అయ్యప్ప సర్వస్వం - 23

P Madhav Kumar


*గురువు*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


మనహిందూ సాంప్రదాయం ప్రకారం గురువు , బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులతో సమమైన వారేకాక , సాక్షాత్ గురువే పరబ్రహ్మ అనగా దైవం అని భావించ బడుతోంది. తల్లి , తండ్రి , గురువు , దైవ సమానులు. గురువు అంటే మనకు జ్ఞానాన్ని అనగా తెలివిని ప్రసాదించే వారని అర్థము. జ్ఞానము లేక పోయిన తరువాత మనమీ ప్రపంచంలో జన్మించియూ వృధా అగును. పూర్వకాలం గురుకులాలు యుండేవి. అచ్చటే గురువులు ఆశ్రమం కట్టుకొని జీవించెడి వారు. ఆ గురువు గారి దగ్గర విద్య నేర్చు కోవడానికి తల్లి తండ్రులు తమ పిల్లలను గురువుల వద్దకు పంపెడివారు. అక్కడ గురువుగారి సేవ చేస్తూ గురువు గారి భార్య వండి పెట్టిన భోజనం చేస్తూ , విద్యార్థులు సకల వేదాలు , శాస్త్రలు నేర్చుకొను చుండెడివారు. వారి వారి కులాను సారముగా వారికి అచ్చట శిక్షణ ఇవ్వబడు చుండెడిది. ఆ విద్యార్థులకు అన్ని విద్యలూ చక్కగా వచ్చినవని తెలుసుకొన్న పిదప గురువు గారు వారిని ఇండ్లకు వెళ్ళుటకు అనుమతి నిచ్చెడివారు. అప్పుడు విద్యార్థులు గురువు గారు ఏది కోరితే అది దక్షిణగా సమర్పించుకుని వచ్చెడి వారు.


మన రామాయణ , మహాభారత భాగవత కథలలో అనేక మంది గురుశిష్యుల కథలు మనకు లభిస్తుంటాయి. ముఖ్యంగా ఏకలవ్యుడు అనే బోయబాలుని గురుభక్తి ప్రశంసించ తగింది. పాండవులకి , కౌరవులకి ద్రోణా చార్యులు అనే గురువు గారు సకల విద్యలూ నేర్పుతూ యుండెడివారు. పాండవులు , కౌరవులు కలసి అనేక మంది శిష్యులు యున్నా ద్రోణాచార్యుల వారికి పాండవ మధ్యముడైన అర్జునుని పై ఎక్కువ వాత్సల్య ముంటూ వుండేది. దానికి కారణము అర్జునుడు గురువు గారు చెప్పిన ఏ విద్యనైనా తొందరగానూ , సులువు గానూ నేర్చుకొనడమే. ఒక సారి ద్రోణాచార్యుల వారు అర్జునునిపై మితిమీరిన కృపతో విలువిద్యలో నీకు సమానుడు ఎవ్వరూ లేకుండా యుండేటట్లు చేస్తానని వరం ఇచ్చేశారు. ఒకరోజున ఏకలవ్యుడను బోయ బాలుడు ద్రోణాచార్యుల వారి చెంత చేరి నమస్కరించి విలువిద్య నేర్పవలసిందని ఎంతో ప్రార్థిస్తాడు. నీవు బోయవానివి కనుక నీకు విద్య నేర్పుటకు వీలు కాదు అంటారు ద్రోణాచార్యులు. ఆ మాటతో ఏకలవ్యుడు దుఃఖితుడై ఇంటికి వెళ్ళి , ఏవిధంగా విద్య నేర్చుకోవాల ? అని పరిపరి విధముల ఆలోచిస్తూ యుంటాడు. అతని ఆలోచనలలో ఏ గురువూ అతనికి నచ్చలేదు. ద్రోణాచార్యుల వంటి గురువు మరెవ్వరూ లేరని నిశ్చయించుకొని , ఆయననే గురువుగా భావించుకొని , ఆయన చిత్ర పటమును తెచ్చి ఒకచోట పెట్టి పూజించి విలువిద్య నేర్చుకొనుటకు మొదలు పెట్టాడు. అతనికి గల అచంచల భక్తి విశ్వాసం వల్లను , గురుభక్తి వల్లను అతి త్వరలో సకల విద్యాపారంగతుడయ్యాడు.


ఒకనాడు ఆకస్మికముగా అర్జునినితో సహా ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుని బోయ గూడానికి రావడం తటస్థించింది. అచ్చట

తన చిత్రపటాన్ని చూచి ఆశ్చర్యపోయారు ద్రోణాచార్యులు. అంతలో ఏకలవ్యుడు గురువు గారి రాక విని పరుగెత్తుకుని వచ్చి కాళ్ళపై వాలిపోయాడు. అంతట ద్రోణాచార్యులు ఏకలవ్యుడు కేవలం తన చిత్రపటం ద్వారా ఎంత విలువిద్యా పారంగతుడయ్యాడో ఆ కథ అంతయూ తెలుసుకుని ఎంతో సంతోషపడి పోతారు. ఏకలవ్యుడు అర్జునుని కంటే కూడా విలువిద్యలో ఆరితేరినట్లు గ్రహిస్తారు ఆయన. అది అంతయూ చూచిన అర్జునుడు చిన్న బోయిన ముఖంతో కూర్చుండి బోతాడు గురువు గారిదగ్గర. అప్పుడు ద్రోణాచార్యుల వారికి అర్జునుని విలువిద్యలో సాటిలేని వానిగా తయారు చేస్తానన్న మాట గుర్తుకు వచ్చింది. వెంటనే ఆయన ఏకలవ్యుని వైపు తిరిగి ఏకలవ్య ! నన్ను గురువుగా భావించి విద్య నేర్చుకున్నావు కదా ! నాకు గురుదక్షిణ ఇవ్వవలయును కదా ! అన్నారు. ఏకలవ్యుడు అంతట *"మహాత్మా ! కోరండి ఏదిమీరు కోరినా తెచ్చి ఇవ్వగలను"* అన్నాడు.


అప్పుడు ద్రోణాచార్యుల వారు *"నీ కుడిచేతి బొటన వ్రేలు నాకు గురు దక్షిణగా సమర్పించు"* అన్నారు. ఆ వ్రేలేపోతే ఒకబాణం వేసేదెట్లు ? అయినా ఏకలవ్యుడు సందేహించ లేదు. వెంటనే బొటన వ్రేలు ఖండించి గురువు గారి పాదాల చెంత సమర్పించాడు. అందుచేతనే ఇప్పటికీ ఏకలవ్యుడు గురుభక్తికి నిదర్శనంగా నిలబడి పోయాడు. గురువు గారంటే ఆకాలంలో అంత భక్తి ప్రపత్తులుండేవి. గురువుగారి మాట వేదవాక్యమే. ఇప్పుడు పూర్వము మాదిరిగా గురుకులాలు లేవు. కాని పాఠశాల లున్నాయి. పాఠశాలల్లో విద్యనేర్పే వారిని టీచర్లని , ఉపాధ్యాయులు అని అంటారు. మనకు అర్థంకాని ఎన్నో విషయాలను అర్థమయేట్లుగా వివరించి చెబుతారు ఉపాధ్యాయులు. ఎంతటి వారికైనా సరే గురువు నేర్పనిదే క్రొత్త క్రొత్త విషయాలు అర్థంకావు. ఎవ్వరికీ కూడా *"గురువు అనుగ్రహమునకు మించిన సంపద మరి యొకటి లేదు"* ఓం తత్సత్.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat