నీవెవరు ? - నిర్వాణ షట్కమ్ తెలుగు అర్ధంతో

P Madhav Kumar

 


నీవెవరు ?

నేను ఎవరిని అని అన్వేషింవారందరూ ఆ ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతూ మహాత్ములుగా , మార్గదర్శకులుగా మారారు .ఆది శంకరాచార్యులు , స్వామి అరబిందులు ,శ్రీ  రామకృష్ణ పరమహంస ,  శ్రీ రమణులు వీరందరూ అటువంటి వారే కదా ! శంకరాచార్య స్వామి  ఒక సారి ఒక సాధువు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నీవెవరు ? - నిర్వాణ షట్కమ్ తెలుగు అర్ధంతో చెప్పిన ‘ నిర్వాణ షట్కాన్ని’ చూడండి .  ‘జీవుల్లోని ఆత్మ అనేది పరమాత్మ అయిన శివ స్వరూపమే’ అనే అద్వైత సిద్ధాంతాన్ని  విశదీకరిస్తూ యెంత అద్భుతంగా చెప్పారో !

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం

భావం :నేను - శరీరానికి చెందిన మనసును కాను; బుద్ధిని కాను; అహంకారాన్ని కాను; చిత్తం  కాను; చెవులు కాను; నాలుక కాను; ముక్కు కాను; కళ్ళు కాను; ఆకాశాన్ని కాను; భూమిని కాను; అగ్నిని కాను; వాయువును కాను. నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని. నేనే చిదానంద రూపుడనైన శివుడను!


న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశః
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానంద రూపః శివోహం శివోహం

భావం : నేను - ఊపిరిని, ఉచ్ఛ్వాస/నిశ్వాసను కాను; పంచప్రాణాలు కాను;  ఏడు ధాతువులైన రస, రక్త, మాంస, మేధస్, ఆస్తి, మజ్జ, శుక్రములు  కాను; పంచ కోశములుగా ఉన్న అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు కాను ; వాక్కును కాను, చేతులు కాను, పాదములు కాను; విసర్జన చేసే అంగమును కాను; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని. నేనే చిదానంద రూపుడనైన శివుడను!

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం

 భావం :నాకు రాగద్వేషాలు, లోభమోహాలు లేవు; నాకు మద మాత్సర్యాలు లేవు; నేను ధర్మార్థకామమోక్షాల వెంట పడను ; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని. నేనే చిదానంద రూపుడనైన శివుడను!


న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనైవ న భోజ్యం న భోక్తాః
చిదానంద రూపః శివోహం శివోహం

భావం :నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖాలు లేవు; నాకు మంత్రము, తీర్థము, వేదము, యజ్ఞములతో పని లేదు; నాకు ప్రియమైనది, ప్రీతిని కలిగించేది, నా చే ప్రీతి పొందబడేది లేదు; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని. నేనే చిదానంద రూపుడనైన శివుడను!

న మే మృత్యుశంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం

భావం :నాకు మృత్యు భయము, జాతిభేదము, తల్లి, తండ్రి, జననము లేవు; నాకు బంధువులు, మిత్రులు, గురువులు, శిష్యులు లేరు; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని. నేనే చిదానంద రూపుడనైన శివుడను!

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణి
సదా మే సమత్వం న ముక్తిర్నబంధః
చిదానంద రూపః శివోహం శివోహం

భావం :  నేను అన్ని గుణాలకు అతీతుడను, కోరికలు లేనివాడిని ;  నిరాకారుడను, అంతటా వ్యాపించి ఉన్నాను; నాకు ఇంద్రియాలు లేవు; నేను ఎల్లప్పుడూ ఒక్కలాగే ఉంటాను; నాకు బంధాలు లేవు.  నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని. నేనే చిదానంద రూపుడనైన శివుడను!

అద్భుతం కదా! నీలోనున్న నిన్ను తెలుసుకోవడానికి చక్కని చిరునామాలా ఉన్న ‘ నిర్వాణ షట్కాన్ని’ అర్థం చేసుకుంటే, ప్రతి ఆత్మా - పరమాత్మే కదా ! 

- లక్ష్మి రమణ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat