🔰 *శ్రీ గణేశ పురాణం*🔰 23 వ భాగం

P Madhav Kumar

 *23.భాగం* 

*ఉపాసనా ఖండము*
*మొదటి భాగము*
*భల్లాల వినాయక కథనం*

ఆ కధా విధానాన్ని భీమరాజుకు వినిపిస్తున్న విశ్వామిత్రుడు యిలా కొనసాగించాడు :

ఓరాజా! ఈవిధంగా అతనిలోని క్రోధమనే పెద్దపులి వివేకమనే కుందేటిని కబళించగా ఆ వైశ్యుడు వివశుడై, దుష్కృత్యాన్ని జంకు లేకుండా ఆచరించి, ఇంటికి మరలిపోయాక, ఆ చిన్ని బాలకుడైన భల్లాలుడుమాత్రం గణేశునే అనన్యభక్తితో స్మరిస్తూ మనస్సులో యిలా విచారించసాగాడు.


'స్వామీ! ఓ జగత్ప్రభూ! దుష్టశిక్షణ నీకు వెన్నతోపెట్టిన విద్యగదా! విఘ్నాలను, దుష్టులను నశింపచేయటం వల్లనే నీకు విఘ్నహరుడన్న కీర్తి జగత్తులో ప్రఖ్యాతమైంది! ఓదేవా! భూభారాన్ని వహించే శేషుడా పనిని వీడవచ్చు, సముద్రాలను శోషింపచేసే సూర్యుడు తన కిరణాల తీక్షణతను వదలవచ్చు, అలానే అగ్ని తన ఉష్ణతనూ, వేడిమినీ కోల్పో వచ్చు కానీ నీవు నీ నిజభక్తులను ఎన్నడూ వీడవని శ్రుతులు ఘోషిస్తు నా! నీకీ ఉదాసీనత తగునా?' అంటూ ఏడుస్తూ తన తండ్రినిలా శపించాడు.


'నేను ఎంతగానో శ్రద్ధాభక్తులతో శ్రమించి నిర్మించిన ఈ ఆలయాన్ని ఎవరైతే భగ్నంచేసి తీరని దైవద్రోహం చేశారో, బాలుణ్ణి అని కూడా చూడక నన్ను చావచితకరమోదారో, నాకు అత్యంత ప్రేమాస్పదుడైన గణేశుని విగ్రహాన్ని విసరివేశారో అట్టి పరమ పాతకుడైన నాతండ్రి 'అంధుడు, కుబ్జుడు, బధిరుడు, శబ్దహీనుడు అవుగాక!' అని శపించి, 'నేను నిజమైన గణేశభక్తుడనైతే నా శాపము సత్యమౌగాక! నన్నైతే ఇలా ఆ పాపిబంధించగలిగాడే, కానీ నా మనస్సునూ, నా భక్తినీ ఆ దుష్టుడు బంధించలేడుకదా!


ఆ పరమ దయాళువైన గజాననుని పాదార విందాలనే ధ్యానిస్తూ, ఈ అరణ్యంలోనే శరీరాన్ని విడుస్తాను! నాతండ్రి కఱ్ఱతో మోదుతున్నప్పుడే నాదేహాన్ని ఆ దేవదేవునికి అర్పించాను!' అంటూ మనస్సులో "ధృఢంగా నిశ్చయించుకున్న ఆ బాలకుడైన భల్లాలుని ఎదుట గజాననుడు బ్రాహ్మణరూపంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సూర్యో దయ మవటంతోనే ఆకాశాన్ని చీకట్లు వీడినట్లు, ఆ దివ్యదర్శనం అవడంతోనే అతని దేహాన్ని బంధించిన బంధాలన్నీ విడిపోయాయి! అప్పుడు ఆ భల్లాలుడు అత్యంత ఆదరంతో ఆ బ్రాహ్మణునకు సాష్టాంగ నమస్కారము చేశాడు. శరీరంపైని గాయాలు రక్తస్రావమూ ఆశ్చర్యంగా మటుమాయమయ్యాయి! శరీరం దివ్యదేహంగా మారింది! అప్పుడు ఆతడు తన శ్రద్ధాభక్తులనే వాక్కులుగా చేసి ఇలా కీర్తించాడు.

*భల్లాలుడు గజాననుని స్తుతించుట*

చరాచర రూపమైన ఈ సకల జగత్తుకూ తల్లివీ, తండ్రివి, కర్తవ నీవేఐన ఓ విఘ్నేశ్వరా! నీ సంకల్పంవల్లనే కూృరులు, సజ్జనులు తమ తమ స్వభావాలకు యుక్తమైన తలిదండ్రులకు జన్మిస్తూన్నారు! అష్ట దిక్కులూ, ప్రాణాధారమైన గాలీ, సకల సముద్రాలూ, సూర్యచంద్రా గ్నులూ, సమస్త ఓషధులూ, ధాతువులూ నీ స్వరూపమేకదా ప్రభూ! అటువంటి నీ మహిమను బాలుడనైన నావాక్కులతో ఎలా ప్రస్తుతించ గలను? కేవలం నీ అనుగ్రహ విశేషం వల్లనే భక్తసులభుడవైన నీ దివ్య మంగళరూప దర్శనం నాకు కల్గింది!" అంటూ భక్తితో ప్రణమిల్లిన ఆ 'భల్లాలుణ్ణి ప్రేమతో లేవనెత్తి, అతనిని గజాననుడు ఆలింగనం 
చేసుకున్నాడు. భక్తవత్సలుడైన ఆ గణేశుడు! ప్రసన్నతతో అనుగ్రహాన్ని వర్షించే సుందరవదనంతో యిలా అన్నాడు.


'ఓ భల్లాలా! నా ఈ మందిరాన్నీ, నీచే అర్చించబడ్డ మూర్తినీ భగ్నంచేసినవారు ఘోరమైన దైవాపచారం చేసినవాడయ్యాడు. అతడు తప్పక నరకంలో పడతాడు. నా ఆజ్ఞచే నీవిచ్చిన శాపంకూడ తప్పక తగులుతుంది! అట్టివాడిని వాడి తండ్రికూడా ఆగ్రహంతో ఇల్లు వెడల గొడతాడు. ఓ బాలకా! నీభక్తికి ఎంతో ప్రసన్నుడనయ్యాను. కనుక ఎంతటి దుర్లభమైనదైనా వరాన్ని నీకు అనుగ్రహించ దలిచాను!' అని దరహాసం చిందించాడు.


అప్పుడా బాలకుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు!

"ఓ దీనబంధూ! నీ పదకమలాల యెడల అంతులేని దృఢభక్తిని నాకు సర్వదా ప్రసాదించు! నీవీ క్షేత్రంలో వెలసి సకల ప్రజలకూ విఘ్నములను పారద్రోలి అనుగ్రహించు!" అంటూ ప్రార్థించాడు.

ఆ ప్రార్ధనకు భక్తవత్సలుడైన గజాననుడిలా అన్నాడు. 'నీ పేరు ముందుగానూ, నాపేరు తరువాత కలిగి లోకంలో భల్లాల వినాయకుడన్న పేరు ఈక్షేత్రంలో స్థిరంగా వెలుస్తాను! నీకు సదా నా యందు దృఢభక్తినీ ప్రసాదించాను. ఈ వల్లి అనే పేరుగల క్షేత్రాన్ని భాద్రపద శుక్ల చతుర్ధినాడు యాత్రచేసి దర్శించేవారికి సకలాభీష్టములు నెరవేరుస్తాను!' అంటూ వరాలను అనుగ్రహించి వరదుడైన గజాననుడు అంతర్ధానమైనాడు. 


ఆతరువాత ఆ భల్లాలుడు వేదవిదులైన బ్రాహ్మణోత్త ముల ఆధ్వర్యంలో వైనాయకమూర్తిని ప్రతిష్టించి, సర్వాంగ సుందరమైన మందిరాన్నికూడా నిర్మించాడు!" అంటూ విశ్వామిత్రుడిలా అన్నాడు.. 


"ఓరాజా! నీ అభీష్టం మేరకు భల్లాలవినాయకుని చరిత్రను యావత్తూ వినిపించాను. ఎవరైతే పరమపావనమూ శుభకరమూ అయిన ఈ చరిత్రను శ్రద్ధాభక్తులతో ఆలకిస్తారో అట్టివారు తమ సర్వపాపములనుండీ విముక్తులై, తమతమ మనోభీష్టములను తప్పక పొందుతారు!" అంటూ చిరుదరహాసంతో శరశ్చంద్రునిలా అనుగ్రహ చంద్రికలను ప్రసరించాడు.


ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని 'భల్లాల వినాయక కధనం' అనే 
 అధ్యాయం.సంపూర్ణం.

 *సశేషం.....*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat