🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷
*బుధగ్రహ జననం - 6*
*"నవ్వితే నీ ముఖంలో అందం వెయ్యింత లవుతుంది తెలుసా ?"* తార అంది. *"ఇప్పుడు నా రెండో ప్రశ్నకు - మొదటి సారి వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పు ! నేను అందంగా ఉంటానా , మీ అమ్మగారు అందంగా ఉంటారా ?”*
ఆరోజు , ఆశ్రమంలో , భోజన సమయంలో తార అడిగిన ప్రశ్న ! తను మరిచేపోయాడు ! చంద్రుడు ఆలోచిస్తూ తారను పరికించి చూశాడు.
ఆమె శరీరాన్ని అంటిపెట్టుకున్న పువ్వులు ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో చిరుగాలికి. కదుల్తున్నట్టు కదుల్తున్నాయి. మొక్కలకి అతుక్కుని ఉన్నప్పటి కన్నా తార శరీరం మీద పువ్వులు ఎక్కువ అందంగా కనిపిస్తున్నాయి !
*"చెప్పు చంద్రా ! ఎవరు అందంగా ఉన్నారో ?"* తార నవ్వుతూ హెచ్చరించింది.
చంద్రుడి మనో నేత్రం ముందు అనసూయ ప్రత్యక్షమైంది. క్షణంలో అంతర్థానమైంది. ఎవరు అందంగా ఉన్నారు ? తార ప్రశ్నకు సమాధానం దొరికింది చంద్రుడికి , అమ్మ అందం అనునయించే అందం. తార అందం రెచ్చగొట్టే అందం ! అమ్మ అందం జోలపాడే అందం ! తార అందం మేలుకొలిపే అందం !
తార చెయ్యి అతని చేతిని నొక్కుతూ ధ్వని లేని భాషలో ఏదో చెప్తోంది. *"చెప్పకపోతే , నా చిలకని రమ్మంటాను సుమా !"* తార హెచ్చరిస్తూ అంది. *"ఎవరు అందంగా ఉన్నాం ? మీ అమ్మా , నేనా ?”*
*"నువ్వే..."* తీగలాంటి తార శరీరాన్ని తనివితీరా చూస్తున్న చంద్రుడు అన్నాడు. ఏకవచన ప్రయోగం ! అప్రయత్నంగా ఆమెను 'నువ్వే' అన్నందుకు చంద్రుడు. ఆశ్చర్యపోయాడు.
*"నా భర్తా , నువ్వూ - మీ ఇద్దల్లో ఎవరు అందంగా ఉంటారో తెలుసా , నీకు ?"* చంద్రుడి ఆశ్చర్యాన్ని తీగలు సాగిస్తూ ఉన్నట్టుండి అడిగింది తార.
*“... తారా !"*
*"అడుగు !"* తార కవ్వింపుగా అంది. అతని చేతిని వేళ్ళతో నొక్కుతూ.
*"తారా...”* అన్నాడు చంద్రుడు మళ్ళీ.
*"అడగకపోయినా , చెప్తాను ! నువ్వే అందంగా ఉంటావు"* అంటూ చంద్రుడి చేతిని తన చెంపకు ఆన్చుకుంది తార. *"ఇలా నా దగ్గరగా , రాచంద్రా !"*
*"తారా !"*
*"మన మధ్య ఉన్న దూరాన్ని దూరంచేయ్ !"* పువ్వుల్లో దాగి ఉన్న తార కుడిచెయ్యి లతలా కదిలి , చంద్రుడి భుజం మీద వాలింది. *"తారా... గురువుగారు...”* చంద్రుడు అప్రయత్నంగా అన్నాడు.
*"మనిద్దరి మధ్యా గురువుగారు కాదు , గాలి కూడా ఉండటానికి వీలు లేదు !"* తార కంఠంలో నిర్ణయం జీరగా ధ్వనించింది. ఆమె చేతులు అతని మెడ చుట్టూ లతల్లా అల్లుకున్నాయి. నదిని ఆకర్షిస్తున్న సముద్రంలా - తార సౌందర్యం , తారా ప్రణయం అతన్ని ఆకర్షిస్తూ లాగుతున్నాయి. చంద్రుడు ముందుకు వాలాడు. అతని చెంప తార చెంప మీద ఆనింది.
నిద్రపట్టని చంద్రుడు మౌనంగా నవ్వుకున్నాడు. మొదటిసారిగా ఆశ్రమ ప్రాంగణంలో అడుగుపెట్టిన క్షణం నుంచి తార కళ్ళు తనను వేటాడాతున్నాయి. వాతాయనంలోంచి తనను చూసిన క్షణం నుంచి ఆమె చూపులు తన చూపుల్ని లాగుతూనే ఉన్నాయి. తనను ఆశ్చర్య పరుస్తూ , అచిరకాలంలోనే తార తనకు మానసికంగా చాలా , చాలా దగ్గరైపోయింది. అది ఎప్పటి అజ్ఞాత సంబంధమో - ఏనాటి ప్రణయ బంధమో !
*“నదిలో జలక్రీడ హాయిగా ఉంటుంది ! రేపు సూర్యోదయ సమయానికి మనిద్దరం నది వద్ద ఉండాలి !"* పొదరిల్లు వదిలి వెళ్ళే ముందు తార అన్న మాటలు చంద్రుడి చెవుల్లో ఉన్నట్టుండి గింగురుమన్నాయి. చంద్రుడు నిద్రను ఆహ్వానిస్తూ పక్కకి తిరిగాడు....
తార నదిలో మత్స్య కాంతలా ఈదుతోంది. ఆమె చేతులు బంగారు తీగల్లా కదుల్తున్నాయి. కాసేపు ఈదులాడిన చంద్రుడు నీటి అంచున నిలబడి తార 'జలలాస్యాన్ని' కన్నులపండుగలా చూస్తున్నాడు. తార కాసేపు వెల్లకిలా నీళ్ళ మీద జారుతోంది. కాసేపు బోర్లా తిరిగి వేగంగా వెళ్తుంది. జలక్రీడలో ఆమెకు అద్భుతమైన నైపుణ్యం ఉన్నట్టుంది. ఆమెతో పాటు జలక్రీడ ఆడటం కన్నా ఎదురుగా నిలబడి ఆమె జలకేళీ సౌందర్యాన్ని ఎంతసేపైనా ఆస్వాదించాలనిపిస్తోంది , చంద్రుడికి.
తార తల నీళ్ళ మీద ఉండేలా , అతని వైపే చూస్తూ నీళ్ళని రెండు చేతుల్తో వెనక్కి తోస్తూ వస్తోంది. నీటిలోంచి నిక్కి చూస్తున్న కన్నె పద్మంలా ఉంది తార ముఖం. పొడుగాటి జుత్తు ఆ పద్మాన్ని అంటిపెట్టుకున్న నాచులా ఆమె వెంట వస్తోంది.
తార చంద్రుడి వైపు నవ్వుతూ చూస్తూ , *"రా , చంద్రా !"* అంది. చంద్రుడు తల అడ్డంగా ఊపాడు. తార వేగంగా ఈదుతూ వచ్చి , నడుంలోతు నీళ్ళలో ఆగి , నిలుచుంది. తడిసిన వలువల వెనక - నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది ఆమె శరీరం చంద్రుడికి.
రెండు చేతుల్తో పొడుగాటి జుత్తును సర్దుకొని చేయూత ఇమ్మన్నట్టు చెయ్యి చాచింది తార , చంద్రుడి వైపు. చంద్రుడు కుడిచేతిని ఆమెకి అందించాడు. మరుక్షణం తార అతన్ని బలంగా లాగింది. చంద్రుడు తూలి ఆమె ముందు పడి , ఉక్కిరిబిక్కిరి అవుతూ లేచాడు. తార చేతులు అతన్ని బంగారు గొలుసుల్లా అల్లుకున్నాయి. ఇంకా ఉక్కిరిబిక్కిరయ్యాడు.
బృహస్పతి విద్యార్థులకు పాఠ ప్రవచనం చేస్తున్నాడు. విద్యార్థులు ఏకాగ్రతతో వింటున్నారు. చంద్రుడు అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వచ్చాడు. చప్పుడు చేయకుండా , గురువుగారి దృష్టిని ఆకర్షించకుండా పంక్తిలో కూర్చోబోయాడు.