⚜️ తిరుగు ప్రయాణం - దీక్షా విరమణ ⚜️
శబరిగిరిపై చేయవలసిన ఆరాధనలను చేసికొని చూడవలసిన ప్రదేశములను చూచి , జ్యోతి దర్శనము , తిరువాభరణ సేవయూ చూసుకొన్న భక్తులు తిరిగి తమ తమ తావళములను చేరుకొని ప్రసాదము మొదలుగునవి సేకరించుకొన్నవి ఇరుముడి యొక్క ముందుభాగమున కట్టుకొని గురువుకి దక్షిణ తాంబూలాదుల నొసంగి నమస్కరించి , గురువుతో కలసి ఆలయము యొక్క ఉత్తరము వైపునున్న మార్గమున సన్నిధానము చేరుకొని నమస్కరించి , తన శక్తి నంతయూ కూడా గట్టుకొని శరణుఘోషలు పలికి , స్వామి అయ్యప్పకు వారి వారి శక్తి కొలది కానుకలు సమర్పించి ప్రదక్షిణము చేసి ధ్వజస్తంభము చూసి ఆ మణికంఠస్వామితో ఏటేటా శబరిగిరి యాత్ర చేయు భాగ్యమును పునర్దర్శన ప్రాప్తిని కలిగించమని కోరి , పావన అష్టాదశ సోపానము పై నుండి స్వామికి అభిముఖులై దిగి మెట్లకు కుడివైపునున్న గోడపై కొబ్బరికాయ కొట్టి నమస్కరించి దిగవలెను. అతి జాగ్రత్తగా భయ భక్తులతో ఆ పదునెనిమిది మెట్లు దిగిన తరువాత *'వెడివయిపాడు'* (టపాకాయలు పేల్చుట) జరిపి ప్రణామములు చేయవలెను. పిదప శబరిపీఠము శరంకుత్తి అప్పాచి మేడు , నీలిమల
ఇరక్కం దారిగా పంబానది చేరుకొని శ్రీరామచంద్ర మూర్తిని శ్రీ హనుమాన్‌ను , శ్రీగణపతిని దర్శించి నమస్కరించుకొని , చాలక్కాయము మార్గముగా వారి వారి స్వగృహములకు మరలవలెను. మరలు మార్గములో ఎవరూ ఆగి విశ్రాంతి తీసుకొని
కాలయాపనము చేయరు. చాలాక్కాయం నుండి అనేక బస్సులు అనేక నగరములకు బయలుదేరుచునే యుండుట వలన కాల వ్యయము లేక మన గ్రామములకు చేరుకొను అవకాశములు ఉండును.
స్వగృహమును చేరుకున్న పిదప దీపములు వెలిగించి 108 శరణములకు తక్కువ కాకుండా శరణములను పలుకుతూ (ఇరుముడిని నేలదింపి) కర్పూర హారితి ఇచ్చి , తరువాత గురుస్వామికి నమస్కరించి ధ్యానశ్లోకమును చెప్పి గురుదక్షిణ ఇచ్చి
సర్వేశ్వరుని కృపాకటాక్షము వలననూ , గురుస్వామి అనుగ్రహ సహాయములతోనూ శబరిగిరికి వెళ్ళి సౌఖ్యముగా తిరిగి వచ్చినందుకు గురుస్వామికి భోజనమిడి , వస్త్రదానము మొదలగునవి యథాశక్తి చేసి ఉపచరించవలెను. గురుస్వామి మంత్రము చెప్పి మాలా విసర్జనము చేసి , దీక్ష విరమింప చేయుదురు. మాలను తీసి చందనములో
అద్ది స్వామివారిని కొండ ఎక్కించవలెను. తరువాత ఇంటిలో ప్రసాదములను పంచిపెట్టి స్వామి పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి వెలుగుతున్న దీపమండలమును పెద్దది చేసి తానే ఆరిపోవునంత వరకూ మండించవలెను. ఇంతవరకూ వ్రతకాలమందు తనకు తోడుగా ఉన్న అయ్యప్పస్వామి ఆ దీపజ్యోతిలో కలసిపోతారన్నది ఐతిహ్యము. అయితే పుష్యమాసము ఏడవ దినము వరకు మాలతీయక వ్రతముండి , శబరిగిరిపై కురిది పూజ ముగిసి శబరిగిరి ఆలయము మూసిన పిదప మాల తీసిన శ్రేష్ఠము , శ్రేయస్కరము. ఈ పై విధముగా వ్రాసినట్లు వ్రతానుష్టానముతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండై సచ్చిదానంద స్వరూపుడై తారక బ్రహ్మ మూర్తియై శబరిగిరిపై అధివసించియున్న శ్రీ భూతనాథుని (శ్రీ అయ్యప్ప స్వామిని) దర్శనము చేయు ప్రతి భక్తునకు పరమానంద ప్రాప్తి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి భగవత్ కరుణా కటాక్షము లభించవలయునని ప్రార్థిస్తూ ఈ వ్రతానుష్టాన పద్ధతులను చక్కగా ఆచరించి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులకు పాత్రులు కావలయునని సోదర భక్తులను ప్రార్థిస్తూ సెలవు తీసుకొనుచున్నాను.
🙏💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప💐🙏