*🌻. కాలజ్ఞాన రచనకు అనువైన ప్రదేశాన్ని ఎన్నుకొనుట 🌻*
బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి. ఆయన ఒకవైపు కొండగుహలో కూర్చుని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు. మరోవైపు పశువుల కాపరిగా తన బాధ్యతను నిర్వర్తించేవారు.
తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయల్దేరిన వీరబ్రహ్మేంద్రస్వామి బనగానపల్లెకు చేరారు. ఆరోజు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయారు.
రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు. నిద్రా సమయం ఆసన్నం కావడంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటిముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు.
మరుసటిరోజు పొద్దున్నే అచ్చమ్మగారు, తన ఇంటి అరుగుమీద పడుకున్న వీరబ్రహ్మేంద్రస్వామిని చూశారు. ఈ సన్యాసి ఎవరో అని కుతూహలం కలిగి, ఆయనను వివరాలు అడిగారు.
తాను బతుకుతెరువు కోసం వచ్చానని, ఏదో ఒక పని చేయదలచానని చెప్పగా, తన దగ్గర ఉన్న గోవులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ.
అలా గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆవులను తీసుకుని దగ్గరలో ఉన్న రవ్వలకొండ దగ్గరకు వెళ్ళాడు.
ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఆయనను ఎంతో ఆకర్షించింది. ఆ ప్రదేశాన్ని కాలజ్ఞానం రాసి, అందరికీ తెలియజెప్పేందుకు తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు. ఒక గుహను తనకు ఆవాసయోగ్యంగా చేసుకున్నారు.
ప్రతిరోజూ గోవులను తీసుకుని వచ్చి, వాటిని పొలంలో వదిలిపెట్టి మనసును కేంద్రీకరించి ధ్యానంలో మునిగిపోయేవారు. ఆ ధ్యానం వల్ల ఆయనకు రకరకాల అనుభవాలు కలిగేవి. వాటన్నిటికీ అక్షరరూపం కల్పించేవారు.
కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ ఉన్న ఒక తాటిచెట్టు ఆకులను కోసుకుని, కొండ గుహలో రాయడం మొదలుపెట్టాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః