*🌷. శ్రీ సిద్ధిధాత్రి దేవి ప్రార్ధనా శ్లోకము 🌷*
*'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి*
*సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ'*
*🌷. శ్రీ రాజరాజేశ్వరి దేవి స్తోత్రము 🌷*
*అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ*
*కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ |*
*సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా*
*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ||*
*🌷. అలంకారము - నైవేద్యం : శ్రీ రాజరాజేశ్వరీ దేవి- ఆకుపచ్చ రంగు - పరమాన్నం, పిండివంటలు*
*🌷. మహిమ - చరిత్ర 🌷*
*తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.*
*🌻. సాధన 🌻*
*దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…*
*1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.*
*సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.*
*నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.*
*ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.*
*నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.*
*దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.*
🌹 🌹 🌹 🌹 🌹