వాగ్దేవి సరస్వతీదేవిని సకలకళావల్లి అని సకలకళా మయూరి అని కూడా కీర్తిస్తారు. సరస్వతీదేవి మయూర రూపంలో దర్శనమిస్తున్న పుణ్య స్ధలాలలో ప్రసిద్ధి చెందినది మైలాపూర్ కారణీశ్వరుని ఆలయం. మయూరం నీల వర్ణంలో వేయి కన్నులు కలిగి వున్నందున
ఇంద్రనీల పక్షిగా పిలువబడుతున్నది.
ఇంద్రుని భార్య శచీదేవి కూడా యీ ఆలయంలో పూజలు చేసి శివుని కటాక్షం పొందింది.
అందువలన ఇక్కడి ఈశ్వరుడు ఇంద్రేశ్వరునిగా, శశివల్లీశ్వరునిగా దర్శనానుగ్రహం కలిగిస్తున్నాడు.
ఒకసారి కైలాస పర్వతం మీది చిత్రవనంలో పరమేశ్వరుడు పార్వతీ దేవికి వేదాల ధర్మసూక్ష్మాలను బోధిస్తున్నాడు. కానీ పార్వతి మనసు శివుని బోధనలపై లగ్నం కాలేదు. అక్కడ తిరుగుతున్న ఒక
మయూరం పై దృష్టి మరలింది. అందంగా ఉన్న ఆ నెమలినే చూస్తూ వుండిపోయింది. అది చూసిన పరమశివునికి ఆగ్రహం కలిగింది. వెంటనే పార్వతీదేవిని మయూరమై భూలోకంలో సంచరించమని శపించాడు.
పార్వతి శాపవిమోచనం కోరుతూ శివుని ప్రార్ధించినది. భూలోకంలోని
పున్నాగ వనంలో తనని ధ్యానిస్తూ తపస్సు చేయమని, తగిన సమయంలో ప్రత్యక్షమై అనుగ్రహం ప్రసాదిస్తానని అభయమిచ్చాడు పరమేశ్వరుడు.
శివుని ఆజ్ఞ మేరకు పార్వతీ దేవి మయూర రూపంతో భూలోకానికి వచ్చి సముద్రతీరాన వున్న పున్నాగ వనంలో వెలసియున్న స్వయంభూలింగాన్ని అర్చించసాగింది.
మయూర రూపంలో ఉన్న పార్వతీ దేవికి సహాయంగా లక్ష్మీ ,సరస్వతి,ఇంద్రాణి
కూడా మయూర రూపాలు దాల్చి తోడు నీడగా నిలిచారు.
మయూరాలు తపమాచరించిన స్థలమైనందున ఆ ప్రాంతానికి మయిలై అని పేరు వచ్చింది. అదే క్రమంగా మైలాపూర్ గా మారింది. పార్వతీదేవి పూజించిన పరమేశ్వరుని ఆలయం కపాలేశ్వరస్వామి ఆలయం. సరస్వతీదేవి ,ఇంద్రాణి పూజించిన శివలింగం కారణీశ్వరుడని ప్రసిధ్ధి చెందినది.
పార్వతీ దేవికి తోడుగా వచ్చిన సరస్వతీ దేవి స్వర్ణ శ్వేత మయూర రూపం ధరించినది.
ఆ దేవి పున్నాగ వనం మధ్యగా నందివర్ధన చెట్టు క్రింద శివలింగాన్ని చూసింది. ఆ శివలింగం ఆదిలో అగస్త్య మహర్షి, అష్టరుద్రులలో ఒకడైన మహాదేవునిచే
అర్చించబడిన మహిమాన్విత శివలింగం. సరస్వతికి ఆ శివలింగాన్ని చూడగానే బ్రహ్మానందం కలిగింది.
ఆ వనంలో గల నంది వర్ధన పువ్వులు కోసి తెచ్చి పూజించినది . ఫింఛము విప్పి నాట్యము చేసినది మధురమైన గీతాలు పాడి వినిపించినది. విశిష్టమైన పూజలు చేసి ఆరాధించినది. ఇంద్రాణి కూడా బంగారువర్ణ మయూర రూపంతో వచ్చి కలసి పూజించినది. రుద్రులు ఏర్పరచిన పుష్కరిణిలో స్నానాలు ముగించి సముద్రగర్భంలో నుండి ఉదయిస్తున్న
సూర్యభగవానుని స్తుతించి జటాఝూటధరియైన చంద్రశేఖరుని భక్తి శ్రధ్ధలతో అర్చించారు.
పిదప ఉమాదేవితో కలసి శివలింగాని పూజించారు. వారి పూజలకి మెచ్చిన పరమేశ్వరుడు దర్శన మిచ్చాడు.
ఉమాదేవికి ఎవరి తోడు అవసరం లేకపోయినా ఆమెతో కలసి మీరు కూడా తపస్సు చేసిన కారణంగా వరాలు అనుగ్రహిస్తున్నాను కోరుకోమన్నాడు పరమేశ్వరుడు.
అప్పుడు సరస్వతీ దేవీ,
" మహేశా ..తమరీ లింగంలో
స్ధిరనివాసమై మిమ్మల్ని కొలిచేవారికి సమస్త కళలయందు విజయం కలిగేలా వరమివ్వండి." అని కోరుకున్నది.
" లోక కళ్యాణానికై నీ వడిగిన వరం ప్రసాదిస్తున్నాను. నీ అనుగ్రహం పొందిన భక్తులందరికి సర్వ విద్యలలో సంపూర్ణ విజయం లభిస్తుంది" అని వరమిచ్చిన మరుక్షణమే సరస్వతీ దేవికి మయూర రూపం తొలగి శ్వేతాంబరాలు ధరించి, కంఠాన తెల్లని ముత్యాలదండలతో నిజరూపం దాల్చింది.
సరస్వతి పార్వతీ దేవి తో కలసి కారణీశ్వరుని పూజించిన స్ధలంలో నూతనంగా విద్యాభ్యాసం ఆరంభిస్తే భవిష్యత్ లో ఉన్నతవిద్యలలో ఆరితేరినవారవుతారు.
బుధవారం నాడు నవమి తిధి రోజున ఇక్కడ పూజలు చేస్తే , విద్యాపరంగా కలిగిన విఘ్నాలు తొలగి విజయం సిధ్ధిస్తుంది.
చెన్నై మైలాపూర్ కపాలేశ్వరుని ఆలయానికి ఒక అర కిలోమీటర్ దూరంలో బజార్ వీధిలో
కారణీశ్వరుని ఆలయం వున్నది.