అయ్యప్ప సర్వస్వం - 30

P Madhav Kumar


*శరణ మహిమ - దీక్షా నియమాలు*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


శబరిమల యాత్రకు స్వామి శరణనామములే మార్గదర్శి , మార్గానుచారి , మార్గబంధువు అని అంటారు మన ఆర్యులు. కనుక స్వామి భక్తులు సదా శ్రీస్వామి శరణనామములను పలుకుతూ , వ్రాస్తూ తమ 41 దినముల మండలకాల దీక్షను పూర్తిజేసి ఇరుముడి కట్టి , శబరిమలయాత్ర గావించవలయునన్నదే మన ఆర్యులు ఏర్పరచి యున్న విధి. ఈ శరణ నామములు శ్రీస్వామి అయ్యప్పకు మిక్కిలి ఇష్టమైన మంత్రమగును. దీని వెనుక యొక సూక్ష్మమైన పరమార్ధ తత్వము దాగియున్నది. ప్రాచీన తాళపత్ర గ్రంథముల మూలాన ఇది లభించడమైనది. శ్రీ స్వామి భక్తులు ఈ పరమార్ధతత్వాన్ని తెలుసుకొని స్వామి శరణాలు పలుకుతూ శబరిమలయాత్ర గావించినచో ఫలితము మరింత హెచ్చుగా యుంటుందను సదుద్దేశ్యముతో ఈ క్రింది వివరణ పొందు పరచడమైనది. 


*"స్వామి శరణం"* అను ఈ రెండు పదములకు ఒక మహత్తరమైన మంత్రమును మనపెద్దలు అందించియున్నారు. ఆ శ్లోకమును దాని తాత్పర్యమును తెలుసుకొనినచో స్వామి శరణం అను పదములోని పరమార్ధము గోచరించును.


*స్వామి శరణ మంత్రము*


ఋషి ప్రోక్తంతు పూర్వాణం మహత్మానాం గురోర్మతం |  


“స్వామి శరణ" మిత్యేవం ముద్రావాక్యం ప్రకీర్తితం ॥ 


“స్వా" కారోచ్చార మాత్రేణ "స్వా" కారం దీప్యతే ముదే | 


“మ" కారంతు శివంప్రోక్తం "ఇ" కారం శక్తి రుహ్యతే ॥ 


స్వాత్మానాంచ పరాత్మానాం తయోరైక్యాత్తదం శుభం | 


ప్రసన్నం భార సంహారం వినీతం వశ్య కారణం | 


“శం” బీజం శత్రు సంహరం రేఫం జ్ఞానాగ్ని వర్ధనం । 


“ణ కారం" సిద్ధితం శాంతం ముద్రా వినయ సాధనం ॥ 


శాస్త్రుముద్రా వాక్యమేవం యన్ముదే పరిశోభితే || 


తన్ముఖే వసతే లక్ష్మీ విద్యా విదయ శాలినే ॥ 


కలౌ ఛష చిత్తానాం నరాణాం పరిశుద్ధయే | 


ఋషీణాం పునరాధ్యానాం ఉపదేశం మహత్తమం |


*తాత్పర్యము :-*


ప్రాణ , అపాన , వ్యాన , ఉదాన , సమాన వాయువులను కట్టు బరచుటకు ఉపయోగకరమైనదియూ , సర్వులు సులభముగా ఉచ్ఛరించి ముక్తిపొంద దగినదియు. అలనాటి ఋషులచే ఉపదేశించబడినదియూ , తదుపరి వచ్చిన మహాత్ములంగీకరించి నదియు ఐన *'స్వామి శరణం'* అను దివ్యమంత్రము శ్రీస్వామి అయ్యప్పకు చాలా ఆనందాన్ని కలిగించేటిదగును. 'స్వా' అన్న అక్షరం ఉచ్చరించినంత మాత్రమున హృదయాంతర్గతమైన 'ఆత్మ' జాజ్వల్యమానముగా కాంతి ప్రభలను విరజిమ్మును. అనగా అజ్ఞానమనే చీకటి నశించిపోవును. ఈ ఆత్మయే సర్వహృదయాం తర్గతమైన మంగళ స్వరూపమగు శివ స్వరూపము. మాయను అభిష్టానము గావించుకొనిన పరమేశ్వరుడు , ఈ పంచ భూతాత్మకమైన సృష్టిని గావించి ప్రకృతిమాత మాయా వాగురములలో జీవులను పడతోసి భ్రష్ట బద్ధులు గావించుచున్నాడు. అట్టి త్రిగుణము లను అధీనపరచి , ప్రకృతికాంతను శివస్వరూపముతో ఐక్యము గావించి అజ్ఞాన నిర్మూలము గావించుకోవడమే *"స్వామి"* అన్నపద ఉచ్చారణకు సూక్ష్మార్థము. దీనివలన జీవులకు శుభం కలుగుతుంది. అందుకే మాల ధరించిన స్వాములు కలుసుకున్నప్పుడు , స్వామి , అని పిలవమన్నారు కాబోలు.


'శ' కారము అనగా శత్రు సంహారము. మనలోని కామ , క్రోధాదులనెడి శత్రువులను సంహరించడమే 'శ వాచకమునకు అర్థము. 'ర'కారము జ్ఞానాగ్ని వాచకము. కామక్రోధాదులు నశించిన జీవులకు జ్ఞానము సిద్ధించును. 'ణ' కారము సిద్ధితం శాంతం. 'ణ' కారము శాంతిని సిద్ధింపజేయును. అనగా కామ క్రోధాదులను సంహరింపచేసుకొన్న జ్ఞానికి 'శాంతి' లభిస్తుంది. ఇదియే 'శరణం' అను పదమునకు పరమార్థము.


'ముద్ర' అనగా భక్తుల యొక్క భవ బాధలను పోగొట్టునది. శ్రీస్వామి వారికి సంతోషము కలిగించునది అని అర్ధము. దీనిని వినయముతోనే సాధించవలెను. 'శాస్త్రృ ముద్రా' అనబడు 'స్వామి శరణం' అను ఈ వాక్యము ఎవరి ముఖమునుండి వెలువడుతుందో వారి ముఖమున లక్ష్మీకళ ప్రశోభిల్లును. వారియొక్క వాక్కులో సరస్వతి నివసించును. వారు శ్రీమంతులు , దయాళులు , విద్యావంతులు , వినయవంతులు కాగలరు. కనుక ఈ కలిలో నీటిలోని చేపలా నిలకడ లేక సదా చంచలచిత్తులై వ్యవహరించు మానవులకు చిత్తశుద్ధి కలిగించుటకు అలనాటి ఋషులు మహత్వము నిండిన ఈ మహామంత్రము నుపదేశించి యున్నారు. *'స్వామియే శరణం అయ్యప్ప'* అను మంత్రమును నాభికమలము నుండి బయలుదేరు ప్రాణవాయువును హృదయ మార్గముగా పయనింపజేసి నాలుకపై శబ్దముగా తాండవింపజేయవలయును. 


*కలౌ కల్మష చిత్తానాం పాప ద్రవ్యోప జీవినాం ।*

*విధి క్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం ॥*


ఈ కలికాలములో కల్మష చిత్తులైనవారూ , పాప కృత సంపాదనతో జీవించువారూ , విధితమైన వృత్తులను మాని ప్రవర్తించువారూ సద్గతి పొందుటకు భగవన్నామ సంకీర్తన యొక్కటియే చక్కని మార్గమని అంటుంది పై శ్లోకము. అదియు గాక కృత త్రేతా ద్వాపర యుగాలలో తపము , యజ్ఞము , దానధర్మాదుల వలన పొందే సత్ఫలితాన్ని కలిలో నామజప సంకీర్తన వలన సులభముగా పొందవచ్చునను ఆర్యోక్తిని ఆధారముగా గొని సర్వత్రా శ్రీస్వామివారి శరణునామ జపమును మారుమ్రోగింప జేయవలయుననియు తన్మూలాన లోక క్షేమం వర్ధిల్లాలనియు సత్సంకల్పంతో అయ్యప్ప విజయం వారిచే మొదలిడబడిన శరణుకోటి మహాయజ్ఞములో వర్ణ , వర్గ , వయో , లింగభేదము లేక సర్వులు భాగస్వాములై , *“ఓం స్వామియే శరణం అయ్యప్ప"* అంటూ వ్రాయడం మొదలు పెట్టండి. ఒక్కసారి వ్రాస్తే పదిసార్లు చెప్పుకొన్నట్లని గ్రహించి పట్టుగా శరణుకోటి వ్రాయండి.


అలా వ్రాసిన శరణుకోటి కాగితాలను తమ గ్రామములోనో లేక సమీపమునందుగల అయ్యప్ప స్వామి దేవస్థానం వారికందించండి. ఒక కోటి నామములయ్యాక ఆ దేవాలయ ప్రాంగణంలో శరణు కోటి స్థూపం నిర్మించి , అందులో సేకరించబడిన శరణుకోటి కాగితాలతో నింపి మూసి వేయండి. కొన్నాళ్ళకందుండి యొక దివ్యశక్తి వెలువడి అచ్చట ప్రతిష్టితమైవున్న గ్రామ రక్షక దైవమైన అయ్యప్ప విగ్రహానికి చైతన్యాభివృద్ధి కలిగి , గ్రామములో దుష్ట శక్తుల ప్రవేశం నిషేధించబడి , భక్తులకు ఆరోగ్యం , మనశ్శాంతి మున్నగునవి లభించును.


రాష్ట్రవ్యాప్తంగా ఉండే అయ్యప్ప దేవాలయాల నిర్వాహకులు ఇందులోని పరమార్థ తత్వాన్ని గుర్తించి , భక్తులను ప్రోత్సాహపరచి , ప్రతివారిని అనుదినం వంద శరణాలకు తగ్గక వ్రాయించి , అలా వ్రాయబడ్డ కాగితాలను తమ దేవాలయానికి లభించిన విలువైన విరాళంగా తలచి , సేకరించి , పొదుపుచేసి ఉంచితే... కొన్నాళ్ళకు రాష్ట్రములోని అన్ని అయ్యప్ప దేవాలయాలలోను శరణుకోటి స్థూపాలు నిర్మితమౌతుంది. ముఖ్యంగా శబరిమలకు వెళ్ళలేని స్త్రీలు , వృద్ధులు , పిల్లలు , అనారోగ్య వంతులు , దీన్ని యొక యజ్ఞంలా దలచి దినమొక శరణకోటి కాగితం వ్రాయడం మొదలిడితే ఆ శరణఘోష ప్రియుని కృప వలన సర్వులకు సర్వకార్యానుకూలం సిద్ధించును. *'కర్పూరమంటే తనకెంతో పానకమంటే మరియెంతో శరణన్న పదము ఎంతెంతో ఇష్టం స్వామికి అన్నమాట ప్రతివారికి తెలుసు కావున శ్రీ స్వామివారికి చాలాఇష్టమైన శరణుకోటిని లెక్కపెట్టలేనన్ని వ్రాసి శ్రీ స్వామి వారి నుండి ఎనలేని అనుగ్రహ సంపదను పొందుటకు కృషిచేయుదుము గాక. - *'స్వామియే శరణం అయ్యప్ప'*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat