*కన్నిస్వామి*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అయ్యా ! గురుస్వాములారా ! స్వామి భక్తితో నడక నేర్చుకోబోతున్న కన్నిస్వాములకు మీ చిటికెన వ్రేలందించి , స్వామి స్వర్ణమయ సౌధమునకు కరుణార్దహృదయులై వారిని నడిపింపుడు. క్రమశిక్షణ లేనిదే ఏ పనియూ జరుగదు. క్రమశిక్షణ అత్యంతావశ్యకమే కాని క్రమశిక్షణ మాటున మన అధికార దర్పము కాని , అజ్ఞానపూరితమైన అహంభావత్వముకాని చూపరాదు. స్వామి నిష్ఠల వెనుక గల అంతరార్థమును మీరు చక్కగా గ్రహించి , క్రొత్త వారికి తెలియజేయుడు. ఎంతోకొంత స్వామిపట్ల భయభక్తులు కల్గినవారే స్వామి దర్శనమునకు కుతూహ లగుదురే కాని , మరీ నీరస చిత్తులు కాజాలరు. కావున వారిలో గల ఆ జ్ఞానజ్యోతిని , మీ అనుభవమనెడి స్వామి భక్తితో మరింత ప్రజ్వలింపచేయుడు. సహేతుకమైన వ్రతనిష్టను ఆచరించుటకు నేటి యువత తప్పక ముందుకు వచ్చును. వారికి లేనిపోని భయములు కల్పించకుడు.*
*లేనిపోని ఆచరణా విధానములు గూర్చి గోరంతను కొండంతలుచేసి చెప్పకుడు. స్వామి యొక్క యాత్రలో అనేక కష్టనష్టములు కలవని , లేని భయంకర పరిణామములు కలుగునని , స్వామి మార్గములో అనేక అగాధములు , గోతులూ కలవని వారిని భయపెట్టకుడు. కన్నిస్వాములు ఏమియూ తెలియని అజ్ఞానులని ఈసడించకుడు. “నేను చెప్పినదే వేదము. మీరు వినవలసినదే" అని శాసించకుడు. శ్రీ అయ్యప్పస్వామి వారే గురువు చెప్పినట్లు చేయమని శబరిగిరి యాత్రా విధానములో మున్ముందుగా నుడివినారు. అట్లని మీశిష్యులకు అపమార్గములో మీమాట వినుమని శాసించినచో అది స్వామికే తీరని అపచారము చేసిన వారగుదురు. సహేతుకముగా మీరు శాంతస్వభావులై స్వామి కట్టుబాట్లనూ , యాత్రా విధానమును చెప్పిన మీరు వద్దన్ననూ కొన్ని వేల మంది శిష్యస్వాములు మీ పాదములు చెంత వ్రాలగలరు. దండించి ఎన్ని దినములు దండము పెట్టించుకొన గలరు ? కన్నిస్వామి సాక్షాత్ అయ్యప్పస్వామి ప్రతిరూపము. అట్టి స్వామిపై ఆగ్రహించిన కలిగెడి ఫలితము మీకు చెప్పవలయునా ? ఒక్క కన్ని స్వామిని ఉద్దరించిననూ భగవంతుడు మిమ్మల్ని సాదరమున తన చేతినందించి , తన హృదయములో మీకు చోటిచ్చును.*
ఎన్ని తెలిపిననూ , ఎంత చెప్పిననూ కొందరు గురుస్వాములు , తమను చేరవచ్చిన శిష్యులను ఎన్ని ఇక్కట్లకు గురిచేయుదురో చెప్పజాలను. వారి యొక్క కోపతాపములను శిష్యులు ఎన్నో విధములుగా సహించి సర్దుకుపోవలసియుండును. అట్టి గురు స్వాములు ధనమునకే ప్రాధాన్యత నిచ్చి , అది ఇచ్చిన వారిని మాత్రమే ఆ కీకారారణ్యమున దారి చూపించుచూ తీసికొని వెళ్ళెదరు. లేనివారిని మెల్లగా వదలించుకొనచూతురు. కాని మహానుభావులైన కొందరు ఎట్టి త్యాగము చేయుటకైననూ వెనుకాడక శిష్యస్వాములను కంటికి రెప్పవలె కాచుకొనుచూ , జాగ్రత్తగా యాత్ర చేయించి , తిరిగి ఇండ్లకు తీసికొని వచ్చి వదలుదురు. అట్టి మహాత్ములకు నమస్కారము. ఇక శిష్యులలో కూడా కొందరు గురువులను బాధకు గురిచేయు వారుందురు. వారు గురుస్వామితో దారిమధ్యమున ఏవియో వాదప్రతివాదములు చేసి మనస్పర్ధలతో విడిపోవుదురు. మరికొందరు తాము ఇక్కట్లు పడుటయేగాక , తమతోటి స్వాములను , గురుస్వాము లను కూడా ఇక్కట్ల పాలు చేయుదురు. అట్టివారిని అయ్యప్పస్వామి అసలు సహించడు. తనకు ద్రోహము చేసిననూ స్వామి క్షమించునేమో కాని తన భక్తులకు , గురువులకు ద్రోహము చేసిన వానిని మాత్రము స్వామి సహించడు. కావున , *“గురువును పరీక్షించి స్వీకరించుము. గురువేషమును చూచి భ్రమించకుము గురువును పరిశోధించక స్వీకరించినచో పరితాపము తీరనే తీరదు"*. అని స్వామి బ్రహ్మానందులు చెప్పినట్లు , గురుస్వాములు నడవడికను పరిశోధించి సద్గురువునే గురుస్వామిగా స్వీకరించి తరించుడు.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏