*శ్రీ వేంకటేశ్వర వైభవం - 1*
*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*
*🙏శ్రీ స్వామివారి నిత్యారాధన కార్యక్రమము🙏*
*అపార కారుణ్యోదార్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ* *సౌలభ్యా ద్యనన్తకళ్యాణ గుణ మహోదధి యై,*
🍃🌹కలియుగ ప్రత్యక్ష దైవమై కామితార్థ ప్రదుడై శ్రీవేంకటాద్రి (తిరుమల) యందు ఆనంద నిలయమున పరమానంద ప్రదాతయై అర్చావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానములో ప్రతినిత్యము కవాటోద్ఘాట నాది కవాట బంధపర్యన్తము అనగా ఆలయము తలుపులు తెరచినది మొదలు తలుపులు మూయువరకు గల కాలములో జరుగు కార్యక్రమ వివరణము.
*🙏సుప్రభాతము🙏*
🍃🌹బ్రాహ్మముహూర్తమునకు (56 ఘడియలకు)) ముందుగానే, ప్రబోధవాద్యములను వాదకులు మధురముగాను, మృదులముగాను శ్రీవారి దేవస్థానములో మ్రోగించుచుండ అర్చకస్వాములు, జియ్యంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవస్వాములు, వేద వేత్తలు, భాగవతోత్తములు, భక్తులు, అధికారులు, పరిజనములు, పరివారములు మొదలగువారు తమ తమ విధ్యుక్తధర్మముల నాచరించి పవిత్రగాత్రులై స్వరూపధారులై శ్రీ స్వామివారి దేవాలయ మహాద్వారము నుంచి భగవధ్యానము చేయుచు గోవిందనామ సంకీర్తనముచేయుచూ ధ్వజ ప్రదక్షిణ పార్శ్వము నుంచి ఆనందనిలయ విమాన ప్రదక్షిణముగా శ్రీస్వామివారి సువర్ణద్వారమున గల ద్వారపాలకుల పురోభాగమునకు క్రమముగా చేరెదరు.
🍃🌹అర్చకస్వాములు శ్రీవారి సువర్ణ ద్వారములోని బంగారు తలుపులకు గల అంతర్బంధమును (లోపలిగడియను) మంత్ర పూర్వకముగా యంత్రికతో (కుంచె కోలతో) తొలగించెదరు. ఆ తలుపులకు బయట అధికారులచే బంధింపబడియున్న రెండు తాళములయందు గల సీళ్ళను తొలగించి తాళములను తీసి వంశ పరంపరా ప్రాప్తమగు శ్రీవారి కైంకర్యముగల యాదవుడు (గొల్ల) తలుపులను తెరుచును.
🍃🌹వెంటనే అర్చకస్వాములు మహర్షికుల తిలకుడగు విశ్వామిత్ర మహాముని త్రేతాయుగమునందు శ్రీ స్వామివారిని గూర్చి యొనరించిన *'కౌసల్యా సుప్రజా రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం”* అను సుప్రభాత గీతమును ప్రారంభించి శ్రీవారి సుప్రభాతమును పఠించుచూ జియ్యంగార్లతోను ఏకాంగులతోను యాదవుని( గొల్ల) తోను ఆలయమందు ప్రవేశించెదరు.
🍃🌹ఇచ్చట సువర్ణ ద్వారము (బంగారు వాకిలి)నందుగల భక్తులందరరూ, ఆ సుప్రభాతముననువదించుచు శ్రీవారి సుప్రభాతమును ఉచ్చైస్స్వరముతో అతిమధురముగా శ్రీస్వామివారు నిదురనుండి లేచునట్లు పఠించి క్రమముగా శ్రీ వేంకటేశ స్తోత్రమును, శ్రీవేంకటేశ ప్రపత్తిని, శ్రీ వేంకటేశ మంగళాశాసనమును పఠించుచుందురు. ఆలయ మునందు ప్రవేశించిన అర్చకస్వాములు అనర్ద్వారమునందు తమచే బంధింపబడిన తలుపుల " తాళమును తీసి తలుపులు తెరచెదరు. క్రమముగా శ్రీవారి సన్నిధానమునకు చేరి అచ్చట శ్రీవారి పాదాబ్జముల నాశ్రయించి నమస్కరించి ధ్యానించి, సాత్వికత్యాగ మొనరించి, ఆజ్ఞగైకొని, శయనమునందు నిదురించుచున్న శ్రీభోగ శ్రీనివాసస్వామి వారి సన్నిధానమునకు వచ్చి, కరతలధ్వానములు చేసి ప్రణవ పూర్వకముగాను, మంత్రపూర్వకముగాను శ్రీవారిని నిదురనుండి మేల్కొలిపి శ్రీవారి సన్నిధానమున వారి స్వస్థానమందు వేంచేపు చేయుదురు.
🍃🌹జియ్యంగార్లు, ఏకాంగులు సన్నిధికి వచ్చి, దీపోద్దీపనము గర్భాలయ సంమార్జనము మొదలగు క్రియలను నిర్వర్తించెదరు. తరువాత పరిచారకులు యవనిక (తెరను వేయగా అర్చకుడు శ్రీస్వామివారికి వెన్న, పాలు, పంచదార నివేదనము చేయును. కర్పూరైలాలవంగ జాజీ క్రముకాది చూర్ణముతో కూడిన సుగంధి ముఖవాసమును (తాంబూలమును) సమర్పించి నీరాజనమును చేయును.
🍃🌹అర్చకుడు తాను తీర్థస్వీకారము చేసి శఠారి తీసుకొని అచ్చటి వారలకు కూడా తీర్థము శఠారి సాయించును. సువర్ణ ద్వారము ముందుగల భక్తులు చేయుమంగళా శాసనము పూర్తికాగానే సువర్ణద్వారము తలుపులు తెరువబడును. అప్పుడు శ్రీస్వామివారికి కర్పూరహారతి చేయబడును. సువర్ణద్వారము నందుండి మంగళాశాసనము చేయు భక్తులందరు అతి ఆతురతతో క్రమక్రమముగా శ్రీవారి సన్నిధానమునకు వచ్చెదరు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*