తిరుమల తిరుపతి దేవస్థానము వారి ఆర్థిక సహాయముతో 1988 సం. జనవరిలో ముద్రిత మైనది.
1. శ్రీకర భువనమోహన శివనుతపద
జానకీనాధ ఇనవంశజాత జలజ
దళనయన దయానిధి సత్యధర్మనిరత
భద్రగివాస రఘురామ భక్తవరద.
2. భానుకులయశోభూషణ భాసురగుణ
ధామ కరుణాసుధోదధీ దైత్యహరణ
దేవ దీనజనశరణ్య దివ్యచరణ
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
3. తనివితీరగ నిన్ను జూత మనుకొన్న
నేను జ్ఞానిని కానయ్య నీరజాక్ష
నీ చరణ దాసినై స్మరియించు దాన
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
4. జపతప0బు లెరుంగను జానకీశ
వేరు దైవ మెరు0గను విమలచరిత
నాకు సర్వము నీవని నమ్మితిమది
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
5 ఎరుగ నిల జ్ఞాన మార్గంబు నెరుంగ నెంత
మాత్రమును నీదు మహిమను మరి, యెరుంగ
నీ స్వరూపము నెరుగను నీదు మాయ
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
6.బ్రహ్మ రుద్రుల కైనను వశముగాదు
నీదు మహిమ దెలియుట కనిన నెరుంగ
వశమె నా యల్పమతికి పావన.చరిత్ర
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
7. బుధ్ధిగలిగినదాదిగ భువనపాల
భక్తిబూజించుచున్నాను భావమందు
నీదు దివ్యరూపంబునే నిర్మలాత్మ
భద్రగిరివాస రఘురామ భక్తవరద
8. క్షీరజలధిగ నామదిన్ జేసి యందు
పవ్వళి0పుమా దయబూని భానుతేజ
భక్తపరిపాల విష్ణురూప పరమాత్మ
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
9. భక్తి నిన్ను గొల్చి శబరి బడసె ముక్తి
భక్తి నిను గొల్చి వాల్మీకి బడసె ముక్తి
నీదు సత్కృప వలనన్ మునిజన గేయ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
10.స్వామి శబరిని గాలేను భక్తియందు
యజ్ఞ కర్మల నెరుగనయ్య నిఖిలాత్మ
ముక్తి యన నెట్టిదో దాని మూల మెరుగ
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
11.ఈవె తల్లియు దండ్రియు నింక గురువు
నిక్కముగ నాకనుచు నమ్మి నిన్ను వేడి
శరణు సొచ్చితి నను గావ నొరులు గలరె?
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
12. పద్యము తెలిసె సంసార సుఖము లస్థిరము లనుచు
తెలిసె నీ సన్నిధానమే స్థిర మనుచును
నన్ను నమ్ము మయ్య మునిజనార్చిత పద
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
13.శక్తి నశియించె సంసార జలధి నీద
విన్నవించితి నీకు వేవేగ ప్రోవ
దేవ జాలము వలదయ్య దీన పాల
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
14 నిన్నె మదినమ్మి సేవి0చు నన్ను వీవు
యిటుల శోధింప పాడియా యినకులమణి
దీప దాశరథి దయానిధీ మహాత్మ
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
15 భ్రమరమగు నా మనంబు నీ పదము లనెడు
మధుర నీరజముల జేరి మరిమరి మక
రందమున్ ద్రావనిమ్ము సూర్యకుల తిలక
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
16.కోర సుఖసంపదలను నే కోర నింక
ఆయురారోగ్యములను నే ననవరతము
నీదు సన్నిధి కోరెద నిత్యతేజ
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
17. కాంచవలయు నీ రూపంబు కన్ను లెపుడు
పలుక వలయు నీ నామ మింపలర నాల్క
చేయ వలయు నీ పూజలు చేతు లెపుడు
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
18.స్వామి నీలమేఘశ్యామ సుమముగ నను
నీ పదమ్ములపై నిల్వ నీయ వయ్య
ధన్య మొందును జన్మంబు ధన్య చరిత
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
19. రమ్య రీతి నీ మీద నే వ్రాయవలయు
కావ్య మనుచుల్లమున కోర్కె కల్గె నయ్య
కారణం బెరుంగను నేను కమల నయన
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
20. భార మంతయు నీ దివ్య పదముల కడ
నునిచి కడుభక్తి పూజించి యో మునిజన
సన్నుతా వ్రాయుచుంటి నీ సచ్చరిత్ర
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
21. శ్రీహరివె వీవు లక్ష్మియె సీత యౌను
జనన మొందితివి గదయ్య జగతి ప్రోవ
జనుల లోక మందున సతీ సహితుడవయి
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
22. ఆదిశేషుడు లక్ష్మణుడై జనించె
శంఖ చక్రములు ముదముగ జన్మ లెత్తె
భరత శత్రుఘ్నులై నిలన్ పావనాత్మ
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
23. ధర్మ ముద్దరింపగ బూని ధరణి యందు
దశరథసుతునిగను నవతారమెత్తి
ధర్మమున్ నిల్పిన దయాహృదయుడ వయ్య
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
24. జనకు నాజ్ఞను పాటించి మౌని వెనుక
వనికి జని దనుజుల జెండి భళిర మునుల
యజ్ఞమున్ గాచినాడవే ననఘ చరిత
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
25. క్రూర రాక్షసి తాటకన్ ద్రుంచి సకల
జీవులన్ గావ నిన్ను దర్శించి సకల
జగములు స్తుతించెను గద జలజ నేత్ర
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
26. రాక్షసు సుబాహు నొక్క శరమున భస్మ
మొనరిచి మరొక్క నిశితాస్త్రమున పడవయి
చితివి మారీచు జలనిధి శ్రిత శరణ్య
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
27. కౌశికుని యాగమున్ గావ గౌగిలించి
యతడు రోమాంచ కంచుకితా0గుడగుచు
బొగడె ఘన ఘనా ఘోషము గదురంగ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
28. మునిసతి అహల్య నిను వేడ ముక్తి నొసగి
పతిత పావనుడవయి తాపసుల పాలి
కల్పవృక్ష0బ వను కీర్తి గాంచినావు
భద్రగిరి వాస.రఘురామ భక్తవరద.
29. శివధను వవలీలగ విరచితి వది గని
సకల జనము లౌరర నీ శౌర్య మేమ
ని బొగడ వచ్చనిరి గాదె నీరజాక్ష
భద్రగిరివాస రఘురామ భక్తవరద.
30ప్రకృతి రూపిణి సీతను పరమ శుద్ధ
శీల బెండ్లాడి ధారుణి నేలి నావు
ధర్మమున్ దప్పక దశరథ ప్రియ పుత్ర
భద్రగిరి వాస రఘురామ భక్తవరద
31..పరశురాముని దర్ప0బు భంగ పరచి
ధన్యునిగ జేసి నాడవె దయను బూని
దేవ కారుణ్యసింధు హే దీన బంధు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
32. రాజ్యసంపదల్ వీడి ధరణిజ గూడి
వల్కలాజినంబుల దాల్చివని కరగి న
దాశరథి దయా జలనిధి త్యాగ మూర్తి.
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
33. సంపదల తల్లిదండ్రులన్ సతిని వీడి
వల్కల0బుల ధరియి0చి వనము కేగ
వచ్చె సౌమిత్రి నీ వెంట భక్తి తోడ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
34.దయను బెస్త యగు గుహుని ధన్యు జేయు. నిచ్ఛ తోడ నాతని నావ నెక్కి వేడ్క
దాటితివి గంగ సతిని సోదరుని గూడి
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
35.సీత నాది లక్ష్మిగ నిను శ్రీహరిగను
కారడవినె వైకుంఠమ్ముగ మది నెంచి
మిము గొలిచి ధన్యుడయ్యె సుమిత్ర సుతుడు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
36.రామ రామ యనుచు దశరథుడు నిన్ను
దలచుచు బ్రాపిత స్వర్గ థాముడయ్యె
నాతడేమి తపము జేసెనో తరింప
భద్రగిరి వాస రఘురామ. భక్తవరద.
37.తండ్రి.చావుకు చింతించి తక్షణ 0బె
తర్పణ0బును తగిన విధంబు సల్పి
సద్గతి నొసంగి నావయ్య సత్య పాల
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
38.భరతుడు నిను బూజించె నీ పాదుకలను
పొంది.వాని నర్చించుచు పూని భక్తి
పుడమి పదునాలుగేండ్లు పెంపున వహించె
భద్రగిరి వాస రఘురామ. భక్తవరద.
39. దుష్ట వర్తనులౌ ఖర దూషణాది
దనుజులన్ గూల్చితివి తీవ్ర థాటి నౌర
నీదు.విక్రమ0బు బొగడ నాదు వశమ
భద్రగిరి వాస రఘురామ. భక్తవరద.
40. శబరి మధుర ఫల0బు లొసంగగ కడు
సంతసంబున కుడిచి యొసగితి వయ్య
ననితర ప్రాప్య ముక్తిలోకాను భూతి
భద్రగిరి వాస రఘురామ భక్తివరద.
41. సప్త సాలము లొక్క యస్త్రమున గూల్ప
గాంచి గొల్చె సుగ్రీవు0డు కపుల గూడి
సూర్య. వంశ సంవర్ధక సుందరకర
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
42. దుందుభి కళేబరము కడు దూరమునకు
నీ పదాగ్రమునన్ మీట నీ.పరాక్ర
మంబు గని సర్వ జను లబ్బురంబు గనిరి
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
43. పక్షి రాజు జటాయువు పరమ సాధ్వి
సీతకుపకారమును వేడ్క జేయ బూని
రావణు నెదిరి బాసెను ప్రాణములను
భద్రగిరి వాస.రఘురామ భక్తవరద.
44. శౌర్య శీలి వాయు సుతు0డు జలధి దాటి
లంఖిణిన్ గూల్చి సత్య శీల యగు సీత
గాంచి మున్గె సంతోషాభ్ది గద సుచరిత
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
45.సాగారు0డు నీ ప్రార్థన సరకు సేయు
కుండుటన్ గని కోపించి కాండ మేయ
జలము కళ పెళలాడి నీ శరణు జొచ్చె
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
46.వానరుల చేత కొండలు వైవ జేసి
వార్థి సేతు వేర్పరచిన వారి జాక్ష
తెలియ తరమె నీ లీలలన్ దివ్య రూప
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
47. సర్వ సంపదల్ విడిచి నీ సన్నిధాన
మునకు వచ్చి నిన్ను గొలిచి ముక్తి గాంచె
నా విభీషణుడధిక భక్తాగ్రగామి
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
48. ప్రభు పదార్చనా నిరతు0డు పవన సుతుడు
పర్వత0బొక్క కరమ్మున బట్టి తెచ్చి
నీదు తమ్ముని బ్రతికించె నిర్మ లాత్మ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
49.రావణున్ వధించి ముదమార బడసితివి
పరమ పావన శీల సీతన్ రఘుకుల
చంద్రమా దుర్జన దమన సాధు పోష
భద్రగిరి వాస రఘురామ భక్త వరద.
50 దైవ మెవరయ్య నీ చతుర్థశ భువనము
లకు భువన మోహన మంగళ తను నీవు
గాక వేరెవ్వరున్ లేరు కమల నయన
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
51. భాస్కరుం డొక్కడే నీ ప్రపంచమున్ వె
లుంగ జేయు రీతి సకల లోకముల వె
లుంగ జేతువు కద సర్వ లోక పాల
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
52. బుద్ధియున్ జ్ఞానమును సర్వ భూతములకు నీవె యిత్తువు జగముల నీవె సృష్టి
సేతువు నణతువు దయను ప్రోతువు కద
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
53.భద్రుడు భజించె నిన్నెంతొ భక్తింతోద
దయ నొస0గితి వయ్య నీ దర్శన0బు
భక్త మందార శుభకర భయ విదూర
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
54.జానకీ నాధ దయ బూని జనుల గావ
నిచ్చట వసింపు మని కోరె నిచ్ఛ తోడ
భద్రు డందరి నుద్దరింపగ డలచి అని
భద్రగిరి వాస రఘురామ భకథవరద.
55 భద్రుని యభీష్టమున్ దీర్ప బాధ లన్ని
బాప నిలిచి నా వచ్చట భార్య గూడి
ఆదియె భద్రాచల0బను నాఖ్య యయ్యె
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
56. భద్రు డేమి పుణ్యము జేసె భద్ర మైన
నీ పద సరోజముల్ బట్టి నిన్ను జేరె
భక్త రక్షణ తత్పర పావనకర
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
57.నిన్ను జేర. పరితపించు నీదు భక్తు
నయముతో దరి జేర్చుకొనంగ తరలి
వచ్చు కారుణ్యపూర్ణ దైవమవు వీవు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
58.భళి రఘుకుల మౌళి దయాళ పంకజ దళ
నేత్ర రమణిగ మారెనె నీదు పాద
ధూళి సోకి పాషాణము దురిత హరణ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
59.నీ పయి దన భక్తిని జూపి నీ యనుగ్ర
హంబును బడసి ఉడుత యిహంబు వీడి
చేరె నీ సన్నిధానంబు చిత్ర మౌర
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
60. శక్తి కెపుడు వశము గాక సంతసముగ
భక్తికే వశుడవగుదువే భక్తి యన్న
యంత గొప్ప దౌన రఘుకులాభ్ది చంద్ర
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
61.శరణు వేడిన దుష్టులన్ సత్త్వరముగ
గాచెదవె దయన్ శిష్యులన్ గాచుటన్న
నీకు కడు వేడ్క యౌ గాదె నిర్వి కల్ప
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
62. నరుడు తలచిన రూపమున కనిపింతు
వయ్య ధరియి0తువయ్య నామాళు లెన్నొ
రూపముల్ మరెన్నొ నన0త రూప దేవ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
63. క్షణమున నశించు యందమున్ గాంచి సంత
సింతురే నరులు పరవశింపరు కద
నీదు నిత్య సుందరతన్ గని నిఖి లాత్మ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
64.నిండి యుంటి వక్షరుడ వై నిఖిల జగతి
నిను గనగ శక్యమౌ జ్ఞాన ధనుల కనుచు
నీవె వివరించితివి కారుణికుడ వగుచు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
65. సర్వ దృశ్య ప్రపంచ మ్మశాశ్వత0బు
సర్వ సుఖములు కావయ్య శాశ్వత0బు
సత్య రూప నీవె గదయ్య శాశ్వత0బు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
66. తొమ్మిదగు ద్వారములతోడ తోయ జాక్షు
నకు నిలయ మయిన పురంబె నరుని దేహ
మనగ దగు నెంతయున్ వింత యగును గాదె
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
67. రాజిలిచు నుందు నంటివి ప్రాణుల హృద
య కమలాన నిను గన పుణ్య పురుషలకు
దప్ప నన్యులకు వశమే తత్వ రూప
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
68. మనుజులన్ మోహితుల జేయు మాయ నీవు
సృష్టి చేసినదె కదయ్య శిష్ట తేజ
మాయను జయింప శక్యమే మానవులకు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
69.మాయ నెట్లు దాట గలరు మరియు ముక్తి
కాంత నెట్లు నరుల్ పొంద గలరటయ్య
నీవు దయ జూపకున్న మునిజన వినుత
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
70.తాను జేసిన పాపముల్ దలచి మరల
వానినిన్ జేయక నరుడు పరితపించి
నిన్ను వేడ పావనుడగు నీ కరుణను
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
71.ఘోర పాతక0 బైనను గూలి పోవు
నీ కృపా చాపము వలనన్ నిప్పు కణము
కాల్చ గల్గును గాదె నగ0బు నైన
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
72. మనుజతన్ బొంది మనుజుని.మంచి మార్గ
మున నడువు మంచు సన్మార్గమున చరించి
లోక మాన్యుడ వైతివి లోక నాధ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
73నరునకున్ సుఖము గలిగిన స్వ ఘనత
గ దలచు నదేమి చిత్ర0బొ గదర కష్ట
ము గలిగిన నీవు కారణ0బుగ దలంచు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
74.సుఖము లందు మునిగి మనుజుండు నిన్ను
మరచి కష్టములు గలుగ మధన పడుచు
నిన్ను శరణు గోరును కద నీల దేహ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
75 నరులకు తెలిపి నాడవె నశ్వరముల
యినవి సుఖ సంపద లనుచు నిన కులోత్త
మా స్థిర0బు నీ సాయుజ్యమ పరికింప
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
76.కష్ట సుఖముల సమముగ గాంచ గల్గి
మరువక నిను స్మరించెడు మానవుండె
నిజముగ జ్ఞాని యగు కద నిర్వి చార
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
77. నరుల యజ్ఞాన తిమిర0. బణగిన గాని
నిను తెలియ లేరు నరులు. మునీంద్రహృదయ
పద్మ వాస పరంధామ పాహి పాహి
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
78. నరుల చిత్తము లజ్ఞాన పరత జిక్కె
నవుర సంసార మకర దంష్ట్రా0 తరమున
దీన రక్షక కావుమా దివ్య నామ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
79. త్రుంచితివి దనుర్థారి వై దుష్టు లంద
రిన్నిది దలంప తోచు నీ రీతి మదికి
వినుము నాదు వాక్యముల్ విమల తేజ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
80 మనసు నందు బుట్టెడు క్రోధ మత్సర మద
కామ మోహ లోభము లను కడు వికార
దుష్ట దనుజులన్ మనుజుండు ద్రుంచ వలయు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
81 మాయ లేడిని గోరిన మైథిలి కడు
కష్టములు పొందె నక్కటక్కట గనంగ
కడు విచిత్ర మౌను గదయ్య కాల మహిమ
భద్రగిరి.వాస రఘురామ భక్తవరద.
82. మనుజు మది దురాశ యనెడు మాయ మెకము
వశ మయిన నది నాతని బడ వయిచును
కష్టముల కారడవి యందు కద సుధీర
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
83. ఏమి పుణ్యము జేసెనో యెరుగ తరమ
ధన్య డయ్యె పక్షీంద్రుడు ధన్యత గన
ని బ్రతుకులు నిష్ఫలములు గణి0చి చూడ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
84. నిరతమును భక్తి నిను గొల్చి నిన్ను చేర
వచ్చు నంచు చెప్పితివి నీ పల్కుల మది
నమ్ము వాడె నీ సన్నిధానంబు జేరు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
85.జన్మ లన్నిటమానవ జన్మ ముత్త
మ0బని తెలిసి నిను జేర మనుజు డేల
చింత చేయడో తలపంగ చిత్ర మౌను
భద్రగిరి వాస రఘురామ భక్తవరద్ల్.
86.నరుడు తొలి జన్మలో చేసిన బహు పుణ్య
పాప ఫలముల ననుభవింపగ వలయు
మనుజు డీ జన్మ మందునన్ మధుర నామ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
87. మనుజు లీ జన్మ లోని కర్మ ఫలములను
ననుభవింతురు మరు జన్మ మందు గాన
సలుప వలయు సత్కర్మముల్ జనులు వేగ
భద్రగు వాస. రఘురామ భక్తవరద.
88. కోరికలె మరు జన్మకు కారణ0బు
కోరికల వీడ వలె ముక్తి కోరు నరులు
గదుర యోగి జనోద్ధార కంజ నేత్ర
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
నీరదంబులు వర్షి0చు నీరు నదులు
జలధి చేరెడు గతి నెన్నొ జన్మ లెత్తి
చేర వలయు నీ సన్నిధి నరులు గదర
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
90. బ్రహ్మ రుద్రు లైనను కర్మ ఫలము లనుభ
వింపగవలయు నంటివి వింత యగునె
నరులనుభవింపగ వలె నన్న రఘునాథ
భద్రగిరి వాస రఘురామ భక్త వరద.
91.యోగులకు యోగివై వీవు యోగ సార
మును దెలిపితివి నరులకు ముక్తి చెందు
డనుచు మోక్షగామియె మర్మ మరయ గల్గు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
92. విషయ సుఖముల యందాశ వీడి ముక్తి
యనెడి శాశ్వత సుఖము నందాశ కలిగి
నరుడు జపియింపవలె నీదు నామ మెపుడు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
93.కామ మను కారు మేఘము కప్పి యుండు
గాదె మనుజుని జ్ఞాన భాస్కరుని దీని
నరుడు.ఛేదింప శక్తి నిమ్మ రఘుధీర
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
94. కామ వశు డగుచున్ దశకంఠు డ0త
మొందె కామమె మానవు డి0ద జేయు
దాని నెరిగియె జ్ఞాని వదలును గదర
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
95. నరుడు వైరాగ్య మనెడు ఘనమగు తెప్ప
చేరి భవసాగరము దాటి మీరి కామ
రాక్షసిన్ వధించిన ముక్తి రమను గాంచు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
96కామమునకు మది నెల వైన గలుగు కీడు
రామునకు నెల వైన చేర నగు సుఖము
తెలియగ వలయు మనుజు డిది మహిమాడ్య
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
97. కొంచ మైనన్ స్థిరత లేని కోతి వంటి
దౌను మనుజుని చిత్త0బు దీని బట్టి
నిలుప గలిగిన మనుజుండె నేర్పరి గద
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
98. నీ పదా0బుజముల చెంత నిలువనీ క్ష
ణ మయిన సుఖమున్ చెందనీ నరుని చిత్త
మును చిదాన0ద చిద్రూప ముక్తి దాత
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
99.ధ్యాన జలధిని మునిగి నీ దయను పొంది
తనివిదీర నానందామృత0బు గ్రోలు
యోగి కోరడస్థిర లోక భోగ మెపుడు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
100. నరుల ఆయువున్ హరియించు నరుల కెరుక
లేకయే మృత్యు కాంత గాన కనగ వలె
జీవ ముండగ నిను సరసీరుహాక్ష
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
101.భక్తి యను దధి భా0డము బట్టి శుద్ధ
బుద్ధితో ధ్యానమంధానమున.చిలికిన
ముక్తి యను వెన్న ముద్దను పొందు నరుడు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
102. కలిమి లేకున్న నేమి నిక బలిమి కొద
వైన నేమి కులము తక్కు వైన నేమి
భక్తి యున్న సర్వోన్నత పదము గలుగు
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
103. నరుడహ0కృతి నిహ.సుఖ పరుడు గాక
నిన్నెరిగి నీ పదము చేరు నిభృత వర మొ
సంగు మయ్య దయాసాంద్ర సత్య చరిత
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
104.శోకము వలననే మనుజునకు గలుగు
నాత్మ.చింతన0బు నరున కదియె ముక్తి
మార్గమును చూపును కదయ్య సర్వ సాక్షి
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
105. భూషణ0బులు వేరైన భువిని కనక
మొకటె రూపముల్ వేరైన లోకములను
ప్రోచు దైవ మొక్కడే కద యోచి దాత్మ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
106. కోరి హరియును హరుడును వేరు వేర
నుచును వాద0బులాడు జనులు తెలియగ
వలయు గాదె నిజముగ దైవ0 బొకడని
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
107 మనసు నీ వశము0 జేసి మరణ వేళ
నైన నిన్ను స్మరించునట్లల వడ0గ
వరమొస0గుమా నరులకు పరమ పురుష
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
108. మంగళము నీకు సీతారమణ మునిజన
వందిత చరణ మంగళ మిందిరా స
మగ్ర నిత్య మంగళ మయ్య మంగళా0గ
భద్రగిరి వాస రఘురామ భక్తవరద.
ఈ శ్రీరామ చరిత్రము శతకము
పంపిన వారు:
కమలమ్మ
మార్కాపురం