నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు.
ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది.
ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి.పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ
ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ,
తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి.స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి.
ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం.ఆ కోనేరే నేటి రుద్రతీర్థం.
*నారాయణీయం*
16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేద శాస్త్రాలు ఔపోసన పట్టాడట.
ఇరవై యేడేళ్లకే పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. ఎన్ని మందులువాడినా ఫలితం లేకపోవడంతో గురువాయురప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట.
ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు.
రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు.
బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితోచేసిన తీపిరొట్టెలు ,కొబ్బరి ఉండలు , కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు.
పుత్తడితో చేసిన స్వామి ఉత్సవ విగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు.
అన్నప్రాశన, వివాహం లాంటి వేడుకలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి.ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం.
తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరి కాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు.
*గజేంద్ర సేవ*.
గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని వూహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవన్‌ల గురించిన గాథలెన్నో. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు ఈ దేవాలయం లో ఏనుగులతో జరిగే శివేలీ ఉత్సవాన్ని తప్పక చూడాలి.
*మమ్మియూర్ మహాదేవ ఆలయం*
గురువాయూరప్పన్ ఆలయానికి సమీపంలో ఉన్నది. పేరులో సూచించినట్టుగానే ఇది మహాదేవుని(శివుని) ఆలయం.
ఈ గుడి అందమైన కూడ్య చిత్రాలచే అలంకరించబడి ఉంటుంది. విష్ణు మూర్తిని మోహినీ అవతారంలో చూపించిన చిత్రాన్ని కూడా చూడవచ్చు.మమ్మియూర్ మహాదేవ ఆలయాన్ని చూడకపోతే గురువాయూర్ పర్యటన పూర్తి కాదని చెబుతారు. కనుక ఈ దేవాలయాన్ని భక్తులు తప్పక సందర్శించుకుంటారు.
*పార్థసారథి దేవాలయం, గురువాయూర్*
పార్థసారధి దేవాలయం గురువాయూర్ పట్టణంలో ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయంలోని విగ్రహం ఆదిశంకరాచార్యుల వారిచే ప్రతిష్టించబడింది.
ప్రధాన దేవాలయం రధం ఆకారంలో వుంటుంది. దేవాలయ గోడలు కళాత్మక చెక్కడాలు కలిగి వుంటాయి.
గురువాయుర్ కేరళ రాష్ట్రం లో అధిక సంఖ్యలో భక్త జనులను ఆకర్షించే దివ్య క్షేత్రం...
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔