శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః
శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే
“శరవణభవ”…
శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు
షదాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే.
శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు అని ‘శరవణభవ’కు గూఢార్థం.
కౌమారము అనే శాఖ ‘కుమార’ అన్న శబ్దము నుండే వచ్చింది.
మనకు ‘షణ్మతము’లను ఆరు మతములు ఉన్నవి.
అందులో ఆరు దేవతా స్వరూపాలను పరబ్రహ్మ స్వరూపాలుగా పూజిస్తాము.
అవి,
గాణాపత్యము - గణపతి; సౌరము - సూర్యుడు;
శాక్తము - పార్వతి(శక్తి);
శైవము - శివుడు;
వైష్ణవము - విష్ణువు;
కౌమారము - సుబ్రహ్మణ్యుడు.
వీరిని పూజించే పద్ధతినే పంచాయతన పూజ అంటారు.
ఇచ్ఛా జ్ఞాన క్రియా రూప మహాశక్త్ధిరం భజే! శివశక్తి జ్ఞానయోగం జ్ఞానశక్తి స్వరూపకం!!‘‘ అని శివపురాణ వచనం.
వైదిక మతంలో శివ శక్త్యాత్మకుడైన సుబ్రహ్మణ్యోపాసన గురించి చెప్పబడింది.
షణ్మతాలలో- సౌర, శాక్త, గాణాపత్య, వైష్ణవ, శివమతాలతోపాటు కుమారోపాసన గురించి చెప్పినప్పటికీ, పంచదేవతారాధనలో స్థానం కల్పించలేదు.
సుబ్రహ్మణ్యునికి ‘‘అగ్నిగర్భుడ’’ని నామం ఉంది.
అయితే, సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే ప్రారంభం అవుతుందని తత్త్వజ్ఞుల అభిప్రాయం.
ఏ పూజ మొదలెట్టినా దీపారాధనతోనే ప్రారంభం కావడం తెలియంది కాదు.
‘దీపారాధన’ అంటే అగ్నిగర్భుని ఉపాసించడమే! అలా సుబ్రహ్మణ్యారాధన ప్రారంభంలో లేని ఏ పూజయైనా నిష్ఫలమే!
పార్వతీ పరమేశ్వరుల తనయులు గణపతి, సుబ్రహ్మణ్యులు కుమారతత్త్వానికి ప్రతీకలు.
పంచభూతాత్మకమైన ఈ విశ్వానికి నాలుగు తత్త్వాలున్నాయని విజ్ఞులు చెబుతారు.
అవి- అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం. అవ్యక్తం, వ్యక్తం శివ పార్వతుల పరంగాను,
మహత్ తత్త్వానికి గణపతిని, అహంకారం అనుదానికి సుబ్రహ్మణ్యుని లేదా కుమారస్వామిని ప్రతీకలుగా చెబుతారు.
ఈ నాలుగూ ఒకే పరతత్త్వానికి భిన్న రూపాలుగా ఉంటున్నాయి.
అహంకారమంటే ‘గర్వం’ అనే అర్థంలోకాక ‘నేను’ అనే స్పృహని కలిగి ఉండడం అని అర్థం చేసుకోవాలి.
ఇది చైతన్యం యొక్క స్వరూపం. పరమాత్ముని పరంగానూ ఈ భావం ఉంటుంది. సృష్టిక్రమానికి నాంది ఇదే.
ఈ చైతన్య స్వరూపం వ్యష్ఠిగాను, సమిష్ఠిగాను ప్రకటితవౌతుంది. ఈ చైతన్య స్వరూపానికి సుబ్రహ్మణ్యుడు ప్రతీక.
చైతన్యం ప్రతి హృదయ కుహరంలోను ఉంటుంది. కాని బాహ్యంగా కనుపించదు. హృదయ గుహలో ప్రకాశించే ఈ పరమాత్మ చైతన్యాన్ని ‘‘గుహః’అని చెప్పారు.
చైతన్యం జ్ఞాన లక్షణం గల తత్త్వం. అంటే గురు తత్త్వం. అందుకే సుబ్రహ్మణ్యుని ‘గురుగుహ’ అని కీర్తించారు వాగ్గేయకారులు.
ముఖ్యంగా శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని సాక్షాత్కారం పొంది, ఆతని అనుగ్రహంతో సంగీత, సాహిత్య, మంత్రశాస్త్ర, నాద రహస్యాలను తెలుసుకున్నారు.
తాను రచించిన సంకీర్తనలన్నీ ‘గురుగుహ’’ నామంతో ముద్రాంకితం చేశారు. కర్ణాటక సంగీతంలో ముత్తుస్వామి దీక్షితుల కృతులకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
పరమాత్మ చైతన్య రూపుడైన సుబ్రహ్మణ్యుని అర్చిస్తే వ్యక్తావ్యక్త స్వరూపులైన శివశక్తులను కూడ ఆరాధించినట్లేనని స్కంద పురాణం చెబుతున్నది.అనన్య శక్తిసంపన్నుడైన సుబ్రహ్మణ్యుడు శివశక్తిని తనదిగా చేసుకున్నాడు.
ఆ శక్తే శక్త్యాయుధంగా చేత బుచ్చుకుని ‘శక్తి ధరుడు’గా ఉపాసింపబడుతున్నాడు. లోక రక్షణకు కంకణం కట్టుకున్నాడు.
పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I
అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా II
తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I
పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి.
వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతోంది.
అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ, లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే
కుమారస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు విజయాలకు
కుమారస్వామి రెల్లుపొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే! రెల్లుగడ్డిని ‘శరం’ అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది.
కానీ ‘శరం’ అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనలకు నాయకునిగా, ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు.
అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టులావాదేవీలతో సతమతం అవుతున్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే… ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారట!
సంతానానికి -
ఈ సృష్టిలో పార్వతీపరమేశ్వరులని ఆదిదంపతులకి చిహ్నంగా పేర్కొంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని ‘కుమార’ స్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రాతిపదిక!
మన శరీరంలో ఉండే కుండలినీ శక్తిక
సుబ్రహ్మణ్యస్వామి అధిదైవం. శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే శక్తి అంతా పాము ఆకారంలోనే ఉంటుంది.
సర్పాలను నాశనం చేసినవారికి లేదా శక్తిని పాడు చేసినవారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం.
కాబట్టి ఆ శక్తిని, ప్రకృతిని కాపాడడం కోసం సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.
జ్ఞానానికి
–
సుబ్రహ్మణ్యుడు అంటే
సు = అంటే మంచిది,
బ్రహ్మ = తెలుసుకోదగినవాడు,
చక్కగ తెలుసుకోదగిన జ్ఞానానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే జ్ఞానం కూడా వస్తుంది. విద్యార్థులకు చదువుకూడా బాగా వస్తుంది. సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుందట!
పరమేశ్వరుని దయతో, ఆ బ్రహ్మని సైతం ఓడించగల మేథస్సు కుమారస్వామికి అలవడిందని చెబుతారు.
ఇక ఆయన చేతిలో ఉండే శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవడం కద్దు.
ఈ శూలం పదునైనా ఆయుధానికే కాదు, సునిశితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తుంటారు.
ఆధ్మాత్మిక ఉన్నతికి –
శివుని తేజం రేతస్సుగా మారి గంగానదిలో పడిందనీ, అది ఆరుభాగాలుగా మారిందనీ.. కుమారస్వామి జననం గురించి చెబుతుంటారు. ఆ ఆరు భాగాలనూ ఆరుగురు కృత్తికలు పెంచారు .అందుకనే కుమారస్వామిని ‘షణ్ముఖుడు’ అని పేర్కొంటారు.
అయితే ఈ కథ వెనుక ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా ఉందని చెబుతుంటారు.
ఆరు అనే సంఖ్య ఆరు దిక్కులకు (తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఊర్థ్వం, పాతాళం) సూచన.
పురుష శక్తికి, స్త్రీ శక్తికి చిహ్నంగా నిలిచే రెండు త్రికోణాల కలయికలో కూడా ఆరు కోణాలు కనిపిస్తాయి.
ఇలా రెండు త్రికోణాలు కలిసిన షట్కోణం గుర్తుని హిందువులతో పాటుగా క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు కూడా పవిత్ర చిహ్నంగా భావిస్తుంటారు. ఆ పవిత్ర సంఖ్యకు, పవిత్ర చిహ్నానికి ప్రతీకగా షణ్ముఖుని భావించవచ్చు!
యోగసాధనకు
–
కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తుంది.
మనలో నిద్రాణంగా ఉన్న కుండలినిని సర్పంతో పోలుస్తూ ఉంటారు.
ఆ కుండలిని జాగృతం అయిన రోజున, మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు.
అందకే కుండలిని మేల్కొల్పడం అన్నది మన యోగశాస్త్రపు అంతిమలక్ష్యంగా కనిపిస్తుంది.
ఆ లక్ష్యానికి తోడ్పాటుని అందించేలా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు!
జాతక దోషనివారణకు –
వివాహం, సంసారం, సంతానం… వంటి యోగాలకు కుజగ్రహం అనుకూలంగా ఉండాలన్నది జ్యోతిషుల మాట!
ఆ కుజగ్రహంలో కనుక దోషాలు ఉంటే వివాహజీవితంలో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు.
కుజ గ్రహానికి అధిదేవత కార్తికేయ స్వామి కావున
సుబ్రమ్మణ్యేశ్వరుని కనుక పూజిస్తే… ఎటువంటి కుజదోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నమ్మిక!
కుమార-సంభవం’ అన్న మాట వాల్మీకి రామాయణంలో కనపడుతుంది.
అందులో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు సుబ్రహ్మణ్యుని వృత్తాంతాన్ని విపులంగా తెలుపుతాడు
కథాభాగం చివర్లో ఫలశృతి వ్రాయడు వాల్మికి. కాని ఈ ఆఖ్యానంలో మాత్రం విశ్వామిత్రుడు రామునితో, “నేను నీకు కుమార-సంభావ వృత్తాంతాన్ని తెలిపాను.
ఇది నీకు ధనమును, పుణ్యమును ఇస్తుంది. హే! కాకుత్స్థ ఈలోకంలో కార్తికేయుణ్ణి కనుక భక్తితో ఆరాధిస్తే, ఆయన మనలను దీర్ఘాయుష్షు, సంతానము, యశస్సు ఇచ్చి, చివరలో స్కందలోకంలో శాశ్వత నివాసం అనుగ్రహిస్తాడు” అన్న ఫలశ్రుతి ఉంది.
కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులై పుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యమున స్కంద సాలోక్యాన్ని పొందుతారు.
ఓ రామా! ఈ కుమారసంభవం “ధన్యపుణ్యగాథ” అని విశ్వామిత్రుని మాట (వాల్మీకి రామాయణం – బాలకాండ).
ఏషతే రామ గంగాయా విస్తరోమయా I
కుమారసంభవశ్చైవధన్యం పుణ్యస్తథైవ చ II
భక్తశ్చయః కార్తికేయే కాకుత్ స్థ భువిమానవాః I
ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్ II
సుబ్రహ్మణ్య స్వామి వారు యజ్ఞ తత్వమునకు ప్రతీక,
అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞపురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడినది. అందులోనే శ్రీమహావిష్ణువుకి “స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః” అనే నామాలు ఉన్నాయి,
అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని అర్ధం.
మరి విష్ణువే రాముడు కదా, ఆయనకి విశ్వామిత్ర మహర్షి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో ఏమిటి రహస్యం అంటే రాముడు అవతార ప్రయోజనం కోసం సాధారణ మానవుడిగా వచ్చాడు,
అప్పుడు ఆయన రావణ సంహారం చేయడానికి అవసరమైన సకల అస్త్ర శస్త్రములతో పాటుగా, యుధ్ధ వీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము…
చివరిగా నడిచేదేవుడు, కంచికామకోటి పీఠాధిపతి పరమాచార్య
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి మాటలలో చెప్తే, ఉపాసనలో పరమశివుడికి కొన్ని ఇష్టం, అలాగే
అమ్మ వారికి కొన్ని ఇష్టం, భక్తులు అమ్మకి అయ్యకి ఇద్దరికీ కలిపి పూజ చేయాలి అంటే కేవలం సుబ్రహ్మణ్యస్వామి వారికి పూజ చేస్తే చాలుట. ఒకేసారి శివపార్వతులను పూజించినట్లే. అదీ కుమార తత్వం.
ఇక్కడే కుమార తత్వం గురించి మరో చక్కని మాట ...
పరమశివుడు ఎప్పుడూ తనలోతానే రమిస్తూ ఉంటాడు కదా, ఆయనకి అవతారాలు ఎత్తడం అవీ ఉండవు.
మనకి బాలకృష్ణుడు ఉన్నాడు
అలాగే బాలరాముడు ఉన్నాడు, మరి బాలశంకరుడిని ఎక్కడ చూడగలం?
అంటే పరమశివుడు చిన్నపిల్లవాడైతే….
అదే మన బుజ్జి సుబ్రహ్మణ్య స్వామి.
అటువంటి ముద్దులొలికే నా చిట్టి తండ్రి,
మూర్తీభవించిన అందం, తేజస్సు,
చిరునవ్వు,
అచ్చం అమ్మ పోలికలో ఉండే కారుణ్యమూర్తి,
నను గన్న తండ్రి,
భక్తుల వరాలను ఇట్టే తీర్చే కామధేనువు,
సంతానము లేనివారికి సత్సంతాన భాగ్యం ప్రసాదించే అభయప్రదాత,
ఇహమునందు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి, అంత్యమున తనలో కలుపుకునే స్వామి వారి పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను.🙏
🔱ఓం శరవణ భవ 🔱
సర్వం శ్రీ వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యార్పణమస్తు.🙏
గత నెల రోజులుగా మనం చదువుకొంటున్న కుమార చరిత్ర నేటితో సమాప్తమైనది..
శ్రీ వల్లీసమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కరుణాకటాక్షాలు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని పార్థిస్తూ......🙏🙏
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏