నవగ్రహ పురాణం - 26 వ అధ్యాయం - చంద్రగ్రహ జననం - 8

P Madhav Kumar


*చంద్రగ్రహ జననం - 8*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

బ్రహ్మదేవుడి మాట ఉన్నట్లుండి అత్రి మహర్షికి గుర్తుకు వచ్చింది. *"యజ్ఞకుండంలో హవిస్సులాగా... అనసూయ గర్భంలో..."* అత్రి శయ్యాగారం వైపు అడుగులు వేశాడు.

గోడవారగా మంచం మీద శయ్య - తెల్లగా హిమవేదికలా కనిపిస్తోందతనికి...

తెల్లటి శయ్య మీద తెల్లని వస్త్రాలు ధరించిన అనసూయ పవ్వళించి ఉంది. క్షీరసాగరం మీద 'అలవోకగా వంకీలు తిరిగిన సన్నటి అందమైన అలలా కనిపిస్తోంది. అనసూయ !

అనసూయ... తన ధర్మపత్ని ! అనసూయ... తన అదృష్టదేవత ! త్రిమూర్తులను తన గర్భసుధార్ణవంలో ధరించి , నవమాసాలూ భరించి , ప్రసవించి , స్తన్యమిచ్చి , లాలించి , పాలించి , ఆడించే అదృష్టవంతురాలు !

అత్రి ముందుకు కదిలాడు. వాతాయనంలోంచి తెల్లటి వెన్నెల ఆమె మీద కురుస్తోంది. అత్రి అప్రయత్నంగా వాతాయనంలోంచి ఆకాశంలోకి చూశాడు. చంద్రుడు ఎందుకో ఏదో నూతనోత్సాహంతో ధగధగలాడుతున్నాడు. అత్రి అప్రయత్నంగా చిరునవ్వు నవ్వుకున్నాడు. అందాల చందమామ తన అనుంగు పుత్రుడిగా జన్మిస్తాడు ! బ్రహ్మదేవుడి వాక్కు , ఆయన చెవుల్లో ప్రతిధ్వనించింది.

అత్రి తన చూపుల్ని అనసూయ మొహం వైపు తిప్పాడు. ఆకాశంలోని చంద్రుడు అవని మీదికి దిగి వచ్చాడా ? చంద్రబింబంలాంటి అనసూయ ముఖాన్ని ఆప్యాయంగా చూస్తూ అనుకున్నాడు అత్రి. నింగిలోని చంద్రుడు త్వరలో నేలకు దిగి వస్తాడు !

ఆయన ఆలోచనలను పసిగట్టినట్లు అనసూయ మూసిన కళ్ళను మెల్లగా తెరిచింది. ఆమె విశాల నేత్రాల కాంతిలో వెన్నెల తళుక్కుమంది జత కలుస్తూ. అనసూయ చిగురాకు పెదవుల్ని చిరునవ్వు విడదీసింది.

అత్రి మహర్షి ఆశ్రమం మునిపత్నులతో కళకళలాడుతోంది. నిండుచూలానైన అనసూయ పాలనురగలాంటి పరుపు మీద కూర్చుంది. ఆమె ముఖం ఏదో వింత వెల్తురుతో వెలిగిపోతోంది. గర్భంతో నునుపు దేలిన బుగ్గలు , ఆమె గర్భంలోని చంద్రుడ్ని చూపించే అద్దాల్లా ఉన్నాయి.

అనసూయ అదృష్టాన్ని మునిపత్నులు మెచ్చుకొంటూ సంబరపడిపోతున్నారు. ప్రసవ సమయంలో దగ్గరుండి చూసుకుంటామంటూ ధైర్యం చెప్పారు కొందరు. చిరునవ్వుతో కదుల్తున్న అనసూయ పెదవులూ , మెరుస్తున్న కళ్ళూ మహిళలందర్నీ మౌనంగా పలకరిస్తున్నాయి.

శీలవతి అనసూయ జడలో పూలు తురిమింది. మరో ముత్తైదువ అనసూయ నుదిటి మీద పూర్ణ చంద్ర తిలకం దిద్దింది. అందరికీ ఎడంగా నిల్చున్న అత్రి చూపులు అనసూయ ముఖ మండలం మీదే తాపడం అయిపోయి ఉన్నాయి. ఎంత చూసినా... ఇంకా, ఇంకా చూడాలనిపిస్తోంది... అలా సమ్మోహనకరంగా , దివ్య సౌందర్యభరితంగా ఉంది. అనసూయ ముఖం. ఎంత చూసినా విసుగనిపించని నిండు చంద్రుడిలా ఉంది ఆ పూర్ణగర్భిణి వదన సౌందర్యం.

*"ఏమిటి స్వామీ... ఆలోచిస్తున్నారు ?"* అనసూయ ప్రశ్న అత్రిని హెచ్చరించింది. అంతసేపూ రెప్పపాటు లేకుండా అనసూయనే చూస్తున్న అత్రి కళ్ళ మీదికి రెప్పలు వాలి , టపటపలాడాయి. అత్రి ఆకాశంలోంచి దిగి చుట్టూ చూశాడు. అందరూ వెళ్ళిపోయారెప్పుడో !

*"అలా చూస్తూనే ఉన్నారు. ఆలోచిస్తూనే ఉన్నారు ! ఏమిటి స్వామీ ?"* అనసూయ
గర్భ భారంతో నెమ్మదిగా అడుగులేస్తూ అత్రి ముందు ఆగి , ఆయన మొహంలోకి చూసింది.

*"నిన్ను చూస్తూ నన్ను నేను మరిచిపోయాను... !"* అత్రి నవ్వుతో అన్నాడు. *"నీ నవ్వు ముఖంలో పున్నమి చంద్రుడు కనిపిస్తున్నాడు ! ఔను ! నేను నిజంగా అదృష్టవంతుడిని. సంకల్పంతో నాకు జన్మ యిచ్చిన తండ్రి బ్రహ్మదేవుడు నా కొడుకుగా నా ఇంట్లో తిరుగాడబోతున్నాడు. అంతకన్నా భాగ్యం మరొకటేముంది ?''*

*"ఆ అదృష్టంలో సగం నాది కదా , స్వామీ !"* అనసూయ చిరునవ్వుతో అడిగింది.

*"నీది కేవలం అదృష్టం కాదు అనసూయా ! మహద్భాగ్యం ! సంతానం కోసం నువ్వు నోచిన నోములు , చేసిన పూజలు సామాన్య ఫలాన్ని కాదు , అమర ఫలాన్ని ఇస్తున్నాయి !"* అత్రి మెప్పుగా అన్నాడు.

అనసూయా , అత్రీ పక్కపక్కనే నడుస్తూ వెళ్లి , గవాక్షం ముందు నిలబడ్డారు. ఆకాశంలోంచి చంద్రుడు కనిపిస్తున్నాడు.

*"నింగిలోని వెన్నెల రేడు నేలకు ఎప్పుడు దిగివస్తాడు ?"* అత్రి నవ్వుతూ అడిగాడు.

*"నెలలూ , వారాలూ కాదు... రోజులే !"* అనసూయ చిరునవ్వుతో అంది , తన తలని భర్త భుజంమీదికి వాల్చి , చంద్రుణ్ని తదేకంగా చూస్తూ...

అది సౌమ్య నామసంవత్సరంలో కార్తీక మాసం , శుద్ధ దశమి , అనసూయ ముద్దులు మూటగడుతున్న అందాల బాలుణ్ని ప్రసవించింది.

సృష్టికర్త బ్రహ్మదేవుడు , రజోగుణం మూర్తీభవించిన చంద్రుడిగా అవతరించాడు.

అత్రి మహర్షి పుత్రుడి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు. త్రిమూర్తులూ , వారి పత్నులూ , బ్రహ్మ మానసపుత్రులూ , వారి పత్నులూ , కశ్యప ప్రజాపతీ , ఆయన పత్నులూ , ఇంద్రాది దేవతలూ , వారి పత్నులూ , దేవర్షి నారదుడూ ఆ కార్యక్రమానికి విచ్చేశారు.

బ్రహ్మదేవుడు తన అంశరూపానికి స్వయంగా 'చంద్రుడు' అని నామ నిర్దేశం' చేశాడు.

*“చంద్రుడు - చల్లని గ్రహం. చల్లదనంతో లోకాలను ఆహ్లాదపరుస్తాడు. భవిష్యత్తులో నవగ్రహ దేవతలలో ఒకడుగా పట్టాభిషిక్తుడై , ఆరాధనలు అందుకుంటాడు !”* అన్నాడు శ్రీమహావిష్ణువు.

దేవతలందరూ బాలచంద్రుణ్ని దీవించారు.

🙏 సకల నవగ్రహ దేవతాయ నమః 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat