*అధ్యాయము - 9*
*నిశుంభ వధ - 3*
అప్పుడు నిశుంభుడు తెలివినొంది, (మూర్ఛ తేటి) వింటిని గైకొని దేవిని (చండికను), కాళిని, సింహాన్ని బాణాలతో కొట్టాడు.
దితిపుత్రుడైన ఆ రాక్షసేశ్వరుడు పదివేల చేతులు కల్పించి (పదివేల) చక్రాయుధాలతో చండికను కప్పివేసాడు.
దుస్సహదుఃఖాలను తొలగించే దుర్గాభగవతి అంతట కుపితయై ఆ చక్రాలను బాణాలను తన బాణాలతో ఛేదించింది.
అంతట నిశుంభుడు రాక్షససేనా పరివేష్టుడై, వేగంగా గదను గైకొని చండికను వధించడానికి (ఆమె మీదికి) ఉరికాడు.
అతడలా వేగంగా వస్తుండగా, చండిక అతని గదను తన పదునైన ఖడ్గంతో త్రుంచివేసింది. అతడు అంతట శూలాన్ని తీసుకున్నాడు.
దేవతలను పీడించే నిశుంభుడు శూలహస్తుడై వస్తుండగా, చండిక వేగంతో ఒక శూలాన్ని ప్రయోగించగా అది అతని హృదయంలో గ్రుచ్చుకొంది.
శూలంతో భేదింపబడిన అతని హృదయం నుండి మహాబల శౌర్యసంపన్నుడైన మరొక పురుషుడు "నిలువు” అని పలుకుతూ బయగకు వచ్చాడు.
దేవి బిగ్గరగా నవ్వుతూ ఆ వెల్వడిన పురుషుని శిరస్సును తన ఖడ్గంతో ఛేదించింది. అతడంతట నేలకూలాడు.
సింహం తన ఉగ్ర కోఱలతో కొందరు అసురుల కంఠాలను పొడిచి వారిని భక్షించింది. కాళి, శివదూతి ఇతరులను భక్షించారు.
కౌమారీ బల్లెపుపోట్లతో కొందరు మహాసురులు నశించారు. ఇతరులు బ్రహ్మాణి చల్లిన మంత్రంతో, పవిత్రజలం చేత జయింపబడ్డారు.
మరికొందరు మాహేశ్వరి త్రిశూలపు పోటుతో కూలారు. కొందరు వారాహి యొక్క ముట్టెపోట్లతే చూర్ణమయ్యారు.
వైష్ణవి యొక్క చక్రంతో కొందరు రక్కసులు తెండెతుండెములుగా తెగిపోయారు. మరికొందరు ఐంద్రి చేతి వ్రేళ్లతో ప్రయోగించబడిన వజ్రాయుధం వల్ల కూలారు.
కొందరు అసురులు (తామే) మరణించారి. కొందరు యుద్ధభూమి నుండి పారిపోయారు. ఇతరులును కాళిచే, శివదూతి చే, సింహంచే మ్రింగబడ్డారు.
శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణి మన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “నిశుంభవధ” అనే నవమాధ్యాయము సమాప్తం.
సశేషం....