🕉☘🕉☘🕉☘🕉☘🕉☘🕉
*‘‘పిచ్చిదానా! సంతానం మోక్షసాధనకు అవరోధమని గ్రహించే భగవంతుడు మనకా బంధాలను అనుగ్రహించలేదు. భార్యా, పిల్లలు అనే సంసార బంధాలలో కూరుకుపోవడం నాకు ఇష్టం లేదు ! ఈ జన్మకు ఇంతవరకు మనం సాగించిన ఈ గృహస్థాశ్రమం మీద నాకు విరక్తి కలిగిందని చెబుతున్నాను గదా ! ఐహిక సుఖాలు శాశ్వతం కావు ! యవ్వనం క్షణభంగరమైనది! వయస్సు పెరుగుతున్నకొద్దీ మనస్సు నిలకడపొంది ఐహిక సుఖాలవైపు గాక శాశ్వతమైన మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలి ! అందుకే నీవు కూడా నాతో వైరాగ్య మార్గాన్ని అనుసరించు. ఇద్దరం తపస్సుకు తరలి వెళదాం పద !’’* అన్నాడు దత్తుడు శాంత స్వరంతో నచ్చచెబుతూ!
*‘‘ఊహూ ! మీ మాటలు నాకెంత మాత్రం సమ్మతం కావు! నాధా! భార్య కోరిక తీర్చి ఆమెను సంతోషపెట్టాల్సిన బాధ్యత భర్తదన్న విషయం మర్చిపోతున్నారు మీరు. నా తనివితీరి తృప్తి చెందేవరకు నన్ను మీరు సుఖాలలో ఓలలాడించక తప్పదు!’’* అంటూ భర్తను గట్టిగా పెనవేసుకుంది లీలావతి!
దత్తుడు నిర్వికారంగా ఆమెను జరిపి లేచి నిలబడ్డాడు! చిన్నగా నిట్టూర్చి *‘‘భర్త అడుగుజాడలలో నవడం ఉత్తమ సతీ ధర్మమనే విషయాన్ని మరచి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు సుమా! నా నిర్ణయం మారదు. నేను తపస్సుకు తరలి వెళుతున్నాను. నా మార్గానికి అడ్డురాకు’’* అన్నాడు, కోపం, విసుగు కొద్దిగా ధ్వనించాయి ఆ మాటలలో.
*‘‘మిమ్మల్ని నేను వెళ్లనివ్వను. ఇంతకాలం మీ ప్రేమానురాగాలలో పరవశిస్తూ ప్రేమసామ్రాజ్యాన్ని పట్టమహిషిలా పాలిస్తూ వస్తున్నాను. నా ఆనందాన్ని భంగపరిచి మీరెలా వెళతారో అదీ చూస్తాను. ఇలా చూడండి!’’*
భర్తలో కోరిక కలిగించాలన్న ఉద్దేశ్యంతో వక్షోజాలమీది ఆచ్ఛాదన వస్త్రాన్ని తొలగించి గట్టిగా కౌగిలిలలో బిగించబోయింది లీలావతి. ఆ చర్యకు దత్తునిలో అణచివుంచిన కోపావేశాలు పొంగివచ్చాయి!
*‘‘లీలావతి! ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పశువాంఛతో నా మార్గానికి అడ్డుపడుతున్న నీవు ఉత్తమ స్త్రీ జన్మకు తగవు. మరుజన్మలో రాక్షస కులంలో మహిషిగా జన్మించి నీ పశువాంఛను తీర్చుకో’’* అంటూ శపించాడు కఠినంగా చూస్తూ!
లీలావతి కళ్లు ఎరుపెక్కాయి.
*‘‘నాది పశువాంఛనా? నేను మహిషిగా జన్మిస్తానా? అయితే నా మాట కూడా వినండి. మహిషినైనా మిమ్మల్ని విడువను. ఆ జన్మలో కూడా మహిషంగా వచ్చి మీరే నన్ను సంతోషపెడతారు, వెళ్లండి. వెళ్లి తపస్సుతో ఏం సాధించుకుంటారో అదీ చూస్తాను’’* అంటూ విసురుగా ఆశ్రమంలోకి వెళ్లిపోయింది.
*‘‘ప్చ్! పరమేశ్వరా! మీరు రాత్రి స్వప్నంలో ఆదేశించినట్లు తపస్సుకు తరలివెళ్లిపోవాలనుకుంటే లీలావతి ఈ విధంగా ప్రవర్తిస్తుందనుకోలేదు.
ఆమెకు చెప్పి పొరబాటు చేసి వుంటే నన్ను మన్నించండి! ఆమెకు సద్బుద్ధిని అనుగ్రహించండి’’ అని మనస్సులో ప్రార్థించి గబగబా అక్కడినుండి వెళ్లిపోయాడు దత్తుడు!
భర్త వెళ్లిపోవడంతో లోపలనుండి గమనించిన లీలావతి దుఃఖోద్వేగంతో ప్రాణత్యాగం చేసింది.
‘‘ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః
ఓం నమశ్శివాయ! ఓం నమశ్శివాయ!’’ అని పంచాక్షరీ మంత్రాన్ని ధ్యానిస్తూ కైలాసంలో అడుగుపెట్టాడు నారదుడు.
వెండికొండమీద కొలువై వున్న పార్వతీ పరమేశ్వరులకు హారతులిస్తూ ప్రస్తుతిస్తున్నారు ప్రమథగణాలు ఆ సమయంలో.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏