అయ్యప్ప సర్వస్వం - 9

P Madhav Kumar


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*సద్గురు సమాశ్రయణం*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


సద్గురు విశిష్టతను గూర్చి శ్రీపాదుక కొల్లురు అవతార శర్మగారు తమ అయ్యప్ప దర్శనం అను గ్రంధములో ఇలా సెలవిచ్చి యున్నారు. దీక్షాగ్రహణం గురించి కొద్దిగా తెలుసుకున్నాం. *సద్గురుమేవోపగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్ -* అని శాస్త్రం గురువును ఉపాసించవలసిన విధిని నిర్దేశించింది. ఎలా ? అంటే *దర్భపవిత్రపాణి:* అంటే దర్భలను చేతబట్టుకుని నిర్మలమైన అంతఃకరణంతో శ్రద్ధాభక్తులతో తనను పరిచయం చేసుకుని గురువుగారి పాదాలను పట్టుకోవాలి. అంటే శిరసు వంచి గురువుకు పాదాభివందనం చేయాలి. ఇలా ఎందుకు నిర్దేశించింది


తను శిరసు వంచి పాదాభివందనం చేసేటప్పుడు ప్రతీ వ్యక్తికీ ఒక భావన కలగడం సహజం. నేను ఇతనికి ఎందుకు తలవంచి నమస్కరించాలి ? అని. దీనికి మన మనస్సు సమాధానపడాలంటే మనకావ్యక్తిపై గొప్ప భక్తి , విశ్వాసములైనా ఉండాలి. లేదా భయమైనా ఉండాలి. ఈ విధమైన భయభక్తులు రెండూ అప్రయత్నంగా ఎవరి సందర్శన మాత్రం చేత కలుగుతాయో అతడే సద్గురువు. భక్తి భావన సరే. భయమంటే ఈ వ్యక్తిని , లభించిన ఈ శుభతరుణంలో చేజార్చుకుని దూరమైపోయామంటే మనం జీవిత పరమార్థాన్ని శాశ్వతంగా పోగొట్టుకున్నవాళ్ళమైపోతామనే భావన. ఈ విధమైన భయభక్తులు శ్రద్ధ ఎవరి దర్శనమాత్రం చేత కలుగుతాయో అతడు సద్గురువు. అతనియొక్క లక్షణాన్ని శాస్త్రం *'శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్' -* అంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అనే రెండు పదాల్లో నిర్దేశించింది.


శ్రోత్రియుడనగా వేదశాస్త్రములను చదివిన పండితుడని భావము. పండా అనగా జ్ఞానము. కాగా వేదశాస్త్ర పరిజ్ఞానం కలిగి దానిని అనగా ఆ వేదశాస్త్ర పరిజ్ఞానమును తన నిత్య జీవన విధానంలో అమలు పరచి ఆదర్శమగు గురుమూర్తిగా నెన్నదగినవాడని భావం. ఇంకను అతడు బ్రహ్మనిష్ఠుడు కావలెను. వేద ప్రతిపాద్యమైన బ్రహ్మము నందు నిష్ఠ కలవాడని భావము. వేదము - సర్వం ఖల్విదం బ్రహ్మ - అంతా బ్రహ్మమయం - జగమంతా బ్రహ్మమయం బ్రహ్మేత్తరమైన పదార్థ ఈ సృష్టిలో అణుమాత్రమైనను లేదు. అణువు మొదలు బ్రహ్మాండము వరకు బ్రహ్మమేనని చెప్పి ఆ బ్రహ్మము 'నీవేనుసుమా' 'తత్వమసి' అని ప్రతిబోధించినది. దాని యదార్థతత్త్వమును నిరంతరము మననము చేయుచుండినచో బ్రహ్మనిష్ఠ బ్రహ్మమునందు గురి , లేదా బ్రహ్మావలోకనశక్తి సిద్ధిస్తుంది. దానివల్ల అతడు ఆ బ్రహ్మము నేనే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు. ఆ బుధ్ధి లేదా జ్ఞానము స్థిరముగా నిలచినప్పుడు బ్రహ్మనిష్ఠుడౌతాడు. అప్పుడు 'బ్రహ్మైవాహమస్మి' నేను బ్రహ్మమునే తప్ప వేఱుకాదు అనియు సోహం బ్రహ్మాస్మి ఆ బ్రహ్మమును నేనే అని మరల మరల రెట్టించిన ధైర్యముతో తన స్థానాన్ని బ్రహ్మనిష్ఠగా ప్రకటిస్తాడు. అతడు బ్రహ్మనిష్ఠుడు.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌷🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat