👉 శ్రీ పంచలింగాల క్షేత్రం.
💠 దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై అయిదు లింగాలు వెలసిన దివ్యధామం కర్నూలులోని పంచలింగాల క్షేత్రం.
💠 పురాతన కాలం నాటి ఈ ఆలయం సర్పదోషాలను పరిహరించడంలో ప్రసిద్ధి గాంచింది.
💠 కార్తీక మాసంలో ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఎక్కడెక్కడినుంచో భక్తులు విచ్చేస్తున్నారు.
🔆*స్థలపురాణం 🔆
💠 పూర్వం జనమేజయ మహారాజు సర్పయాగాన్ని నిర్వహించాడు.
దానిఫలితంగా సర్పదోషం సంక్రమించింది.
ఈ దోష నివారణ కోసం దేశం నలుమూలలా కోటి లింగాలను ప్రతిష్టించాడు.
ఆ కోటి లింగాలలో చిట్ట చివర ప్రతిష్ఠించినదే ఈ పంచలింగాల క్షేత్రం.
💠 చిట్టచివరగా నిర్మించినది కదా అని జనమేజయ మహారాజు ఉదాశీనంగా ఏమీ ఊరుకోలేదు.
అనేకమంది యోగులు, మంత్ర సిద్ధుల చేత శాస్త్రోకంగా పంచలింగాలను ప్రతిష్టించి సర్పదోషం నుండి విముక్తి పొందినట్టుగా గంగాపురాణం ప్రస్తావించింది.
💠 ఎందరో మహారాజుల పరిపాలన కాలంలో ఈ ఆలయంలో విశేష పూజాపురస్కారాలు జరిగాయి.
ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం విరూపాక్ష ముఖద్వారంగా విలసిల్లింది.
💠 ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయులు దర్శించాడని ఆలయం ముందు ఉండే శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది.
ఈ శాసనాలలో విజయ నగర సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు నేటì కీ కనిపిస్తాయి.
💠 రాయల సీమ కూడా ఈ ప్రాంతం నుండే ఆరంభం అయినట్టు ఇక్కడ లభించే శిలాశాసనాల ద్వారా తెలియవస్తుంది.
💠 ఈ ఆలయంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో ప్రతిష్టించబడిన వీరభద్రుడు, సకల కోరికలు తీర్చేటువంటి చాముండి మాతను కూడా దర్శించుకోవచ్చు.
ఇంకా ఈ ఆలయం చుట్టు అనేక శివాలయాలు వెలిశాయి. కానీ కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి.
💠 గధాదరుడు అయినటు వంటి గయా నారాయణుడిని కూడా ఈ ఆలయంలో మనం దర్శించుకోవచ్చు.
💠 పూర్వం ఈ క్షేత్రాన్ని దక్షిణ గయగా కూడా పిలిచేవారట.
ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు సర్పదోషం, నవగ్రహ దోషం, మృత్యుదోషం, కుజ దోషం వంటి అనేక దోషాలు నివృత్తి అవుతాయని ఆలయ అర్చకుడు రంగాచార్యులు తెలిపారు.
💠 ఆలయానికి తూర్పు ముఖంగా తుంగానది ప్రవహిస్తుంది.
ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ చేపట్టింది.