_*🚩అయ్యప్ప చరితం - 2 వ అధ్యాయం🚩*_

P Madhav Kumar


🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️

లింగ వాయు పురాణాలలో భూతనాథోపాఖ్యానము అని వివరంగా చెప్పబడ్డ మణికంఠుడు, ధర్మశాస్త్రా ఉపాఖ్యానాన్ని సావధాన చిత్తులై వినండి!’’ అంటూ చెప్పసాగారు సూతమహర్షి!


*మణికంఠుని చరితం*


*‘‘గురుర్బహ్మో గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః*

*గురు సాక్షాత్పరబ్రహ్మః తస్మై శ్రీగురవే నమః*

*ఏకదంతం మహాకాయం కోటి సూర్య సమప్రభం*

*నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా’’* అంటూ గురువును, విఘ్నేశ్వరుని ధ్యానించి చెప్పసాగారు సూతమహర్షి! ‘‘శౌనకాది మునులారా! ప్రళయకాలం పూర్తయి బ్రహ్మ సృష్టికార్యం ప్రారంభించి పధ్నాలుగు లోకాలను, ఆ లోకాలలో నివసించడానికి జీవజాలాన్ని సృష్టించారు. ఆ లోకాలను పాలించే మహావిష్ణువు, లయకారుడైన పరమేశ్వరుడు తమ తమ శక్తులతో కూడి వైకుంఠ, కైలాసాలతో నివసిస్తూ తమ కార్యాలను నిర్వహిస్తున్నారు! భూలోకంలో కృతయుగం ప్రవర్తిల్లుతున్నది! భూమిపై నివసించే మానవులు సత్వ , రజ , తమోగుణాలనే మూడు గుణాలతో స్వాయంభువ మనువు ద్వారా వ్యాప్తి చెందారు! భూమి కర్మభూమిగా గుర్తింపబడింది.


మానవులు మరణానంతరం తమ సత్కర్మఫలంగా స్వర్గాది ఊర్థ్వలోకాలలో సుఖభోగాలనూ, దుష్కర్మల ఫలంగా నరకాది అథోలోకాలలో కష్టాలను, కఠిన దండనలనూ అనుభవిస్తూ గడిపి తిరిగి భూమిపై జన్మిస్తూ మాయాప్రభావానికి కట్టుమడి జీవితాలు గడుపుతూ ఉండాలన్న విధి విధానాన్ని ఏర్పర్చడం జరిగింది! స్వర్గంలో నివసించే దేవతలకు, పాతాళంలో నివసించే దైత్య దానవులకు మధ్య మాత్రం ఎప్పుడూ సంఘర్షణలు, యుద్ధాలు జరుగుతూనే వుండేది. మధ్య వున్న భూలోకాన్ని మనువు సంతతకి చెందిన సూర్య, చంద్ర వంశస్థులైన రాజులు న్యాయంగా పరిపాలిస్తూనే వున్నా బలవంతులైన దైత్య దానవులవల్ల అశాంతి, అధర్మం భూమిపై చెలరేగుతూ వుండేది! యజ్ఞయాగాదులకు , శాంతి భద్రతలకు , సత్కర్మాచరణకు భంగం వాటిల్లుతుండేది! అప్పుడు ధర్మ సంస్థాపన కోసం శ్రీమహావిష్ణువు భూమిపై అవతరించవలసి రావటం అనివార్యం అయ్యేది! ఈ విషయాలన్నీ అష్టాదశ పురాణాలలో మనం వివరంగా చెప్పుకున్నాం గదా! మహావిష్ణువు అవతరణకు , బలవంతులైన రాక్షసులు జన్మించి బ్రహ్మను తపస్సుతో మెప్పించి అజేయులుగా వరాలు పొందడానికి ముఖ్యకారకులు తపస్సంపన్నులైన ముని ముఖ్యులేనన్న విషయం మరిచిపోకూడదు! అయితే అవి చివరకు లోక కళ్యాణ కారకాలుగానే పరిణమించేవి! ఈ విషయాలన్నీ బ్రహ్మ సభలో ఒకసారి చర్చకు వచ్చాయి..’’ అంటూ చెప్పటం కొనసాగించాడు సూతమహర్షి!


*‘‘నారాయణ! నారాయణ! ఆహా! త్రిమూర్తులు, వారి సతీమణులు, ఇంద్రాది దేవతలు, సప్తఋషులు - అందరితో ఎంతో శోభాయమానంగా వెలుగొందుతున్నది ఈ సభా మండపం! ఏ విషయమై చర్చిస్తున్నారు దేవగురూ’’* అని అడుగుతూ బృహస్పతి ప్రక్కన ఆశీనుడైనాడు నారద మహర్షి! *‘‘నారదా! భూలోక సంచారం చేసి వస్తున్నట్లున్నావు గదా! అక్కడి పరిస్థితులే సమీక్షిస్తున్నారు’’* అని చెప్పాడు బృహస్పతి!

అంతలో ఇంద్రుడు లేవడంతో అందరూ అతనివైపు దృష్టి సారించారు! *‘‘త్రిమూర్తులకు, త్రిదేవీమాతలకు నా ప్రణామాలు! హే! సృష్టి , స్థితి , లయకారకులారా! స్వర్గ , మర్త్యలోకాలమధ్య స్నేహ , సుహృద్భావాలు పెంపొందుతున్నా , పాతాళవాసులైన రాక్షసులవల్ల ఈ రెండు లోకాలలో అశాంతి , కల్లోలం తల ఎత్తుతూనే ఉన్నాయి! స్వామీ! మీ కృపవల్ల అమృతాన్ని పొంది మేము అమరులమైనా రాక్షసులు తపస్సుతో వరాలు పొంది మాపై ఆక్రమణకు సిద్ధమవుతూనే ఉన్నారు! హిరణ్యాక్ష , హిరణ్యకశిపుల దౌర్జన్యాలు అరికట్టడానికి శ్రీహరీ , తమరు వరాహ , నరసింహావతారాలు దాల్చి మమ్మల్ని కాపాడారు! పరమ భాగవోత్తముడైన ప్రహ్లాదుడు పాతాళాన్ని చేరి ధర్మంగా పాలిస్తూంటే భూలోకంలో తిరిగి శాంతి భద్రతలు సుప్రతిష్టమై యజ్ఞయాగాలు సజావుగా సాగుతున్నాయి! ఇందుకు మా అందరి పక్షానా మీకు కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను! మీకు మా శతకోటి ప్రణామాలు!’’* అంటూ నమస్కరించాడు వినయపూర్వకంగా అంజలి ఘటించి!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat