*శుక్రగ్రహ చరిత్ర - 1*
*"ఈ ఉశనుడు నీ గురుదేవుడుగా ఉన్నంతకాలం నువ్వు నిరాశను దరిజేర నివ్వరాదు , వృషపర్వా !"* ఉశనుడు ధైర్యం చెప్తూ గర్వంగా అన్నాడు. *“అసంభవాన్ని సంభవం చేయడంలోనూ , అపజయాన్ని జయంగా మార్చడంలోనూ ఈ పౌలోమీ భార్గవుడు అద్వితీయుడు !"*
*"మీ శక్తియుక్తుల మీద నాకు సందేహం లేదు , గురుదేవా ! నా సందేహం , సంతాపం అన్నీ నా శక్తి మీదనే !"* వృషపర్వుడు బరువుగా నిట్టూర్చాడు.
*"వృషపర్వ !"*
*"మీరే ఆలోచించండి ! మా దాయాదులు , దేవతలు సంపద పరంగా ఎలా ఉన్నారు ? మేం ఎలా ఉన్నాం ? సాక్షాత్తు ధనాధిపతి కుబేరుడే ఆ ఇంద్రుడికి కోశాధికారిగా ఊడిగం చేస్తున్నాడే !"* వృషపర్వుడు అక్కసుతో అన్నాడు.
*"ఊ ! నీ నిర్వేదానికి కారణం ఆ దేవతల ఐశ్వర్యమన్నమాట ! ఆ లోటు లోటే ! కానీ పూడ్చలేని లోటు కాదు ,"* ఉశనుడు చిరునవ్వుతో అన్నాడు.
*"మీ విశ్వాసం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ కొరతను ఎలా తీర్చుకోగలం , గురుదేవా ? మనం ఆ దేవతలను జయించి , వాళ్ళ సర్వస్వాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి మాట అది !”* వృషపర్వుడి కంఠంలో నిరాశ ఇంకా కాపురం చేస్తూనే ఉంది.
*"వృషపర్వా ! నాకొక విషయం చెప్పు. ఆ ఇంద్రుడి సంపద గొప్పదా ? కుబేరుడి ఐశ్వర్యం గొప్పదా ?"* ఉశనుడు సూటిగా చూస్తూ ప్రశ్నించాడు.
*"కుబేరుడి ఐశ్వర్యమే గొప్ప ! విశ్వంలోని సకల సంపదలకూ అధిపతి కదా , అతడు !"* వృషపర్వుడు సమాధానం చెప్పాడు.
*“ఆ కుబేరుడి ఆధీనంలో ఉన్న సకల ఐశ్వర్యాన్నీ నీ కోశాగారంలో కుప్పపోస్తే - నువ్వూ , ఆ ఇంద్రుడు - మీ ఇద్దరిలో అధికాధిక ధనికుడు ఎవరవుతారు ? నువ్వా ? ఇంద్రుడా ?"* ఉశనుడు చిరునవ్వు నవ్వాడు.
*“గురుదేవా !”* వృషపర్వుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. *“నువ్వే , వృషపర్వా ! నువ్వే !”* ఉశనుడు నవ్వుతూ అన్నాడు.
సభలో వున్న రాక్షస ప్రముఖులందరూ తమ తమ ఆసనాల్లోంచి లేచి , ఉశనుడిని సమీపించి , చెవులు రిక్కించారు..
*"కుబేరుడితో యుద్ధమా గురుదేవా ? అది దేవతలతో యుద్ధంగానే పరిణమిస్తుంది. కద !"* వృషపర్వుడు సందేహం వ్యక్తం చేశాడు.
ఉశనుడు చిన్నగా నవ్వాడు. *"సమరం సర్వవేళలా సాధనం కాదు , రాక్షసేంద్రా !* నిశితమైన ఖడ్గాన్ని నీడలోకి నెట్టివేసే సునిశితమైన మేధ ఉందిగా !"*
*"అంటే... గురుదేవా ?"* వృషపర్వుడు కనుబొమలు ముడివేశాడు. *"ఈ ఉశనుడి యోగశక్తి , నీ ధనయోగాన్ని విస్తృతం చేస్తుంది , సుమా !”* ఉశనుడు గర్వంగా అన్నాడు.
తన ముఖంలోకి ఉత్కంఠతో , ఆశతో చూస్తున్న రాక్షస ప్రముఖులందర్నీ ఉశనుడు ఒక్కసారి కలయజూశాడు. ఆయన ముఖం గర్వంతో కూడిన చిరునవ్వుతో వికసించింది.
*"యోగశక్తి , వృషపర్వా ! ఉశనుడి అమోఘ యోగశక్తి ! ఆ మహాశక్తి ద్వారా ఆ కుబేరుడి అంతరంగాన్ని ప్రభావితం చేస్తాను. దాని ఫలితమేమిటో తెలుసా ? ఆకారం కుబేరుడు , అంతరంగం ఉశనుడు !"* ఉశనుడు వివరించాడు.
*"గురుదేవులు గూఢయోగం అద్భుతం !"* వృషపర్వుడు ఉత్సాహంగా అన్నాడు.
సభలోని రాక్షస కంఠాలు ఏకకంఠంతో అరిచాయి - *"అద్భుతం , అద్భుతం !"* అంటూ.
****************************
ఉశనుడు కుబేరుడి నగరం 'అలకాపురి' చేరుకున్నాడు. ఆయనను స్వాగతించి , ఆతిథ్యం అందించాడు కుబేరుడు.
*"నేను రాక్షసుల గురువునే , అయినా మనందరం ఆ సృష్టికర్త బ్రహ్మ నుండి వచ్చిన వాళ్ళమే , కుబేరా ! నీ పితామహులు పులస్త్యుడు బ్రహ్మ మానసపుత్రుడు ! మా తండ్రిగారు. భృగు మహర్షి కూడా బ్రహ్మ మానస పుత్రుడే !"* ఉశనుడు దేవ , రాక్షస భేదభావాన్ని దూరం చేశాడు.
*"ఓనౌను...మనం , మనం బంధువులమే , ఆచార్యా !"* కుబేరుడు నవ్వుతూ అన్నాడు.
*"కార్యార్థం దయచేశారా , ఇక్కడికి ?"*
*“ఒక మహా లక్ష్యం నన్ను అలకాపురికి తీసుకు వచ్చింది. మన మధ్య భేదం లేదనీ , ఈ ఉశనుడూ , ఈ కుబేరుడూ ఒక్కరే అనీ నీకు తెలియజేయడమే ఆ లక్ష్యం !"*
కుబేరుడు కళ్ళు చిట్లించాడు. *"అర్థం కాలేదు , ఆచార్యా..."*
*"ఏముందీ ? ఉశనుడే కుబేరుడు ! కుబేరుడే ఉశనుడు !"* ఒక్కసారి కళ్ళు సగం మూసి , యోగశక్తిని ఆవాహనం చేస్తూ అన్నాడు ఉశనుడు.
కుబేరుడు మంత్ర ముగ్ధుడిలా చూస్తున్నాడు. విశాల నేత్రాలూ మాయా దర్పణాల్లా కుబేరుడి కళ్ళను ఆకర్షిస్తున్నాయి. దృష్టి కిరణాల ద్వారా ఉశనుడి యోగ ప్రభావం కుబేరుడిలోకి ప్రవేశిస్తోంది.
అప్పటి దాకా ముడుచుకున్నట్టున్న కుబేరుడి ముఖం ఉన్నట్టుండి విప్పారింది. చిరునవ్వు అతని ముఖాన్ని వెలుగుతో నింపింది.
*"ఈ ఐక్యతానుభూతి ఆహ్లాదకరంగా ఉంది , ఆచార్యా ! మీరన్నది నిజమే - మీరే నేను !"* కుబేరుడు నవ్వుతూ అన్నాడు.
*"ఔను , కుబేరా ! నేనే నువ్వు !"* ఉశనుడు నవ్వుతూ అన్నాడు.
*"ఆచార్యా ! నాదో చిన్న కోరిక...”* కుబేరుడు మంత్ర ముగ్ధుడిలా అరమూసిన కళ్ళతో అన్నాడు.
*"ఎంత పెద్ద కోరిక అయినా , తీరుస్తాను !"* ఉశనుడు ఉత్సాహంగా అన్నాడు.
అతనికి తెలుసు...తన వ్యక్తిత్వం , తన ఆలోచనలూ కుబేరుడిలో ప్రవేశించి , తిష్ఠ వేశాయి ! కుబేరుడు ఇప్పుడు - లోపల ఉశనుడు , వెలుపల కుబేరుడు !
*"చిన్న కోరికే ఆచార్యా ! మీరు నా సకల సంపదలనూ , సువర్ణాన్నీ , నా నవరత్నాలనూ , బ్రహ్మ నాకు ప్రసాదించిన శంఖ నిధులూ , పద్మ నిధులూ - సర్వాన్నీ , కోశాగారాలలో ఉన్న ఈ ధనాధిపుని సంపూర్ణ ఐశ్వర్యాన్నీ కానుకగా స్వీకరించాలి !"* కుబేరుడు ఆవేశంగా అన్నాడు.
*"నీ కోరికను ఎలా కాదంటాను , కుబేరా ! తథాస్తు !"* అంటూ ఉశనుడు కుడి చేతిని చాచి , కుబేరుడి ముందు నిలిపి , ఎడమ చేతిలోని తన కమండలాన్ని అతనికి అందించాడు , సాభిప్రాయంగా.
కుబేరుడు మంత్రముగ్ధుడిలా తన కోశాగారాలలోని సకల సంపదలనూ ధారబోస్తూ , కమండలంలోని జలాన్ని తన అరచేతి మీదుగా , ఉశనుడి హస్తంలోకి జారవిడిచాడు.
ఉశనుడు నవ్వుతూ పైకి లేచాడు. *"అదృష్టవంతుడివి , కుబేరా ! అనుకున్నది ఆచరించావు ! ఇక నేను వెళ్తాను !”.*
*“ధనరాసులూ , రత్నరాసులూ... ఆచార్యా ! అప్పుడే మరిచి పోయారా ?"* కుబేరుడు చిరునవ్వుతో గుర్తు చేశాడు , ఉశనుడి అమాయకత్వానికి జాలిపడుతున్నట్టు.
*"నువ్వు ధారబోసిన క్షణంలోనే అవన్నీ , ఊడ్చి పెట్టుకుని నా స్థావరం చేరుకున్నాయి , కుబేరా ! వస్తాను !"* అంటూ ఉశనుడు కుబేర మందిరంలోంచి నిష్క్రమించాడు.