⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
Part 2
మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి(వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండడం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం సంపంగి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందువల్ల ఇలా పిలవబడుతోంది.
ఈ ప్రాకారంలో ...
అద్దాలమండపం,
రంగనాయక మండపం,
తిరుమలరాయ మండపం, ధ్వజస్తంభమండపం,
శ్రీవేంకటరమణస్వామి కల్యాణమండపం,
ఉగ్రాణం,
విరజానది,
పడిపోటు,
వగపడి అర
తదితర మండపాలున్నాయి.
కృష్ణరాయమండపం
మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో ఉన్న ఎత్తైన మండపమే కృష్ణరాయమండపం. దీనినే ప్రతిమామండపం అని కూడా అంటారు.
లోపలికి ప్రవేశిస్తున్నపుడు కుడివైపున రాణులు తిరుమల దేవి, చిన్నాదేవులతో కూడిన శ్రీకృష్ణరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు.
అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగిప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి.
శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాడు.
రంగనాయక మండపం
కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతోపాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.
తిరుమలరాయ మండపం
రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాల మండపమే తిరుమలరాయ మండపం.
ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించగా,(సాళ్వ నరసింహ మండపం) ఆ తర్వాతికాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించాడు.
ఈ మండపాన్ని ..…అణ్ణాఊయల మండపం..... అని అంటారు. అణ్ణై అనగా హంస.బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.
అద్దాల మండపం – అయినామహల్ -
Lప్రతిమా మండపానికి ఉత్తరం దిక్కున ఉన్నదే *అద్దాల మండపం*. దీన్నే అయినామహల్ అని కూడా అంటారు. అయినా అనేది హిందీ పదం. తమిళంలో కన్నాడి అరై అంటారు.
ధ్వజస్తంభ మండపం -
ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది.
ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు.
ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎత్తైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారు రేకు తాపబడింది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని(అన్నాన్ని)ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.
మిగిలిన విశేషాల గురించి రేపు
తెలుసుకుందాం...
నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా..
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️