అయ్యప్ప సర్వస్వం - 3

P Madhav Kumar


*గురుమహిమ - 3*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

బ్రహ్మానంద స్వరూపుడు , శాశ్విత సుఖప్రదాత , జ్ఞాన స్వరూపుడు , శీతోష్ణ సుఖ దుఃఖ రాగద్వేషాలకు వశం కానివాడు , ఆకాశమంత విశాలమైనవాడు, *"తత్వమసి"* మొదలైన ఉపనిషత్ వాక్యాలకుదాహరణమైనవాడు , ఏకము , నిత్యము , పరిశుద్ధము , నిశ్చలమైన స్వరూపంగలవాడు , సమస్త కార్యాలకు సాక్షీభూతుడు , సకల భావాలకతీతుడు , సత్త్వ రజస్తమో గుణములేవీలేని నిర్గుణస్వరూపుడును అయినటువంటి సద్గురువులే సర్వసమర్పణకు అర్హులు. గురుశిష్య సంబంధం పరమ పవిత్రమయింది. శిష్యుడి మీద గురువుకి వాత్సల్యం , గురువు మీద శిష్యుడికి అపారమైనభక్తి , గౌరవం వుండి తీరాలి. నా శిష్యుల్ని సర్వోత్కృష్టుల్ని చేయాలియని నిర్ణయించు కున్నపుడే గురువు సక్రమ జ్ఞానాన్ని అందించగలడు.


అదేవిధంగా మాగురువే సమస్త జ్ఞానసంపన్నుడు అన్న గౌరవం శిష్యుడికి వున్నపుడు కూడా సర్వవిద్యలకు ఆకరమైన ఆది దేవుడు కూడ అవతారం దాల్చినపుడు , గురువులకు శుశ్రూష చేశాడు. అన్నీ , తెలిసీ , ఏమీ తెలియని వాడిలా గురువులను ప్రశ్నించి నేర్చుకున్నాడు. మానవ మాత్రులం మనమెంత ? గురువుకు శిష్యునిపై ప్రేమ వాత్సల్యా లుండాలి. గురువుపై శిష్యునికి భక్తి , గౌరవాలుండాలి. అలాంటి గురుశిష్య సంబంధం నెలకొనాలే కాని , దేశం రామరాజ్యమే అవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానకేతనాన్ని ఆకాశంపైన ఎగురవేస్తూంది. (అలాంటి శక్తి మనందరికీ ప్రసాదించాలని ఆ గురువులకు గురువైన అయ్యప్ప భగవానుని ప్రార్థిద్దాం.)


గురుతత్త్వాన్ని బోధించిన గురుదేవులకు శిష్యులందరూ సాష్టాంగ ప్రణామము లాచరించి నిలుచున్నారు. ఇదంతా మణికంఠుని గురుసేవాతత్పరత వలన జరుగుతున్నదే అని గ్రహించి  *" నాయనా ! నీవంటి మహోన్నత వ్యక్తిని శిష్యునిగా పొందటం నిజంగానే ధన్యమయింది. లోకాలకే ఆరాధ్యనీయమైన నీ దివ్యత్వాన్ని తెలుసుకుని అశాశ్వితమైన సుఖసంతోషాలకోసం ప్రాకులాడటం అవివేకం. కానీ అవిటివాడైన కుమారుని గాంచిన మనసు భేదమొందుచున్నది. *'అపుత్రస్య గతిర్నాస్తి' అని పుత్రులులేనిదే పున్నామ నరకము నుండి రక్షింపబడలేరని వగచుచున్న మాకు పుత్రసంతానం కలిగింది. పున్నామనరకం నుండి రక్షింపబడతామని సంతోషించాము. తీరా ఆపుత్రుడు మూకాంధ బధిరుడయ్యేసరికి , పరలోకములో స్వర్గమో , నరకమో తర్వాత , కానీ ఇపుడు నేను జీవించి ఉండగానే అనుక్షణం వేదనకు గురవుతూ ప్రత్యక్షనరకం అనుభవిస్తున్నాను. నాయనా మణికంఠా ! నాకుమారునికి చూపు , మాటల , ప్రసాదించి ఈ నరకాన్నుండి నన్ను రక్షించు నాయనా!"* అన్నాడు గురుదేవుడు.


గురుదేవా ! ఎంతమాట ! మీ ఆశీస్సులతో , మీ ఆజ్ఞను శిరసావహించి , భగవదను గ్రహముతో మీ చిరంజీవిని పూర్ణారోగ్యవంతునిగా చేయటానికి ప్రయత్నిస్తాను. అంటూ కళ్ళుమూసుకొని *“ఓంకార"* నాదము స్మరించసాగాడు. ఉచ్ఛైస్వరముతో ఓంకారము నినదిస్తూ *"సుబుద్ధి"* చెవిదగ్గర మంద్రగంభీర స్వరముతో నినదించ సాగాడు. తన అమృత హస్తములతో సుబుద్ధి ముఖముపై అప్యాయంగా నిమిరాడు. అంతే మణికంఠుని నుండి ఓ దివ్యతేజస్సు సుబుద్ధిని ఆవరించింది. ఆ వెనువెంటనే *"ఓం , ఓం , ఓం"* అంటూ ఓంకారనాదమును ఉచ్ఛరించసాగాడు సుబుద్ధి. తన్మయత్వంతో తనువూ మనసూ మరచిపోయి మణికంఠుడు చెప్పే వేదవాక్యములు శ్రవణానందముగా వల్లించసాగాడు.


*ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః|*


*కామదం మోక్షదం చైవ ఓం కారాయ నమోనమః ||*


అంటూ అంతవరకూ కళ్ళుమూసుకొని తదేక ధ్యానంతో వేదమంత్రాలు వల్లించుచున్న కుమారుని చూసిన గురువుగారి ఆనందానికి అవధులు లేవు. నోట మాట రావడం లేదు. అంతలోనే సుబుద్ధి కళ్ళు తెరచి మణికంఠుని చూసి ఆనందభాష్పాలు కనుల వెంట జాలువారుచుండగా మణికంఠుని స్తుతిస్తూ శ్లోకాలు వల్లించి సాష్టాంగ ప్రణామం ఆచరించాడు. ఆశ్చర్యంతో చుట్టూరా ఒకసారి పరికించి చూసి , ఆనందంతో , కళ్లు నులుముకుని మరీ చూసి , ఆనందం ఆవేశం ఆవేదన ముప్పిరిగొనగా , ధారాపాతంగా కనులవెంట నీరుకారిపోతుండగా *“నాన్నగారూ ! నేను చూడగల్గు తున్నాను. మాట్లాడగలుగుతున్నాను , వినగల్గుతున్నాను". అంటూ పెద్దగా అరిచాడు. గురువుగారు ఆనందంతో కుమారుని దగ్గరకు తీసుకొని కౌగలించుకుని ఒళ్ళంతా తడిమిజూస్తూ" నాయనా ! సుబద్దీ ! నీవు ఎంత చక్కగా వేదాలను వల్లిస్తున్నావు. ఈలోకాన్ని ఇన్నాళ్ళ తర్వాత మొదటిసారిగా చూసే భాగ్యం కల్గిందా నాయనా!"* అంటూ మణికంఠునివైపు తిరిగి గొంతుమూగబోయి డగ్గుత్తిక స్వరంతో *"మణికంఠ ! నీవు సామాన్యబాలుడవు కావు. అవతార పురుషుడవు. నీకు గురుత్వం వహించిన నాకే నీవు గురుడవు. నాబిడ్డకు శాపవిమోచనం గావించ వచ్చిన పరంధాముడవు".* అంటూ చేతులు జోడించి నమస్కరించబోయాడు గురుదేవులు.


వెంటనే మణికంఠుడు గురుదేవునివారిస్తూ *"గురుదేవా ! అపచారము. మీరు వయోవృద్ధులు, జ్ఞాన సంపన్నులు , నాగురు దేవులు. అట్టి మీరు నాకు నమస్కరించి నన్ను పాప పంకిలములో పడవేయుదురా గురుదేవా"*. వినయంగా చేతులు జోడించి అభ్యర్థించాడు. *"పూర్వజన్మకృతం పాపం , వ్యాధి రూపేణ బాధితే తశ్చాంతి రౌషదైర్గానై ర్జపహోమ సురార్చనైః"* అనుస్మృతి ప్రకారము పూర్వజన్మమునందు చేయబడిన పాపములు వ్యాధుల రూపమున బాధించుననియు , అది ఔషధములు , దానములు , నవగ్రహ జపములు , హోమములు దేవతా పూజలు లోనగు వానివలన శమించుననియు శృతివాక్యము. అందువలన మీరు చేసిన విద్యాదానము , నిత్యము మీరు ఆచరించే దేవతార్చనలు , జప , తప , హోమాదుల పుణ్య ఫలమే , నా రూపములో మీముందుకు వచ్చి మీకుమారుని మూకాంధ బధిరత్వమును పారద్రోలాయి.


*అంతేగాని ఇందులో నాప్రజ్ఞ ఏమీలేదు. గ్రహణం వీడిపోయింది. మీ అనుజ్ఞ అయితే ఇక సెలవు తీసుకుని రాజధానికి బయలుదేరతాను"* అన్నాడు సవినయముగా చేతులు జోడించి నమస్కరిస్తూ. *"నాయనా మణికంఠా ! నిన్ను విడచి వుండగలమా నాయనా ! అయినా తప్పదు. లోకాలనుద్దరించవలసిన నిన్ను నాగురుకులములో ఇంకా ఉంచాలనుకోవడం లోకాపచారమే అవుతుంది. ఇంతలేసి ఉపకార మొనర్చిన నీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోవాలో అర్ధం కావటం లేదు"* అన్నాడు గురుదేవులు మనస్తాపంగా. ఓవైపు మణికంఠుని వంటి అవతార పురుషుడు , దివ్యతేజో మూర్తి వెళ్ళిపోతున్నాడన్నబాధ , మరోవైపు అట్టి పరమ పురుషునికి , దైవాంశ సంభూతుని ఋణము ఎలా తీర్చుకోవాలో తెలియని స్థితి , ఆందోళన. అది గ్రహించి మణికంఠుడు *" గురుదేవా ! మనోవాక్కాయ కర్మలా మీరే నా గురుదేవులు. ఇక ఇందులో కృతజ్ఞతలు , ఋణభారాల ప్రసక్తేలేదు. అయితే ఓచిన్నకోరిక. ఈ అద్భుతాలు చిత్రాలూ , అన్నీ రహస్యంగానే మీ మనసులో వుంచుకోండి. అది ఇప్పుడే లోకానికి వెల్లడి కావటానికి వీలులేదు. నాజన్మరహస్యం అతిగోప్యం. మీతృప్తికొరకు ఋణ విమోచన కొరకు అభ్యర్ధన తరువాత వాక్యవృత్తి చెప్పండి"* అన్నాడు వినయముగా గురువుగారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతూ *"అలాగే ! నాయనా ! నీకు తెలియదా ! గురువుగా నాగొప్ప లోకానికి చాటటానికి , గురువు ఔన్నత్యాన్ని సాధకులు గ్రహించగలందులకు ఇలా అనుగ్రహిస్తున్నావు - కానీ - అలాగే - అంటూ


*అజ్ఞాన కారణం సాక్షి బోధస్తేషాంవిభాసకః | బోధాబాసో బుద్ధిగీతః కర్తాస్యాత్పుణ్యపాపయోః ॥*


వాక్యవృత్తి చెప్పాడు గురువుగారు. ఆనందానంద కందళిత హృదయుడై గురువుగారు వేదవాక్యమును ఉచ్చరిస్తూ సేలవు తీసుకొని సీమకు బయలుదేరిపోయారు సోదరులిరువురూ.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*🌸🙏🌺

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat