🔱 *కుమారచరిత్ర* -4 🔱

P Madhav Kumar


🙏శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః* 


తారకాసుర వృత్తాంతం

తారకాసుర సంహారానికి శివపార్వతుల కళ్యాణం ఎంతో ముఖ్యం.
వారి ప్రణయ సమాగమమే ఇంకా జరుగలేదు - ఇక పెళ్లి వరకు ఎలా తీసుకురావడం?
సూతమహర్షి చెప్తున్న కథా సంవిధానం సంభాషణాత్మకంగా ఉండడంతో, ఆయా దృశ్యాలు అన్నీ తమకళ్లకు కట్టినట్టు - అవన్నీ తమ కళ్ల ఎదుటనే జరుగుతున్నట్లు అనుభూతి చెందిన శౌనకాది మహామునులందరికీ ఈ సందేహం ఉదయించింది.

అది వెంటనే నివృత్తి చేసుకోదలచి
"మహాత్మా! పౌరాణికగాధా శ్రవణానందబ్రహ్మా! మాకొక సందేహం! దేవతలనింతగా బాధిస్తున్న ఈ తారకాసురుడెవరు? అతడు పొందిన వరమేది? ఈ గాధతో సంబంధం వున్నందున అతని వృత్తాంతము కూడ వివరించ గోరుచున్నాము" అని పలికారు.

"అవశ్యం! అట్లే చేసెద" అని ఆ రోమహర్షణపుత్రుడు తారకాసుర కథ నిట్లు చెప్పసాగాడు.

.కశ్యప ప్రజాపతి మరియు దితి ల కుమారుడు వజ్రాంగుడు.

ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి ‘నీకు ఏమి కావాలనుకుంటున్నావు? నీవు ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు.

అపుడు అతని భార్యయైన వరాంగి ‘ముల్లోకములను గెలవగలిగిన వాడు పాకశాసనుని కన్నుల వెంట నీళ్ళు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు’ అన్నది.

పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు

. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి ‘స్వామీ, వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి’ అని అడిగాడు.

వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. 
వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకు వచ్చి ఆ పిల్లవానికి ‘తారకుడు’ అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది. 
తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు.

వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడి పోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా 
నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. 

ఇప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు.

ఒక్క కాలుమీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. అలా నూరేళ్ళు తపస్సు చేశాడు. తరువాత ఉగ్రతపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తోంది. అపుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకములనన్నిటిని కాల్చేస్తోంది.

అపుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకముల నన్నింటిని కాల్చేస్తోంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు. అపుడు బ్రహ్మ వెళ్ళాడు.

తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయి నాయనా ఏమిటి నీ కోరిక? అని అడిగాడు.

బ్రహ్మకు తారకుడు  నమస్కరించి ‘దేవతలనందరినీ, మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఈయవలసింది. 
పురారి అయిన పరమశివుడు మన్మథుని దహిస్తాడు. ఆయన కామారి. ఆయనకీ కోరిక లేదు. అటువంటి పరమశివునికి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది’ అని అడిగాడు.

బ్రహ్మ సాంబసదాశివుని తలుచుకుని తథాస్తు అని భారంగా హంసను ఎక్కివెళ్ళిపోయాడు.

తారకుడిని మూడు లోకములకు రాజ్యాభిషేకం చేసేశారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏయే పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు.

ఇపుడు వాళ్ళందరూ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్ఛి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు.
శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. 
అప్పటికిఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీమహావిష్ణువు అక్కడినుండి తప్పుకున్నాడు.

ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ‘ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగ మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి’ అని వేడుకున్నారు.
ముందు వెనుకలు చూడకూండా బ్రహ్మ ఇచ్చిన వరాలతో, దేవతలకే శిరోవేదన కలిగించేవా డయ్యాడు. ఆలోచించకుండా వరాలిచ్చినందుకు బ్రహ్మకే తలపట్టుకోవాల్సిన స్థితి కల్పించాడు. అదీ సంగతి" అని తారకాసురుని వృత్తాంతం చెప్పాడు సూతుడు.

*హే స్వామినాథ కరుణాకర దీనబంధో,*
*శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |*
*శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ*
*వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 1*

🔱 *ఓం శరవణ భవ* 🔱

శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...🙏
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

🙏 ఓం శరవణ భవ 🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat