⚜️ కేరళ తిరు ఓణం ⚜️
ఇది కిలకిలల పండుగ ! పువ్వుల పండుగ !! ఆనందోత్సాహాల పండుగ !! కంటికి ఎంతో ఆనందాన్ని , పరిసరాలకి ఎంతో శోభనిచ్చే వివిధ రీతులలో రంగు రంగుల పువ్వుల అలంకరణ ఈ పండుగ ప్రత్యేకత. ఆగష్టు , సెప్టెంబరు నెలల్లో వచ్చే శ్రావణ లేక భాద్రపద మాసాలలో ఈ పండుగ వస్తుంది. అప్పటికి వరినాట్లు పూర్తవుతాయి.
రైతులు తీరిక సమయం , వినోదాలతో సంతోషంగా గడుపుతారు. ఓణం పండుగకు సంబంధించిన కథ ఒకటి వుంది.
పూర్వం మహాబలి అనే రాక్షసరాజు కేరళను పాలించేవాడు. రాక్షస రాజ్యం. అతడెంతో తెలివైనవాడే గాక మంచి ప్రభువుగా కూడా పేరొందాడు. ప్రజలకి అతని పట్ల ఎంతో అభిమానం. భూమితోపాటు స్వర్గ నరకాలకి కూడా అతని పరిపాలన విస్తరించింది. అందుకే దేవతలకు అతడంటే కోపం , అసూయ. దేవతల రాజు ఇంద్రుడు అతడ్ని జయించడానికి కుట్రపన్నాడు. త్రిమూర్తులలో ఒకడైన విష్ణుమూర్తిని ఆ పథకాన్ని అమలు చేయమని కోరాడు. వామనుడు అను పేద బ్రాహ్మణుని వేషంలో విష్ణువు రాక్షసరాజు వద్దకు వెళ్ళి తనకు మూడు అడుగుల నేల కావాలని అడిగాడు. ఎంతో ఉదారుడైన మహాబలి అందుకు అంగీకరించాడు. వెంటనే వామనుడి ఆకారం పెరగడం ప్రారంభమైంది. చివరకు విశ్వమంతా విస్తరించిన విరాట్ స్వరూపమైంది వామనుడి ఆకారం. అతి పెద్దవైన తన అడుగులతో ఒక అడుగును పూర్తిగా భూమిని , రెండవ అడుగును పూర్తిగా
ఆకాశాన్ని , మరొక అడుగు ఎక్కడ పెట్టాలని మహాబలిని అడిగాడు.
తన తలమీద పెట్టమని తలవంచి వామనుడి ముందు వుంచాడు మహాబలి. తక్షణమే వామనుడు అతడి తలమీద అడుగు పెట్టి పాతాళలోకం వరకు అతడిని అణగదొక్కాడు. కానీ మహాబలి వామనుడిని ఒక వరం అడిగాడు. సంవత్సరాని
కొకసారి ప్రజలను చూసేందుకు భూలోకానికి రావడానికి అనుమతి కోరాడు. అతడి కోరికను వామనుడు అంగీకరించాడు. మహాబలి చేసిన త్యాగాన్ని ప్రశంసిస్తూ జరుపుకునే పండుగే ఓణమ్ ! మహాబలి పరిపాలనా కాలాన్ని కృతజ్ఞతతో జ్ఞప్తికి
తెచ్చుకుంటూ అతడు భూలోకానికి వచ్చే రోజును వైభవోపేతంగా ,
శోభాయమానమైన పర్వదినంగాను కేరళ ప్రజలు జరుపుకుంటారు. పది రోజుల బాటు జరిగే పండుగ ఇది. తొలిరోజున మహాబలికి ఘనస్వాగతం పలుకుతారు.
చతురస్రాకారపు పిరమిడ్ల వలె మట్టి దిబ్బలను తయారు చేస్తారు. అవి
మహాబలికి , విష్ణుమూర్తికి సంకేతాలు. పేడతో అలికిన ముంగిళ్ళలో వాటిని పెట్టి పువ్వులతో అలంకరిస్తారు. తర్వాత నృత్యాలు , ఆటలూ వుంటాయి. *'కై కొట్టిక్కళి'* అనే
చప్పట్లు కట్టి చేసే ప్రత్యేక నృత్యం , కొన్ని ఆటలు చాలాకాలంగా ఓణమ్ పండుగలో భాగమయ్యాయి. *'అరన్ మూళ'* అనే ఊరులో పడవ పందాలు , అత్యంత ఆనందోత్సాహాలతో జరుగుతాయి. పాము ఆకారంలో అతి దీర్ఘంగా వుండే పడవలను ఎంతోమంది ఎంతో వేగంగా నడిపి చూపరులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తారు ! ఆ రోజు ప్రతిఇంటా విందు చేసుకుంటారు. ఇంటి పెద్ద కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాల్ని బహూకరిస్తాడు. మహాబలితో అతనిని రాజ్యం నుంచి బహిష్కరించి
పంపివేసిన విష్ణుమూర్తిని కూడా ఆరాధించడం ఓణమ్ పండుగ ప్రత్యేకత ! కొచ్చిన్ సమీపాన గల త్రికట్కార్' అనేచోట వామనుడి ఆలయం నిర్మించడంతో (క్రీ.శ. 8వ శతాబ్దంలో) ఓణమ్ పండుగకు ప్రాచుర్యం పెరిగింది.
🙏🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌺🙏