ఏ పనులు తలపెట్టినా ముందు గణపతికి పూజలు చేస్తాం. ఆయన ఆశీర్వాదాలతో అనుకున్న పని ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తాం. వినాయకుడి పుట్టినరోజు ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజున ‘వినాయకచవితి’ వేడుకగా జరుపుకుంటాం. అయితే వినాయకచవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలుగుతాయని అంటారు. అసలు ఇలా అనడం వెనుక శాస్త్రీయ కారణాలు ఏంటి?
ఒకనాడు భర్త రాకకోసం ఎదురుచూస్తున్న పార్వతీదేవి స్నానానికి వెళ్లబోతు నలుగుపిండితో ప్రతిమను తయారు చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది. ఆ బాలుడిని వాకిట్లో కాపలా ఉంచి స్నానానికి వెళ్తుంది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని బాలుడు అడ్డుకోవడంతో కోపావేశుడైన బాలుడి శిరస్సుని ఖండిస్తాడు. ఆ ఘోరం చూసిన పార్వతీదేవి కన్నీరు పెట్టుకోవడంతో ఏనుగు శిరస్సుని ఆ బాలుడికి అతికించి ‘గజాననుడు’ అని పేరు పెడతాడు. బాద్రపద శుద్ధ చవితినాడు గణాధిపత్యం ఇచ్చాడు. ఆరోజు భక్తులు తనకు సమర్పించిన ఉండ్రాళ్లు, పిండివంటలు కడుపునిండా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసానికి వెళ్లాడు.
శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు గణపతి అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. వెంటనే వినాయకుడి ఉదరం పగిలి అందులోంచి ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చాయి. వెంటనే ఆగ్రహించిన పార్వతీదేవి నీవల్లే నా కుమారుడు అచేతనుడయ్యాడు కాబట్టి నిన్ను చూసినవారు నీలాపనిందలు పొందుతారు అని చంద్రుని శపించింది.
పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తరుషులు యజ్ఞం చేస్తూ అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషుల భార్యల మీద మోహం కలుగుతుంది.అది గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఋషి పత్నుల రూపంలో అగ్నిదేవుని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలే అనుకున్న ఋషులు వారిని త్యజించారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వల్లే ఋషి పత్నులు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వెంటనే వారు పార్వతీదేవిని కలిసి శాపాన్ని ఉపసంహరించుకోవాలని వేడుకున్నారు. అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదని శాపాన్ని సవరించింది.
బాద్రపద శుద్ధ చవితినాడు శ్రీకృష్ణుడు ఆవు పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి శమంతకమణిని అపహరించాడని అపనిందలపాలయ్యాడు. అయితే వినాయకచవితి రోజు ఎవరైతే వినాయకుడికి పూజలు చేసి కథ విని అక్షంతలు తమపై వేసుకుంటారో వారికి చంద్రుని చూసిన దోషం ఉండదని పండితులు చెబుతారు. ఈరోజు చంద్రుడిని చూడవద్దనడంలో శాస్త్రీయ కారణాలు కూడా చెబుతారు.
చవితి రోజున సూర్యుడు, భూమి, చంద్రుడు వేర్వేరు కోణాల్లో ఉంటారు. ఆ సమయంలో భూమి మీద పడే చంద్రుడిని కాంతి ప్రతికూల ప్రభావం చూపుతుందని అది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటారు. దీనిని మూఢనమ్మకంగా కొందరు భావించినా దీని వెనుక ఉన్న శాస్త్రీయ కోణంగా చెబుతారు.