*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*
*🌻కొలువు (ఆస్థానము)🌻*
🍃🌹శ్రీనివాసప్రభుమూర్తి (కొలువు శ్రీనివాసస్వామివారు) సువర్ణ ద్వారమునకు బంగారు వాకిలికి) ముందుగల ఆస్థాన మండపమందు అమర్చిన సింహాసనమునకు సువర్ణఛత్రము, వింజామరలు మొదలగు మహారాజ మర్యాదలతో వేంచేసి, సింహాసనము నధిష్ఠించెదరు. వెంటనే అర్చకుడు శ్రీవారికి ఆరాధనము చేయు మహారాజ మర్యాదలు జరుపును. శ్రీవారి అర్చకునకు మాత్రాదానమును అనగా దక్షిణ తాంబూలతిల ఫలాదియుత తండులదానమును చేయుదురు. అర్చకుడు ఆ దానమును ప్రతిగ్రహించి శ్రీస్వామివారికి నిత్యైశ్వర్యోభవ, అని మంగళా శాసనముచేయుచు శ్రీవారి పాదాబ్జములయందు పుష్పాంజలి నర్పించును.
🍃🌹తరువాత మిరాశీదార్లు దివ్య ప్రబంధమును, చతుర్వేదములను, ఉపనిషత్తులను, పురాణములను, ఇతిహాసములను, కల్పసూత్రములను, బ్రహ్మసూత్రములను, భాష్యములను శ్రీవారికి శ్రద్ధాభక్తులతో వినిపించెదరు. పిమ్మట పంచాంగమును ఆ దినమునందును, పరదినము నందును గల తిథి వారనక్షత్ర యోగకరణములతోను, గ్రహసంచార విశేషములతోను, ఉత్సవాది విశేషములతోను వినిపించెదరు.
🍃🌹అనంతరము శ్రీవారికి పూర్వదినమున భక్తులు సమర్పించిన కానుకల ద్రవ్యమునంతయు నాణెముల ప్రకారము వివరముగా వినిపించెదరు. తరువాత శ్రీవారికి గుడమిశ్రమగు తిలచూర్ణము (బెల్లముతో కూడిన నువ్వుపిండి) నివేదనము జరిగి హారతి జరుగును. జియ్యంగార్లు అధికార్లు మొదలగువారలకు శఠారి జరిగి ఆ ప్రసాద వినియోగము జరుగును. అంతట శ్రీ స్వామివారు కొలువు చాలించి మహారాజమర్యాదలతో శ్రీవారి సన్నిధానమున స్వస్థానమునకు వేంచేయుదురు. తరువాత శ్రీస్వామివారికి సహస్రనామార్చనము ప్రారంభమగును.
*🌻సహస్రనామార్చనము🌻*
🍃🌹అర్చకుడు శ్రీస్వామివారి పాదాబ్జముల సాన్నిధ్యమున కూర్మాసనము మీద పద్మాసనమున కూర్చుని ఘంటానాదము చేయుచు సంకల్పమొనరించి పూర్వాంగములగు ఉపచారములు సమర్పించి తులసీ పుష్పములను తీసుకుని "ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః” అని పూజ ప్రారంభించగానే, మిరాశి భాగవతోత్తముడు బ్రహ్మాణ పురాణాంతర్గతము శ్రీ వేంకటేశ్వరస్వామివారి సహస్రనామములను మధురాతి మధురముగా అతి శ్రావ్యముగా ఆద్యన్తములయందు ప్రణవ నమస్సంపుటీకరణము చేసి ఉచ్చైస్స్వరముతో శ్రద్ధాభక్తులతో పఠించుచుండును.
🍃🌹అర్చకుడు తదేక ధ్యానముతో సంసారసాగర సముత్తరణ సేతువులగు శ్రీవారి పాదాబ్జములయందు తులసీదళములను, పుష్పములను సమర్పించుచుండును. ఇది అర్చకుని యొక్క జన్మాన్తర సహస్రార్జిత పుణ్యసముదాయ ఫలముగా భావించవలసియున్నది. ఇటుల శ్రీవారి సహస్రనామార్చనము పూర్తి కాగానే శ్రీవారి పాదముల యందు పూజించబడిన తులసీదళములను పుష్పములను తీసుకుని అర్చకుడు శ్రీవారి పట్టమహిషులగు శ్రీభూదేవుల చరణారవిందములయందు “ ఓమ్ శ్రీం, శ్రియైనమః " అని పూజించుటకు ప్రారంభించును.
🍃🌹మిరాశీదారగు భాగవతోత్తముడు వరాహపురాణోక్తములగు లక్ష్మీనామములను అతిమధురముగా శ్రద్ధాభక్తులతో పఠించుచుండును. అర్చకుడు తదేకధ్యానముతో జగన్మాతృస్థానము నలంకరించిన శ్రీభూదేవులను పూజించుచుండును. శ్రీవారి సహస్రనామార్చన దర్శన సేవాపరాయణులగు యాత్రికులు, భక్తులు కన్నుల కరువుదీర చూచుచు తమజన్మ ధన్యతను తలపోయుచు పరమానంద సముద్రములో మునిగి ఒడలు మరచియుందురు.
🍃🌹శ్రీవార్లకు శ్రీతాయార్లకు పూజనము పూర్తికాగానే నక్షత్ర హారతి వెంటనే కర్పూరహారతి జరుగును. ఈ అర్చన సేవాపరాయణుల యొక్క దర్శన సేవ పూర్తి అయిన వెంటనే శ్రీవారికి భోజ్యసనము ప్రారంభమగును. లఘు శుద్ధి జరుగును.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*