నవగ్రహ పురాణం - 57 వ అధ్యాయం

P Madhav Kumar


*కేతుగ్రహ జననం - 2*



కశ్యప పత్ని దనూదేవి ఆతృతగా ఆశ్రమంలోకి వచ్చింది. ఆమె చేతుల్లో ఒక చిన్నారి శిశువున్నాడు.


*"స్వామీ ! స్వామీ !"* అంటూ భర్తను పిలిచిందామె. 


*"ఏమిటి దనూ !"* అంటూ వచ్చాడు కశ్యపుడు.


*"చూశారా ! చూశారా ! బాలుడు ! ఆశ్రమం వెనక తోటలోని ముళ్ళ పొద నీడలో హాయిగా ఆడుకుంటూ , పరవశంగా ఉన్నాడు !". 


*"ఎవరి బిడ్డదో..."* కశ్యపుడు బాలుడిని చూస్తూ అన్నాడు.


*"నాకు దొరికాడు కాబట్టి నా బిడ్డడే ! చూడండి... ఆ ముఖమూ , ఆ కళ్ళూ... అన్నీ నా బిడ్డలకు లాగానే ఉన్నాయి !"* దనూదేవి ఉత్సాహంగా అంది. *"వీడు నా బిడ్డడే ! ఏమిటలా చూస్తున్నారు ! నా బిడ్డడే ! నేను పెంచుకుంటాను !"*


*"సరే ! ఎవరు కాదన్నారు ! అంతా దేవేచ్ఛ కదా !"* కశ్యపుడు చిరునవ్వుతో అన్నాడు. 


*" పిల్లవాడికి... పేరు ?"* దనూ దేవి ఆవేశంగా అడిగింది. *“చక్కటి పేరు పెట్టండి !”*


*"పేరు...ఏ పేరు పెట్టమంటావు ?"* కశ్యపుడు ఆలోచిస్తూ అన్నాడు. 


*"కేతువు అని సృష్టికర్త బ్రహ్మదేవులు పెట్టేశారుగా !"* లోపలికి వస్తూ అన్నాడు. నారదుడు.


*"నారద మునీంద్రా !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అన్నాడు.


*“నారాయణ ! ఆ విషయం చేరవేయడానికి వచ్చాను. బాలుడికి నామకరణం చేశాక , మీకు అందేలా చూశారు మా జనకులు. మీ బిడ్డగా స్వీకరించి , పోషించి , ప్రయోజకుణ్ణి చేయమన్నారు !"*


*"అలాగా ! మహా భాగ్యం !"* కశ్యపుడు చేతులు జోడించాడు.


*"అందుకేనేమో వీణ్ణి చూడగానే నా బిడ్డడే అనిపించి , స్తన్యం కురిసింది!"* అంటూ లోపలకి వెళ్ళింది దనూదేవి ఉత్సాహంగా.


రోజులు కాలాన్ని ఖండిస్తూ తమ గణన కార్యాన్ని కొనసాగిస్తున్నాయి. దనూదేవి పెంపుడు కొడుకు కేతువూ , సింహిక కుమారుడు రాహువు ఒకరిని వదిలి మరొకరు. ఉండలేనట్లు మసులుతున్నారు.


రాహుకేతువుల సాహచర్యం నేల మీద పాకే వయస్సులోనే మొగ్గ తొడిగింది ! ఇద్దరూ జంటగా పాకడం ప్రారంభించారు. ఇద్దరూ ఒకరిపక్కనొకరు దోగాడసాగారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని తప్పటడుగులు వేశారు.


కశ్యప మహర్షి రాహువు కేతువులకు విద్యాభ్యాసం ఆరంభించారు. విద్యార్జనలో కూడా అంతే ! ఒకరికి చెప్తే చాలు - మరొకరు కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన దనూదేవికి సందేహం కలిగించింది. ఒకనాడు భర్తతో ఇలా అంది.


*"స్వామీ ! కన్నబిడ్డతో సమానంగా కేతువుకి పాలిచ్చి పెంచాను కద ! బాలుడు నా బిడ్డలతో కలిసి మెలిసి ఉండడానికి మారుగా , ఆ సింహిక బిడ్డడితో కలిసిపోయాడెందుకు ?"*

*“వాడి చిన్ని మనసులో ఏముందో , ఎవరికి తెలుసు ! కేతువు ఒక్కడే కాదు సుమా , రాహువుని చూడు ! వాడు కూడా కేతువు నీడలా ఉంటున్నాడు ! ఇద్దరి మధ్యా మనకు అర్ధం కాని అజ్ఞాత సంబంధం ఏదైనా ఉందేమో !”* అన్నాడు కశ్యపుడు.


దనూదేవి సాలోచనగా తల పంకించింది.


*"రాహుకేతువులిద్దరూ అన్యోన్యంగా పెరగాలనీ , రాణించాలనీ బ్రహ్మదేవుల సంకల్పం అయి ఉండవచ్చు. ఎందరో మానస పుత్రులూ , వారి సంతతులూ ఉండగా ఈ కశ్యపుడికే ఆ అవకాశం ఎందుకు వరించింది ? కేతువు మన పోషణలో పెరగాలన్న లక్ష్యం కన్నా , రాహుతో కలిసి మమేకంగా పెరగాలన్న సంకల్పమే అందుకు కారణమనిపిస్తోంది సుమా !"* కశ్యప మహర్షి విశ్లేషించాడు.


*"ఏది ఏమైనా అదంతా నా అదృష్టమే !"* దనూదేవి సగర్వంగా అంది. 


రాహుకేతువులు యువకులయ్యారు. రాహువు సింహిదేవి అనే స్త్రీని , కేతువు చిత్రలేఖనూ పత్నులుగా స్వీకరించారు.


కాలక్రమాన సింహిదేవీ రాహు దంపతులకు 'మేఘహాసుడు' అనే కుమారుడు. జన్మించాడు.


రాహుకేతువుల సహోదరానుబంధం వాళ్ళతో పాటే వృద్ధి చెంది , వికసిస్తూనే ఉంది.


నిర్వికల్పానంద నవగ్రహాల జన్మవృత్తాంతాల కథనం ముగించి ఇలా అన్నాడు. శిష్యులతో.  *"ఇప్పటి దాకా మనం నవగ్రహాల పుట్టుకల గురించి తెలుసుకున్నాం. అయితే , మన నిత్య వ్యవహారంలో , జాతక గణనంలో పేర్కొంటున్న 'సూర్య , చంద్ర , కుజ , బుధ , గురు , శుక్ర , శని , రాహు , కేతు' అనే క్రమంలో కాకుండా వాళ్ళ ఆవిర్భావ క్రమంలో శ్రవణం చేశాం*


*"నవగ్రహాల ఆవిర్భావాలలో లాగే , వాళ్ళ చరిత్రలలో కూడా ఆసక్తిని రేకెత్తించే అద్భుత సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ సంఘటనల సమాహారంగా , ఆ గ్రహదేవతల చరిత్రలను సూర్యుడి నుండి కేతువు దాకా , మనం స్మరించే వరస క్రమంలో శ్రవణం చేద్దాం.”*


*"ముందుగా సూర్య గ్రహ చరిత్ర ఒక్క సారి గుర్తుచేసుకుంటే , శివానందా ! సూర్యుడి తల్లిదండ్రులు ఎవరో గుర్తున్నారా ?”* అంటూ అడిగాడు చిరునవ్వుతో నిర్వికల్పానంద.


*"అదితీ , కశ్యపులు గురువుగారూ !"* శివానందుడు సమాధానం చెప్పాడు.


*"చిదానందా , నువ్వు చెప్పు , సూర్యపత్ని ఎవరు ?”* నిర్నికల్పానంద అడిగాడు.


*"విశ్మకర్మ పుత్రిక - సంజ్ఞ గురువుగారూ..."* చిదానందుడు అన్నాడు. *''సంజ్ఞ తన నీడను 'ఛాయ' అనే పేరుతో తన స్థానంలో సూర్యుడి భార్యగా నియమించింది !"* 


*"బాగుంది !"* నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. *“ఇప్పుడు సంజ్ఞ బిడ్డలు ఎవరో , ఛాయ బిడ్డలు ఎవరో మన శివానందుడూ , విమలనందుడూ చెప్తారు !”*


*"వైవస్వతుడు , యముడు , యమి - సంజ్ఞ సంతానం , గురువుగారూ !"* శివానందుడు గుర్తు చేసుకుంటూ అన్నాడు.


*"ఛాయ సంతతి శనైశ్చరుడు , సావర్ణి , తపతి !"* విమలానందుడు చెప్పాడు.


*"గుర్తుంచుకున్నారు. సంతోషం !”* నిర్వికల్పానంద అన్నాడు. సంజ్ఞకూ , ఛాయకూ జన్మించిన సూర్యుని సంతానం ఆరుగురూ ఛాయ పోషణలో పెరుగుతున్నారనీ , సంజ్ఞ బిడ్డల పట్ల ఛాయ ప్రేమ తగ్గుముఖం పట్టిందనీ చెప్పుకున్నాం కదా ! ఇక వినండి ! ఒక రోజు ఏమైందంటే...




_*ఇప్పటి వరకు నవగ్రహల జననం గురించి చదువుకున్నాము  రేపటి నుండి  నవగ్రహల చరిత్ర ప్రారంభం*_

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat