*ప్ర: దేవీ భాగవతంలో బ్రహ్మకూతురు సరస్వతి అని, ఆమెనే వివాహం చేసుకున్నాడని ఒక చోట, ఆ దేవియే బ్రహ్మకు ఒక శక్తిని (సరస్వతిని) ఇస్తే వివాహమాడాడని మరొకచోట చెప్తున్నాయి. దీనిలో ఏది నిజం?*
*జ :* రెండూ సబబైనవే. దేవతల బాంధవ్యాలకు 'కూతురు-కొడుకు-భార్య' అనే మానవీయ బాంధవ్యాల అర్థాలుండవు. వారి దేహాలు వేరు. మన దేహాలు వేరు. వారు తేజోమయ శరీరులు. పరమాత్మ యొక్క శక్తికి సాకారాలు. వారి బాంధవ్యాలు ఒక తత్త్వాన్ని
తెలియజేయడానికి వాడబడే పదాలు. బ్రహ్మదేవుని తపస్సు ఫలంగా ఆయనలో ఉద్భవించిన శక్తి పరాశక్తి అనుగ్రహంగా ఆవిర్భవించింది. ఆ ఉద్భవశక్తే ఆయనకు సృష్టి రచనా నైపుణ్యంలో సహకరించింది. ఉద్భవించినప్పుడు ఆ శక్తిని కూతురుగా వ్యవహరించి, సహకరించినప్పుడు భార్యగా వ్యవహరించారు. ఇది శక్తి యొక్క వివిధ స్థాయిల వ్యవహారమే గానీ ఇది బాంధవ్యం కాదు.