నవగ్రహ జననం - 41 వ అధ్యాయం

P Madhav Kumar


*బుధగ్రహ జననం - 4*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


విద్యార్థులు కళ్ళు మూసుకుని వేదసూక్తాన్ని వల్లెవేస్తున్నారు. బృహస్పతి అరమోడ్పు కళ్ళతో ఏకాగ్రతగా ఆలకిస్తున్నాడు.


చంద్రుడు కళ్ళు మూసుకోలేదు. వల్లె వేయడం లేదు. ఆలకించడమూ లేదు. అతని చూపులు ఆశ్రమ వాతాయనం మీదే ఉన్నాయి. వాతాయనం ముందు వయ్యారంగా నిలుచుని , తన వైపే చూస్తున్న తార మీదే ఉన్నాయి. తనను చూస్తున్న తార కళ్ళు నవ్వుతున్నాయి. పెదవులూ నవ్వుతున్నాయి...


*"చంద్రా !"* బృహస్పతి కంఠస్వరం చంద్రుణ్ణి ఉలిక్కిపడేలా చేసింది.


చూపుల్ని తిప్పి , ఆందోళనగా చూశాడు చంద్రుడు గురువుగారి వైపు. 


బృహస్పతి కళ్ళు తీక్షణంగా అతన్నే చూస్తున్నాయి. *"నీ మనసు పాఠం మీద లేదు..."*


*"క్షమించండి గురువుగారూ..."* చంద్రుడు సిగ్గుపడుతూ అన్నాడు.. *"విద్యార్జనలో ఏకాగ్రత అవసరం !"* బృహస్పతి మందలింపుగా అన్నాడు. *"జాగ్రత్త సుమా !"*


*"తారా ! ఇవాళ ఇంద్రసభకు వెళ్తున్నాను. "* పూజ ముగించిన బృహస్పతి అన్నాడు. *"ఎప్పుడు తిరిగొస్తారు ?"* తార ఆయన వైపే చూస్తూ అంది.


*"రాత్రి భోజనం వేళకు వచ్చేస్తాను ! ఆ... చంద్రుడు విద్యార్థుల్ని చూసుకుంటాడు..."* 


*"ఎవరో ఒకరు చూసుకోవడం మంచిది. లేకపోతే ఒకటే అల్లరి చేస్తారు. చిన్నపిల్లలు కదా !"* తార నవ్వుతూ అంది. 


*"నువ్వు జాగ్రత్త సుమా... పుంజికస్థల చేత పనులు చేయించుకో..."* నీరసంగా కనిపిస్తున్న తారను చూస్తూ అన్నాడు బృహస్పతి. 


*"అలాగే.... మీరు జాగ్రత్త స్వామీ !”* అంది తార.


నైవేద్యం పెట్టిన ఫలాలను అల్పాహారంగా స్వీకరించి , బృహస్పతి వెళ్ళిపోయాడు. తార వాతాయనం ముందు నిలబడి చూస్తోంది. విద్యార్థులందరూ వరుసలుగా కూర్చుని , ఏవో మంత్రాలు పఠిస్తున్నారు. చంద్రుడు వాళ్ళ ముందు నిలబడి - గురువుగారి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు.


తారలో రకరకాల ఆలోచనలు తేనెపట్టులోంచి తేనెటీగల్లా లేస్తున్నాయి. ఆలోచనల్లోంచి తేరుకున్న ఆమె పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. వాతాయనం ముందు నుంచి కదిలింది.


తార నీళ్ళ పాత్రల ముందు నిలుచుంది. నవ్వుతూ ఒక పాత్రను అందుకుంది. వెలుపలికి వెళ్ళి పాత్రలోని నీటిని చెట్టుపాదులో పోసింది. ఆ పాత్రను అక్కడే పెట్టి ,

 *"పుంజికా !"* తార బిగ్గరగా పిలిచింది. ?“ఓ పుంజికస్థలా ! ఎక్కడున్నావ్ ? ఇలారా !"* క్షణంలో పుంజికస్థల అక్కడికి వచ్చింది. *"అమ్మా... పిలిచారా ?"*


*"ఆ ! నీళ్ళు ఎందుకో కలుషితంగా ఉన్నాయి. పాదుల్లో పోసేశాను. నదికి వెళ్ళి నీళ్ళు తీసుకురా ! పిల్లలందరికీ త్రాగటానికి కావాలిగా. అన్ని పాత్రల నిండా ఉండాలి. నీళ్ళు !"*


*“సరే... అలాగే తీసుకొస్తాను..."* అంటూ పుంజికస్థల పాత్రను అందుకుంది. తమ దగ్గరగా వస్తున్న గురుపత్నిని చూస్తు విద్యార్థులు మంత్రపఠనం ఆపారు. విద్యార్థుల చూపుల్ని గమనించిన చంద్రుడు తల తిప్పి తార వైపు చూశాడు. తార అతని వైపు చూడడం లేదు.


విద్యార్థుల ముందు నిలబడి తార చిరునవ్వుతో చూసింది. *"ఇవాళ గురువుగారు లేరు కదా ! మీరు ఒక పని చేయాలి. వంటచెఱకు అయిపోవస్తోంది. అరణ్యంలోకి వెళ్ళి వంటచెఱకూ , సమిధలూ ఏరి తీసుకురండి. సనాతనుడు మీకు నాయకత్వం వహిస్తాడు. అతను చెప్పినట్టు నడుచుకోండి !"*


*"ఇవాళ మాకు నాయకుడిగా చంద్రుణ్ణి నియమించారమ్మా గురువుగారు !"* సనాతనుడు లేచి నిలుచుని , వినయంగా అన్నాడు. 


*"నాకు తెలుసు ! చంద్రుడు ఆశ్రమంలో , తోటలో కొన్ని పనులు చేయాలి. ఆ పనులు మీరూ , నేనూ చేయలేం. మీరు అరణ్యానికి వెళ్ళండి !”*


విద్యార్థులు ఉత్సాహంగా లేచారు.


చంద్రుడు అనుమానిస్తూ తార వైపు చూశాడు. *"గురువుగారు నన్ను..."*


*"ఏ పనికి నియోగించారో నాకు తెలుసు చంద్రా ! గురుశుశ్రూష ఎంత ముఖ్యమో , గురుపత్నీ సేవ కూడా అంతే ముఖ్యం !"* అంటు తార ఉత్సాహంగా అరణ్యం వైపు ఉరకలు పెడుతున్న విద్యార్థుల్ని చూస్తూ ఉండిపోయింది.


చంద్రుడు ఆమె వైపే చూస్తున్నాడు. ఎదురుగా చూస్తే ఎంత అందంగా ఉందో , ప్రక్కవాటంగా కూడా అంతే అందంగా , ఆకర్షణీయంగా ఉంది ఆమె. ఎందుకో తెలీదు గానీ , అందరు విద్యార్థులూ పిలుస్తున్నట్టు ఆమెను 'అమ్మా' అని పిలవాలనిపించడం లేదతనికి , ఆశ్రమంలో ఆడుగు పెట్టిన నాటినుంచీ !


తార తటాలున అతని వైపు తిరిగింది. చిరునవ్వు ఆమె పగడాల పెదవుల్ని కొద్దిగా విడదీసి , ముత్యాల్ని కొద్దిగా చూపించింది. *“చంద్రా.... నువ్వు నన్ను అందరిలాగా . 'అమ్మా !' అనడం లేదు ! ఎందుకు ?”*


చంద్రుడి గుండె దడదడ కొట్టుకుంది. తార ఎదుటివారి ఆలోచనల్ని చదువుతుందా ?


*"చెప్పు ! ఎందుకు ?"* తార నవ్వుతూ అడిగింది.


ఏం చెప్పాలో తేల్చుకోలేని చంద్రుడు నాలుకతో తడి ఆరుతున్న పెదవుల్ని తడుపుకున్నాడు.


*"చెప్పు ! ఎందుకు ?"* తన వెనక వైపు నుంచి బిగ్గరగా వినిపించిన ప్రశ్న , తారనే చూస్తున్న చంద్రుణ్ణి ఉలిక్కిపడేలా చేసింది. చంద్రుడు భయాందోళనలతో వెనుదిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు ! ఇందాక వెనకబాటుగా తనని ఉద్దేశించి ఆ ప్రశ్నను పలికిందెవరు ?


*“చెప్పు ! ఎందుకు ?”* తార అడిగిన ప్రశ్న మళ్ళీ చంద్రుడి చెవుల్ని పగలేసింది. ప్రశ్న అడిగిన చిలక చెట్టు మీద రెక్కల్ని టపటపలాడించింది. 


తార కిలకిలా నవ్వింది. 

*“నువ్వు సమాధానం చెప్పేదాకా అది అలా అడుగుతూనే ఉంటుంది !"*


చంద్రుడు కంగారుగా చూశాడు. తార చెయ్యి చాపి , చంద్రుడి చేతిని పట్టుకుంది.


*"ఇక్కడొద్దులే ! అక్కడ తోటలో చెబుదువుగానిలే రా !"* అంటూ లాగింది. చంద్రుడు గుటకలు మింగాడు.


*"రా , చంద్రా !”* తార లాగుతూ అంది.


*"రా, చంద్రా !"* అంది చెట్టు మీది చిలక.


చంద్రుడు ఉలిక్కిపడి కదిలాడు. తామరతూడులాగా నాజూకుగా ఉన్న తార చెయ్యి ప్రణయపాశంలా అతన్ని లాగుతోంది. *'రా , చంద్రా !', 'రా , చంద్రా !'* అంటూ వల్లె వేస్తున్న పిలుపు అతన్ని వెంటాడుతోంది. ఎందుకో అతని అడుగులు తడబడ్డాయి.


*"రా !”* తార తలతిప్పి వాలుగా చూస్తూ , చిరునవ్వుతో అంది , లాగుతూ. 


వెనక చిలక , ముందు చిలకల కొలికి ! చంద్రుడు అప్రయత్నంగా నవ్వుకున్నాడు..


అర్ధరాత్రి దాటింది. నిద్రపట్టని చంద్రుడు అటూ , ఇటూ దొర్లుతున్నాడు. తనను తోటలోకి తార లాక్కెళ్లినప్పటి దృశ్యాలు మూసుకున్న కళ్ళ ముందు పునర్దర్శనమిస్తున్నాయి. చంద్రుడికి.


*'రా !"* అంటూ తనను చెయ్యి పట్టి తీసుకెళ్తున్న తార వయ్యారాల నడక కాస్సేపట్లో పరుగుగా మారింది. ఒక గుబురు పొదరిల్లు సమీపంలోని చెట్టు నీడలో ఆగింది తార. నవ్వుతూ అతని వైపు చూసింది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చంద్రుడికి కనిపిస్తున్నాయి , సమ్మోహనకరంగా.


🙏 ఓం సకల నవగ్రహ దేవతాయే నమః🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat