*శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః*
యజ్ఞ గుండంలో ఆత్మార్పణ గావించిన సతీదేవి మరణం, ఈశ్వరుని ఎంతో విరాగిగా మార్చేసింది.
పరమేశ్వరు డొక్కచోట నిలువలేక పోతూన్నాడు. నిరంతరం సంచారమే పనిగా పెట్టుకున్నాడు.
అలా కొంతకాలం హిమాలయాలన్నీ పావనం చేసి, ఒక దివ్య సుందర ప్రదేశం మహాదేవుని కించుక ఉల్లాసం కలిగించగా, అక్కడ తపోనిష్ఠకు అనువుగా ఉన్నదని భావించి అక్కడే తిష్టవేసి తపస్సు చేసుకోసాగాడు.
మేనక – హిమవంతులు
మేనకా దేవికి, ఆది పరాశక్తి వర ప్రభావాన పుత్రిక జన్మించే సమయం ఆసన్నమైంది. ఆమె చక్కటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. రత్నంలాంటి ఆ బాలిక జనన సమయంలో శుభశకునాలు అనేకం తోచాయి.
మేఘాలు ఆనందంగా జలధారలు కురిపించగా, దేవతలు విరి వానలు కురిపించారు. గంధర్వులు తమ గాన ప్రావీణ్యమంతా పలురకాల వాయిద్యాలపై ప్రయోగించగా విద్యాధర - అప్సర స్త్రీలు నాట్యరీతుల్లో తమ - తమ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించారు.
ఆ బాలిక అపూర్వ వర్చస్విని, రూప లావణ్య విలాసిని, శ్యామ వర్ణ శోభిని. జాత కర్మ - నామ కరణవేళ 'కాళీ' అని నామకరణం జరిపించినప్పటికీ, పర్వతరాజ పుత్రిక 'పార్వతి' గా అచిరకాలంలోనే అందరి చేతా పిలువబడసాగిందామె.
ఆ పేరే ఆమెకు సార్ధకమైందది.
ఆమె కారణజన్మురాలు కదా! ఆమె పుట్టిన నాటినుండీ మేనకా హిమవంతులకు ప్రతిరోజూ ఏదో ఒక దివ్యానుభూతి కలగసాగింది. బాల్యం నుంచే పార్వతికి శివనామోచ్చారణపై ప్రీతి.
మాటలు నేర్చినది మొదలు నిరంతర శివప్రసంగాను రక్తయైన పార్వతీ హిమవంతుల మధ్య ఎన్నిసార్లో శివలీలా ప్రసక్తి గానవచ్చేది.
"తండ్రీ! ఈ లోకాలన్నిటికీ, అత్యంత సంస్తూయమానదేవుడు, ఆ ఆదిదేవుడే కదా!"
"అవును తల్లీ! ఆ మహాదేవుని లీలాసృష్టి ఈ సమస్తం మొత్తం. అతడ్ని సేవించేవారికి ఇహపరాలు రెండిటా అమితానందం తధ్యం!"
"ఆయన నివాసం?"
"ఒక ప్రదేశం అని ఏం చెప్పను? సర్వాంతర్యామి."
"ఆయన రూపురేఖా విలాసాలు?"
"తెల్లని దేహం, దాన్ని దాచే గజ చర్మం. జటాజూట - సర్పహార శోభితుడై - శూలం, డమరుకం కలిగి ఉండి, రుద్రాక్షమాలికాధారియై, ఒడలంతా విభూతి అలముకొని తన దేహకాంతితో దిక్కులు వెలిగింప చేస్తూవుంటాడు. శాంత స్వభావుడు. చంద్రరేఖాధరుడు. ఆ మహాదేవుడు త్రినేత్రుడు కూడా!"
"మూడుకళ్లు దేనికీ?"
"రెండు కళ్లు సాధారణంగా దయతోచూసే చూపుకోసం!
మూడోది ఆయన తపోశక్తి చిహ్నం. అది అగ్ని సంయుతమైనది. అది తెరిచి చూస్తే ముల్లోకాలూ మసి అయిపోతాయి. అంతేకాదు ఆయన గురించి ఎంత విన్నా వినాలనిపిస్తుంది!
ఆయనను వర్ణించ ఎవ్వరి తరమమ్మా?
ఆయన నివాసస్థానం కైలాసం. వజ్ర, పరశు, ఖడ్గాది ఆయుధాలు ధరించి మహాశివుడుస్మశాన సంచారం చేసే వేళల భూతప్రేత గణాలన్నీ ఆయనను సదా వెన్నంటి సేవిస్తుంటాయి."
"అలా ఎందుకుంటాయి?"
"అది ప్రస్తుతం నీకు అర్ధం కాదమ్మా! శివుడంటే వైరాగ్య చిహ్నం!
కాని సర్వసన్మంగళకరు డాసదాశివమూర్తి. "
ఇటువంటివే పలుసార్లు శివసంబంధాత్మక భాషణలు అ తండ్రీ కూతుళ్ల మధ్య జరుగుతూండడం వల్ల, పార్వతి హృదయంలో శివ స్వరూపం ముద్రితమై పోయింది
. అందువల్ల ఇతరుల బోధనలతో అవసరం లేని విధంగా ఆమె మసస్సు, శివసానిధ్యంలో వసించడం ప్రారంభమైంది.
క్రమంగా ఆమె పెరిగి పెద్దదై త్రిజగన్మోహనాకృతిని దాల్చింది. వయస్సుకు అనుగుణమైన ఆమె తనూవిలాసం శతాధికమైంది.
🔱🔱🔱🔱🔱🔱🔱🔱
*షణ్ముఖం పార్వతీపుత్రం*
*క్రౌంచశైల విమర్దనం*
*దేవసేనాపతిం దేవం*
*స్కందం వందే శివాత్మజం*
🔱 *ఓం శరవణ భవ* 🔱
శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏
హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం - ఆచరిద్దాం
జై శ్రీకృష్ణ🛕🔱🏹🙏
జై శ్రీమన్నారాయణ🛕🛕🙏
ఓం అరుణాచల శివాయ నమః🙏
ఓం వాయులింగేశ్వరాయ నమః🔱🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప💐🙏
*సర్వే జనాః సుఖినో భవంతు* 🙏
🙏 ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః 🙏