*ప్ర:* *నాకు*
*'లలితా సహస్రం' పారాయణం చేసే అలవాటు ఉంది.* *అది చదివిన వెంటనే 'విష్ణుసహస్రం' కూడా చదువుతుండే దానిని. అయితే ఒకరోజు ఒక సన్యాసిని మా ఇంటికొచ్చి, 'లలితా సహస్రం' చదివాక ఇంకే దేవుడి స్తోత్రాలూ చదవకూడదు అన్నారు. లలిత* *కన్నా ఇతర దేవతలు ఎక్కువకారు అని కూడా అన్నారు. నిజమేనా ?*
*జ:* అలా అని ఏ శాస్త్రమూ లేదు. మన తృప్తి కోసం ఏ స్తోత్రం చదువుకున్నా తప్పు లేదు. లలితా సహస్రం చదివాక, విష్ణు సహస్రం హాయిగా చదువుకోవచ్చు. మన ఓపిక ఎంతుంటే అంతగా చదువుకోవచ్చు. 'కూడదు' అనకూడదు. లలిత, విష్ణువు, శివుడు - ఒకే తత్త్వానికి చెందినవారు. పరబ్రహ్మ స్వరూపులు. వీరి ముగ్గుర్ని 'రత్నత్రయం' అన్నారు అప్పయ్య దీక్షితులు. 'ముకుందా ముక్తి రూపిణీ', 'వైష్ణవీ', 'గోప్త్రీ గోవిందరూపిణీ' అని అమ్మవారి నామాలు.
దేవతలలో ఎక్కువ తక్కువలుండవు. మనం ఉపాసించే దైవాన్ని 'సర్వాధిక్యం'గా ఉపాసించడం మంచిదే. కాని ఇతర దేవతలను తక్కువగా చూడకూడదు. మన ఉపాస్యదైవాన్ని భావిస్తూ ఉంటే అంతా ఆ దేవత యొక్క ఆధిక్యమే కనబడడం సహజం, ఇతర దేవుళ్లను మన ఉపాస్యదైవం యొక్క రూపాలుగా చూడాలి. ఈ భావమే అన్ని సహస్ర నామాలలో బోధింపబడే తత్త్వం.
🌹🌹🌹🌹🌹🌹