకించాలని కొందరు ఆందోళన చేస్తున్నారు. కులవ్యవస్థ, స్త్రీ అస్వతంత్రత లాంటివి మనుధర్మంలో ఉన్నాయని ఎద్దేవాచేస్తున్నారు?
జ : మనుధర్మశాస్త్రం లేకున్నా మనధర్మం ఇసుమంత చెదరదు. అసలు మన హిందువుల్లో చాలామందికి మనువు పేరూ తెలియదు. మనుధర్మశాస్త్రమూ తెలియదు. అయినా హిందువులుగా ఉన్నారు. మరి 'మనువాది' అని ఎలా అనగలం? మనకున్న వందలాది
ధర్మశాస్త్రాల్లో మనుధర్మశాస్త్రం ఒకటి. కలియుగంలో ఆ శాస్త్రాన్ని కాకుండా, " కలౌ పారాశరస్మృతిః " - అని 'పరాశర ధర్మశాస్త్రా'న్ని కొందరు ప్రస్తావించారు.. మనువాది అని విమర్శించేవారెవరూ సరిగ్గా మనుధర్మశాస్త్రాన్ని చదివినవారుకారు. వర్గ విభజనలు ఏ సమాజంలోనైనా ఉంటాయి. పరిమితుల్ని 'అస్వతంత్రత ' అనీ మితిమించడాన్ని 'స్వతంత్రత' అనీ నిర్వచించడం సమంజసంకాదు. కొన్ని శాస్త్రాంశాలు కొన్ని కాలాల్లో సమాజాన్ని సువ్యవస్థితం చేస్తాయి. అవి. తరువాతి కాలాల్లో సమంజసం కాకపోవచ్చు. ఆ అంశాలు మినహాయించి, సర్వకాలాలకు పనికివచ్చే స్ఫూర్తియైన విషయాలను గ్రహించవచ్చుకదా! మనధర్మంలో కులభేదాలు ఎన్ని చెప్పారో వాటి సమన్వయాలు, సామరస్యాలు కూడా చాలాచెప్పారు. వాటిని అనుసరించి భేదాలను తొలగిస్తూ, సమన్వయంతో బ్రతికే విధానాలను ఏర్పరచి సంస్కరించుకున్నాం. స్త్రీ ఔన్నత్యాన్ని మన ప్రాచీనా గ్రంథాలు బహు విధాలుగా చెప్పాయి. వాటిననుసరించి తగిన సంస్కరణలతో స్త్రీ ప్రాధాన్యాలనుకూడా హిందూధర్మం ఆవిష్కరించింది.
ఇతర ధర్మాలలో స్త్రీలకున్న పరిమితులు, నిబంధనలు హిందూధర్మంలో లేవు. వివిధ తెగలుగా ఇతరమతాలలో జరుగుతున్న కొట్లాటలు హిందూధర్మంలో లేవు. కేవలం రాజకీయులు రెచ్చగొడుతూ విధర్మీయుల పక్షాన హైందవధర్మానికి విఘాతం కలిగించాలని ఈ వాదాలు లేవదీస్తున్నారు. మనుశాస్త్రం మీద మాత్రమే మనధర్మం నిలబడలేదు. ఒక్క గ్రంథం మీ ఆధారపడ్డ మతాలవలె ఒక్కపుస్తకంపైననే నిలబడినట్లయితే - మనం ఆందోళన పడవచ్చు. కానీ ఆ స్థితి మన ధర్మానికి లేదు. యోగం, మంత్రం, గుడి, ధ్యానం - ఇవన్నీ లింగ, వర్ణ వివక్ష లేకుండా అందరూ అనుష్ఠించి సత్ఫలితాలు పొందుతునారు. మనధర్మంలో మనువు పేరు తెలియకపోయినా, హాయిగా హిందువుగా జీవించవచ్చు. అలాగని మనుధర్మశాస్త్రాన్ని తీసిపారేయనక్కర్లే దు. నేటి స్థితిగతులకి అనుగుణంగా మినహాయించితే, ప్రతి వ్యక్తికీ పనికివచ్చే ఎన్నో అద్భుతాంశాలు అందులో ఉన్నాయి. వాటిని స్వీకరించి జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు.
ఓం నమో నారాయణాయ