*1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము*
*విశ్వరూప దర్శనము*
🍃🌹ఈ విశ్వరూప దర్శనమునందు రాత్రి పూజ అయిన తరువాత ఆలయము తలుపులు మూయగానే బ్రహ్మాది దేవతలు వచ్చి శ్రీస్వామివారికి ప్రణమిల్లి, ప్రార్థించి, ధ్యానించి, అర్చించి, తీర్థస్వీకారము చేసి పరమ పవిత్రులై సంతుష్టాంతరంగులై వెళ్ళెదరు. కావున, బ్రహ్మాది దేవతలు తీర్థ స్వీకారము చేయగా మిగిలిన శ్రీవారి తీర్థము బ్రహ్మతీర్థమను పేరుతో శ్రీ జియ్యంగార్లకు ఆచార్యపురుషులకు శ్రీ వైష్ణవగోష్ఠికి భక్తులకు క్రమముగా వినియోగము చేయబడును.
🍃🌹ఇందులకై విశ్వరూప సేవా పరాయణులగు భక్తాగ్రేసరులు అతి కౌతుకముతో కనిపెట్టుకుని ఉంటారు. ఇది గొప్ప విశేషముగా సంప్రదాయవేత్తలు భావించెదరు. విశ్వరూప సేవాపరాయణులందరకు క్రమముగా దర్శనము లభించును.
*🙏శుద్ధి 🙏*
🍃🌹తరువాత ఆలయములో పూర్ణముగా శుద్ధిజరుగును.
*🙏ప్రాతఃకాలారాధనము🙏*
🍃🌹ఆరాధనమునకు పూర్వాంగముగా శ్రీ జియ్యంగారు పుష్పసంచయ స్థానమగు యమునత్తురైకి వేంచేసి అచ్చట శ్రీ స్వామివారి పుష్పకైంకర్యపరుగు పరిచారకులు పుష్పములచేతను, కమలముకుళముల చేతను, దవనము చేతను, మరువము చేతను ప్రత్యేకముగ తయారు చేసిన వివిధ మాలల చేతను, పుష్పముల చేతను, తులసీదళముల చేతను నిండించిన వేణుమయ పాత్రమును (వెదురుగంపను) శిరస్సు యందుంచుకుని భగవద్ధ్యానము చేయుచూ జామంటానాదము చేయువాదకుడు ముందు నడుచుచుండ ధ్వజదండపార్శ్వము నుంచి శ్రీస్వామివారి సన్ని ధానమునకు తెచ్చి ఉంచెదరు.
🍃🌹అర్చకుడు ఆ పుష్పసంచయమును శుద్ధి యొనరించి, పూర్వాంగములను పూర్తికావించుకుని సంస్కరించి ఘంటానాదము చేయుచూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆరాధనమును శ్రీ వైఖానస శాస్త్రప్రకారము ప్రారంభించును. ప్రారంభించి క్రమముగా శ్రీ కౌతుక మూర్తియగు శ్రీభోగ శ్రీనివాసస్వామివారిని చతుష్కోణాలంకృతమగు రజతమయ (వెండి)పీఠమునందు వేంచేపుచేసి పురుషసూక్తముతో అభిషేకము ప్రారంభించును.
🍃🌹వేదవేత్తలు శ్రీవైష్ణవస్వాములు ఆ పురుషసూక్తమును పఠించుచుండ అభిషేకము పూర్తిచేయుదురు. శ్రీ జియ్యంగార్లు, శ్రీ వైష్ణవస్వాములు నీరాట్టమును పఠించుదురు. తరువాత శ్రీవారికి వస్త్రాభరణ పుండ్రాదులు సమర్పించి శ్రీవారి సన్నిధానమున వేంచేపు చేయుదురు. తరువాత శ్రీవారి (తిరువడి) సువర్ణపాదములను స్నాన పీఠమునందుంచి భక్తిశ్రద్ధలతో అభిషేకము చేసి శ్రీవారి పాదాబ్జములయందు సమర్పింతురు. పిమ్మట మహత్తర శక్తియుక్తములై శ్రీవారి సన్నిధానమున వేంచేసియున్న శ్రీ సీతారామ, నరసింహ, గోపాల, మత్స్య కూర్మాద్యనేక సాలగ్రామ మూర్తులను స్నాన పీఠమునందుంచి అభిషేకము సమర్పించి తిరిగి వారి స్వస్థానమందుంచెదరు.
🍃🌹ఇట్లు జరిగిన అభిషేకతీర్థములన్నియు త్రిపథగా తీర్థములవలె ప్రకాశించుచు అస్మదాదులను తరింపచేయుటకై వచ్చి చేరును. అనంతరము క్రమముగా శ్రీవారికి, ఇతర మూర్తులకు మహనీయమూర్తులకు గర్భాలయ దేవతలకు యథోక్తములగు ఉపచారములు జరుగుచుండును. అటు సమయములో శ్రీ జియ్యంగార్లు, శ్రీ వైష్ణవస్వాములు శ్రీ తొండరడిప్పొడియాళ్వారు సాయించిన తిరుప్పల్లి ఎళుచ్చి అరువది పాశురములు దివ్య ప్రబంధమును గానము చేయుచుందురు. తరువాత అలంకారాసనములోని తోమాలసేవ ప్రారంభమగును.
*🌻తోమాలసేవ🌻*
🍃🌹శ్రీ జియ్యంగార్లు, ఆచార్య పురుషులు, అధ్యాపకులు, శ్రీ వైష్ణవ స్వాములు శ్రీ ఆండాళ్ సాయించిన తిరుప్పావు (30) ముప్పది పాశురములు దివ్య ప్రబంధములో 28 పాశురములను అతి మధురముగా అతి శ్రావ్యముగా గానమును చేయుచుండ అర్చకుడు శ్రీ జియ్యంగార్లు ఇచ్చు పుష్పమాలలను తీసుకుని భయభక్తి శ్రద్ధావిధేయతలతో మామూలు మేరకు శ్రీభోగ శ్రీనివాసమూర్తివారికి, శ్రీ భూదేవులకు శ్రీవారికి కంఠమాలలు, హృదయపర్యన్త మాలలు, నాభి పర్యన్త మాలలు, కటిపర్యన్త మాలలు, జానుపర్యన్తమాలలు, పాదపర్యస్తమాలలు, కఠారిమాలలు, శంఖచక్ర మాలలు, శిరోమాలలు, శిఖరమాలలు, బహువిధములగు పుష్పమాలలను బహువిధముగా సమర్పించును.
🍃🌹క్రమముగా ఇతర మూర్తులకు ఇతర స్వాములకు పుష్ప మాలలు సమర్పించును. తోమాల సేవ అను పేరుతో జరుగు అలంకారాసనములోని ఈ పుష్పమాలాలంకార సమర్పణ వైభవమును రెప్పలు వాల్చక శ్రీవారిని దర్శించు యాత్రికులగు భక్తాగ్రేసరులు ఆనందపరవశులై మైమరచియుందురు. తరువాత మంత్రపుష్పము జరిగి నక్షత్రహారతి, కర్పూర హారతి జరుగును. తరువాత శ్రీవారికి కొలువు. (ఆస్థానము) ప్రారంభమగును.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*