అయ్యప్ప సర్వస్వం - 22

P Madhav Kumar


*ప్రలోభాలకు అతీతముగా నియమనిష్ఠల నాచరింప చేయుటే గురుస్వాముల ముఖ్య కర్తవ్యం*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


మన భారత దేశములో నెలకొని యున్న ఆధ్యాత్మిక చింతన ప్రశాంత వాతావరణం , శక్తీ భూతమైన పుణ్యక్షేత్రములు , పాప నివృత్తి చేయు పవిత్ర నదులు , సాగర సంగమములు, ఇహపర సుఖముల నిచ్చు యాత్రలు , నియమ నిష్టలతో భక్తి భావముతో ఆరాధించి వారి వెంట సదా అభయ వరదప్రదాతలుగా అవతరించిన మహిమాన్విత అవతారమూర్తులు ప్రపంచ దేశాలన్నిటికి మార్గదర్శకమై ఆకర్షించు చున్నవి. తపోధనులైన మహర్షులు తమ దివ్య శక్తులతో సేకరించిన అమూల్య సమాచారము ఉపాసనా యోగ తపోపద్ధతులు మరెచ్చట లేని రీతిలో మన సంస్కృతిలో భాగమై తరతరాలుగా ఆసేతు హిమాచల పర్యంతం సమస్త ప్రచారా వాహినిలో కులమత తరతమ , స్త్రీ , పురుష వయోబేధముల కతీతముగా అంతర్గతమై సరైన గురువు దర్శన శిశ్రూష , ఉపదేశములతో పెల్లుబికి జీవితమును ఆనందమయముగా పిపీలకాది బ్రహ్మ పర్యంతం లోకా సమస్తాం సుఖినోభవంతు యను మూల సూత్రంతో మనసా వాచా నిష్టా గరిష్ట ధ్యాన , యోగ , దర్శన స్పర్శలతో లోక కళ్యాణమునకు నిరంతరము ముందుకు సాగుచున్నవి.


అందువలనే అఖండ భారతావని కర్మభూమిగా నీరాజనా లందుకొనుచు సిరిసంపదలు అధికార పటాటోపములు అఖండబల పరాక్రమములు ఆధునిక నాగరికతా విన్యాసాలు సమస్త సౌకర్యాలు కరతలామలకములుగా యున్న కంటికి నిద్దురలేక అభిమాన వాత్సల్యములు , బాంధవ్య అనుబంధాలు ఆత్మానందం లేక అసంతృప్తితో కదలికలై మనఃశాంతి కోసము మరోమార్గము లేక భారతావనిని ఆశ్రయించి ఆనందాను భూతి పొందుచుండు మహనీయ చరిత్ర కలిగినది మన భారత దేశం. ఆరోగ్య కరమైన అలవాట్లు క్రమశిక్షణ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే నియమాలు ఆచారాలు అంతులేని జ్ఞాన సంపదను భౌతిక జ్ఞాన నేత్రాలతో శోధించి సేకరించి శిష్యులకు ఉపదేశించి ఉత్తములుగా తీర్చిదిద్దే విద్యాలయాలు , గురుకులములు గురుబ్రహ్మ , గురువిష్ణు , గురుదేవో మహేశ్వరా యను త్రిమూర్తి స్వరూపులై మాతృదేవోభవ పితృదేవోభవ యని జన్మ నిచ్చిన తల్లి దండ్రుల తరువాత బాధ్యతలు స్వీకరించి జ్ఞానమున్న మనిషిగా తీర్చి దిద్ది ఆచార్యదేవోభవ యని నీరాజనాలందుకొని , యేమాత్రం రాజీలేని రీతిలో అనుబంధాల కతీతముగా నడుచుకొనే గురుతుల్యులు ఇచ్చట తప్ప మరెక్కడా లేరు. ఎంతటి మేధావియైనా తన మేధస్సు గురు ముఖంగా ప్రజ్వరిల్ల చేసికొన్న చరిత్ర మన కాధారముగా గోచరిస్తుంది.


ఇంతటి ఉదార చరిత్రతో విరాజిల్లే మన హిందూ సంస్కృతి ఇటీవల నవనాగరికత , విదేశీ సంస్కృతి , అర్థంలేని అనుకరణలు అధికమై అన్ని రకములా ఈ విపరీత కాలుష్యమునకు బ్రష్టు పట్టుచున్నవి. దీనితో మన ఆచారాలు , సనాతన ధర్మాలు మూలార్థాలు మూలబడి అనవసర విమర్శలతో అధోగతి పాలగుచున్నవి. సమాజము తాము నడిచేది సంస్కృతి యని సనాతన సంప్రదాయాలు , మూఢ విశ్వాసాలని మిడి మిడి జ్ఞానంతో అపహాస్యముచేసే స్థితికి దిగజారినది. వినోదానికి , విలాసానికి , విహారానికి , భక్తికి యాత్రకు , ముక్తికి బేధాలు లేని వితండ వాదం అధికమైనది. దీనితో భక్తి , నియమ నిష్టలతో చేయవలసిన యాత్రలు విలాస వినోద యాత్రలాచేయు నవదంపతుల కేళీవిలాస నిలయములగుచున్నవి. ప్రచారబలం , అధికార పరిరక్షణ , అవకాశవాదం , స్వార్థ పరత్వము లాంటి బలహీనతలు కలిగిన పాలకుల పెత్తందార్ల ప్రాబల్యము పెచ్చు పెరిగినది. అందువల్ల దీనిని నియంత్రించే బాధ్యత ప్రతివారికి బరువైంది. ఈ స్థితిలో మందు , మగువ , మాంసము అసభ్య ప్రలాపనలు దుర్వ్యసనములు బలోపేతమై విజృంభించినవి. సన్మార్గునికి స్వతంత్ర జీవనము భారమైంది. అనవసర భాద్యతల జోలికి పోయి అసలు ప్రాణానికే ముప్పు యేర్పడే స్థితిలో కొట్టు మిట్టాడే వాతావరణంలో నలుగురితో పాటు నారాయణా యని నోరు మూసుకొని కూర్చుంటున్నారు.


ఈ ప్రమాదకర వాతావరణ కారుచీకటిలో కాంతి పుంజములా శబరిగిరి అయ్యప్ప యాత్ర దర్శనములు అందు పాటించ వలసిన నియమ నిబంధన వేషభాషలు జనులను బాగా ఆకర్షించుట గాక స్వామి దర్శనమున కలుగు మధురానుభూతికి యెందరో ముగ్ధులైనారు. దీనితో ప్రజలు శబరియాత్రకు గురుస్వాముల వద్దకు చేరడం మండల దీక్షకు పూర్తిగా సిద్ధమై మాలధారణ , కఠిన నియమములు , బ్రహ్మచర్యము, వ్యసనముల నిషిద్ధముగా కఠినముగా పాటించుచూ ఇరుముడితో గురుస్వాములవెంట శబరిని దర్శించి శుభములు పొందుట అలవాటైనది.  *కాని ఈ యాత్రికుల సంఖ్య అధికము కావటము , వీరికి దీక్షనొసంగే గురుస్వాముల అవసరము పెరగడం యాత్రాపరంగా వ్యాపార లక్షణాలు ముమ్మరం కావడంతో సంవత్సర సంవత్సరానికి అసలు సిద్ధాంతాలు యాత్రా ప్రమాణాలు దిగజారు చున్నాయి. ఇక అందినంతలో నాలుగు రాళ్ళు సంపాదించాలనే తపన అధికమైఅసలు మూల సిద్దాంతము మూలపడి 40 రోజుల దీక్షలు కుదించుకొని 10 రోజులు , పలుకుబడి పరపతి వుంటే ఒకటి రెండు రోజుల దీక్ష నిచ్చేవారు తయారైనారు. సాక్షాత్తు అపర అయ్యప్పలుగా ఆరాధింప వలసిన స్వాములు కొందరు నల్ల వస్త్రధారణకు మారుగా ఎదోఒకటి నామమాత్రం ధరించటం , కట్టుబొట్టు నిర్లక్ష్యం చేయటం మధుపానంలో మునిగి తేలడం శబరియాత్ర ముగించి దారిలోనే దీక్షవిరమణ చేసి ముఖం వాచినట్లు మందు , మాంసాహారం మెక్కడం ప్రసాదాలు , పటాలు సంచులు భుజానే వుంటాయి) ఒకరకమైతే , పవిత్ర శరణుఘోష ప్రతిధ్వనించాల్సిన నోట పనికి మాలిన ప్రసంగాలు పల్కటం పెచ్చు పెరుగుతుంది.*


*దీనితో సమాజంలో ఈ అవకాశవాద అయ్యప్పలను జూచి అపహాస్యము చేసే వారధికమైనారు. ఇక గురుస్వాములు తమస్థాయి ఔన్నత్యం దిగజార్చు కొనుచు సీజనులో పది , పావలా సంపాదించకపోతే మరలా అవకాశము రాదని వీలైనంత యెక్కువగా పరుగులు తీయుచు మూల ప్రమాణాలను పవిత్ర ఆశయాలను మూలకు నెట్టుచున్నారు. కొందరు నిషిద్ధ వయస్సు గల స్త్రీలకు ..... ఔషధ సేవలతో యాత్రచేయు యెత్తులు చేయుచుండగా దేవస్థానము వారు కఠిన చర్యలు తీసుకొని మహిళా నిషిద్ధమును గురించి గురు స్వాముల వివరణ కోరితే "యాత్ర నిబంధనలు ప్రతివారు పాటించి శిష్యులకు అమలు జరిపితే సమస్యే లేదు. మేము నిబంధనలంటే మరియొకరు కళ్ళు మూసుకుని వారు కోరినట్లు దీక్ష ఇచ్చి యాత్ర చేయించి నాలుగు రూపాయలు సంపాదించు కొనుచున్నారు. మేము ఆర్థికంగా నష్టపడుటయేగాక నిస్టురాలు లేదా ధనవంతులో , బలవంతులో అధికారశక్తి కలిగిన వారో అయితే ప్రాణాల మీదకొచ్చినట్టే" అని అంటారు వారు. ఇందులో యదార్థము లేకపోలేదు. ఈ పరిస్థితి కొనసాగితే మరి కొంతకాలానికి మూలస్వరూపమే మాయమౌతుంది.*


కనుక ముఖ్యంగా శబరిగిరి దేవాలయము వారు అయ్యప్ప సేవా సమాజములు , స్వచ్ఛంద సంస్థలు , ఆధ్యాత్మిక పత్రికలు ఈ విషయములో తగిన శ్రద్ధ వహించాలి. పరిపూర్ణ దీక్ష నిబంధనలు పాటించడం వలన శ్రీ అయ్యప్ప కృపతో కలిగే శుభాలు పల్లె పల్లెన ప్రచారముచేసి భక్తులను చైతన్య వంతులు చెయ్యాలి. తరచు గురుస్వాముల సభలను నిర్వహించి దేశవ్యాప్తంగా యున్న మేధావులైన గురుస్వాముల అభిప్రాయ సలహాలను స్వీకరించి వారి ప్రోత్సాహ సహకారములతో ఈ క్లిష్ట వాతావరణము చక్కదిద్ద వలయును. ఈ ప్రయత్నములో కొన్ని కష్టనష్టములున్నా క్షేత్రపరిరక్షణకు శబరిగిరి దేవస్థానమువారు అయ్యప్ప సేవాసమాజములు , స్వచ్చంద సేవాసంస్థలు ఈ విషయమై ప్రత్యేక దృష్టి ప్రసరించి తగుచర్యలు తీసుకొను అవశ్యకత ఎంతైనా వున్నది. 


*మనవి:-*   ఈ వ్యాసములోని సమాచారము యేగురుస్వామిని , యేభక్తుని కించపరిచే ఉద్దేశ్యముతో ప్రస్తావించ బడలేదు. ఇటీవల ఈ యాత్రలో చోటుచేసుకొను చున్న కొన్ని బలహీనతల నియమ నిబంధనల సడలింపు కొందరికే పరిమితము. అందరికి చెందినవి కావు. దీక్షాధారణ మొదలు సర్వము మరిచి ఆహోరాత్రులు మనసా వాచా శ్రీ అయ్యప్పను హృదయాంతరాళమున స్మరించుచు శరణుఘోషతో ఉఛ్వాస నిశ్వాసములు జరుపుచు ఇరుముడి దారులై పదునెనిమిది సోపానముల నధిరోహించి కన్నుల పండుగగా కలియుగ వరదుడు శ్రీ అయ్యప్పను దర్శించి సేవించి ఇహపర మోక్ష సౌధములందించు మకరజ్యోతి దర్శనముతో జన్మ సార్థకత చేసుకొను మహాభక్తు లెందరో యున్నారు. వారియాత్రాకాలమే మనకు శ్రీరామరక్షగా కాపాడు చున్నది. ఈ నగ్నసత్యాన్ని ఇతర భక్తులు పాటించి ఆచరించితే అంతకు మించిన మధురానుభూతి మరెక్కడ దొరకదు.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌸🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat