శ్రీ శ్రీనివాస గోవింద నామాల శతకం

P Madhav Kumar

'శేష శైల వాస శ్రీనివాస' మకుటంతో ఒక్కొక్క

గోవింద నామంతో ఒక్కొక్క పద్యపుష్పం...!!


1.శ్రీ శ్రీనివాసా గోవిందా!


శ్రీనివాసుడన్న శ్రీకరం బగునీకు

శ్రీనివాసుడన్న చింత దీరు

శ్రీనివాసుడన్న సిరులనిచ్చేవేల్పు

శేషశైలవాసశ్రీనివాస!!!


2.శ్రీ వేంకటేశా గోవిందా


వేంకటేశుడన్న సంకటమ్ములె బాపు

వెంకటేశుడన్న వెతలు దీర్చు

వెంకటేశుడేమొ వేయి జన్మల ప్రాపు

శేషశైలవాసశ్రీనివాస!!!


3.భక్తవత్సలా గోవిందా!


భక్తవత్సలుండు భగవంతుడాతడు

ముక్తి నొసగు వాడు మూలమతడె

శక్తి యుక్తి రూపి జగదేకవల్లభుడు

శేషశైలవాసశ్రీనివాస!!!


4.భాగవతప్రియగోవిందా!


భక్త సులభుడైన భాగవత ప్రియుండు

నిత్యనిర్గుణుండు నిత్యుడితడు

వేద విదుడె గాదు వేదాంత వేద్యుండు

శేష శైల వాస శ్రీనివాస!!!


5.నిత్య నిర్మలా గోవిందా!


నిత్య నిర్మలుండు నీరజ నాభుండు

సత్య మెరిగి చూడ చెంత నుండు

సంతతమ్ము తోడ సతతమ్ము నిను గాచు

శేష శైల వాస శ్రీనివాస!!!


6.నీల మేఘ శ్యామా గోవిందా!


నీల మేఘ శ్యామ నీవె నా తోడుండ

భవ జలధిని దాట భయమదేల

జాల మేల రావ జాలితో రక్షింప

శేష శైల వాస శ్రీనివాస!!!


7.పురాణ పురుషా గోవిందా!


పుష్కరాక్షు డితడు పుణ్య శ్లోకు డితడు

పుష్కరుడు పురాణ పూరుషుండు

దుర్నిరీక్షుడితడు దుష్కర్మ వారణుడు

శేష శైల వాస శ్రీనివాస!!!


8.పుండరీ కాక్ష గోవిందా!


అండదండ నీకు పుండరీకాక్షుండు

ఆహవమున భవ్య ప్రాభవమున

కొండలందు తానె కొలువయ్యి వున్నాడు

శేష శైల వాస శ్రీనివాస!!!


9.గోవిందా హరి గోవిందా!


ఆదుకొమ్మన్నంత చేదుకొమ్మనినంత

వెతల నన్ని దీర్చు వేద మూర్తి

గోకులమ్ము జేర్చు గోవింద హరినీవు

శేషశైలవాసశ్రీనివాస!!!


10.గోకులనందన గోవిందా!


కోరికలనుదీర్చ గోకులనందను

వేడుకొనగనెంత వేడుకగును

తల్లిదండ్రిసఖుడు తానెయై యుండగా

శేషశైలవాస శ్రీనివాస!!!


11.నంద నందనా గోవిందా!


నందనందనుండు నంద గోకులమందు

చిందు లేసి నట్టి చిన్మ యుండు

ఆల మంద కతడు ఆనంద రూపుడు

శేష శైల వాస శ్రీనివాస!!!


12.నవనీత చోరా గోవిందా!


నవ్య దివ్య భవ్య నవనీత చోరుండు

సవ్యమైన దృష్టిఁజూడ ఘనుడు

నీదు అఘము బాప నీలోనె వున్నాడు

శేష శైల వాస శ్రీనివాస!!!


13.పశు పాలక శ్రీ గోవిందా!


విశ్వ మంత నిండి విశ్వేశుడైనావు

విశ్వ చాలకుడవు విశ్వ మూర్తి

పశుప్రవృత్తిఁబాపు పశు పాల కుండవు

శేష శైల వాస శ్రీని వాస!!!


14.పాప విమోచన గోవిందా!


పాతకముల బాపు పాప విమోచన

పాపలమ్ము మేము ప్రాపు జూపు

పాదపద్మ యుగము ప్రార్ధింతు మహరము

శేష శైల వాస శ్రీని వాస!!!


15.దుష్ట సంహార గోవిందా!


దుష్ట జనుల పాలి దుష్ట సంహారుండు

శిష్ణ జనుల పాలి శ్రీకరుండు

యిష్ట జనులఁగష్ట నష్టములఁగాపాడు

శేష శైల వాస శ్రీనివాస!!!


16.దురిత నివారణ గోవింద


దుర్నిమిత్తదూర!దురిత నివారణ!

దుర్మదాంధ ధ్వాంత హర!మురారే!

పన్నగాధిప శయన!పాలింప రావదే!

శేష శైల వాస శ్రీనివాస!!!


17.శిష్ట పరి పాలక గోవిందా!


కష్ట నిష్టురముల కలతఁజెందెను మనము

నిష్ఠ తోడ పూజ నెట్లు సేతు

యిష్ట దైవ మీవె శిష్ట శ్రీ పరి పాల

శేష శైల వాస శ్రీని వాస!!!


18.కష్ట నివారణ గోవిందా!


కామితార్ధ దాత!కష్ట నివారణా

కానగలమ నీదు కరుణ మహిమ

కాచుకొందువయ్య కనురెప్పచాటున

శేష శైల వాస శ్రీనివాస!!!


19.వజ్ర మకుట ధర గోవిందా!


వజ్ర మకుట ధారి!వన మాలి!గిరిధారి!

సుప్ర జనుల గాచు చక్రధారి

ముక్తి నిడుము రారి!బృందావన విహారి!

శేష శైల వాస శ్రీనివాస!!!


20.వరాహ మూర్తివి గోవిందా!


ఆశ్రయమును గోర నా శ్రీనివాసుండు

ఆదరించె నావరాహ మూర్తి

అడుగు వాడ వీవె నిడు వాడవునునీవె

శేషశైలవాస శ్రీనివాస!!


21.గోపీ జన లోల గోవిందా!


మోహ రూపు జూచి మోహించ మునులెల్ల

వరదు డిచ్చి నట్టి వర ఫలాన

గోపకాంతలైరి గోపీ సుజనలోల

శేష శైల వాస శ్రీనివాస!!!


22.గోవర్ధనోధ్ధార గోవిందా!


గోకులమ్ములోన కురిసేను జడివాన

గోప బాలకులకు గుండెలదర

గో జనమ్ముఁగాచె గోవర్ధనోధ్ధారి

శేష శైల వాస శ్రీనివాస!!!


23.దశరధనందన గోవిందా!


దశవు దిశవు నీవె దశరథ నందనా

శరథిఁగట్టి నట్టి శౌర్య మూర్తి

శరణు శరణు శరణు సాకేత పుర వాస

శేష శైల వాస శ్రీనివాస!!!


24.దశముఖ మర్దన గోవిందా!


దయను జూపు రామ!దశముఖమర్దనా!

దయను జూపి యిమ్మ దరిశెనంబు

దరిశనంబుఁజేయ తరియించుమాజన్మ

శేష శైల వాస శ్రీనివాస!!!


25.పక్షి వాహనా గోవిందా!


పక్షపాత మండ్రు పక్షి వాహన నీకు

కువలయమ్మె నీదు కుక్షి నుండ

రక్షణంబు నీవె రాజీవ లోచన

శేష శైల వాస శ్రీనివాస!!!


26.పాండవ ప్రియనేగోవిందా!


అండదండ నీవు పాండవ ప్రియ మాకు

భండనమున దుష్ట ఖండనమున

ధర్మ స్ధాపనమ్మె ధర్మమ్ముకద నీకు

శేష శైల వాస శ్రీని వాస!!!


27.మత్స్య,కూర్మా గోవిందా!


మత్స్య కూర్మ రూప మాత్సర్య మడగించు

సత్యధర్మ తేజ సన్నుతింతు

సకల జీవులందు సమదృష్టి కలిగించు

శేష శైల వాస శ్రీని వాస!!


28.మధుసూదన హరి గోవిందా!


మధురమృదులభాషి ,మధురానగర వాసి

మధుర వేణు నాద మధుర ఫణితి

మధుర మధుర మూర్తి మధుసూదనా!హరీ!

శేష శైల వాస శ్రీనివాస!!!


29.వరాహ నరసింహ గోవిందా!


అన్నదమ్ములైన కనకాక్ష,కశిపులను

మట్టు బెట్ట నెంచి మహిత రూప

వరలినావు వరహ నరసింహ రూపాల

శేష శైల వాస శ్రీని వాస!!!


30.వామన భృగు రామ గోవిందా!


వందనమ్ములయ్య వామన భృగురామ

సన్నుతింతునయ్య సాధుపోష

బడల జేసితయ్య బలి కార్తవీర్యులను

శేష శైల వాస శ్రీనివాస!!!


31.బలరామానుజ గోవిందా!


అబలలమ్మగుటనుసుబలరామానుజ

ఆదరించి యిమ్ము ఆశ్రయమ్ము

ఆర్తజనుల రక్ష అది నీకు ధృఢ దీక్ష

శేష శైల వాస శ్రీనివాస!!


32.బౌద్ధకల్కిధర గోవిందా!


బౌద్ధ కల్కి ధరుడ!బుద్ధి సిద్ధిప్రదాత

దుష్ట జన విదార దురిత హార

కరుణ రూప మొకటి,క్షాత్రతేజమొకటి

శేష శైల వాస శ్రీనివాస!!


33.వేణు గాన ప్రియ గోవిందా!


వేడు కొందు నిన్ను వేణుగానప్రియా!

వేడుకొందు నిన్ను వెన్నదొంగ!

వేడుకొందు నిన్ను వేంకటాద్రీశుడా!

శేష శైల వాస శ్రీనివాస!!


34.వేంకటరమణా గోవిందా!


వేంకటరమణాయ !వేదండ రక్షకా!

వేద రక్ష నీవె వేద వేద్య

వేదనలను దీర్చు వేంకటాచలవాస!

శేష శైల వాస శ్రీనివాస!!


35.సీతా నాయక గోవిందా!


సిరుల నిచ్చుఱేడ!సీతాధినాయక!

వరములిమ్మునేడె ,వారిజాక్ష!

శరణమంటిమయ్య శబరినేలినరామ

శేష శైల వాస శ్రీని వాస!!


36.శ్రిత పరి పాలక గోవిందా!


నుతులు జేతు మయ్య శ్రితజనపరిపాల

వంత దీర్చి నీదు చెంతఁజేర్చు

వెతలు బాపి బ్రోవు వేంకటేశుడవీవు

శేష శైల వాస శ్రీనివాస!!


37.దరిద్ర జన పోషక గోవిందా!


భవదరిద్రమందు బడలియుంటిమిమేము

చేవ లేని మాకు త్రోవఁజూపు

భద్ర శైల వర!దరిద్ర జన పోషక

శేష శైల వాస శ్రీని వాస!!


38.ధర్మ సంస్ధాపక గోవిందా!


ధర్మ శీల ధామ!ధర్మ సంస్ధాపక!

కర్మ ఫలము తీరు మర్మ మేది?

దుర్మదాంధులమ్ముదురితమ్ములనుబాపు

శేష శైల వాస శ్రీనివాస!!


39.అనాధ రక్షక గోవిందా!


ఆర్తత్రాణుడవుఅనాధ రక్షకుడవు

ఆర్తజనులమమ్మునాదుకొనవె

అగణితగుణధామ అండ నీవేమాకు

శేష శైల వాస శ్రీనివాస!!


40.ఆపద్బాంధవ గోవిందా!


ఆపదోద్ధరణుడునాపన్నబాంధవుం

డాది పూరు షుండు నాత్మతేజు

డగ్ని రూపు డతడె యన్ని భూతములందు

శేషశైలవాస శ్రీనివాస!!


41.శరణాగతవత్సల గోవిందా!


నా గతెన్నగ శరణాగతవత్సల

నీవె గాక నన్య మేది లేదు

ఏడుగడవె నీవు ఏ తీరు బ్రోతువో

శేష శైల వాస శ్రీనివాస!


42.కరుణా సాగర గోవిందా!


కరుణ తోడ నేలు కరుణార్ద్రసాగరా

వరలినావు గిరిని వైభవముగ

శరణ మన్న వారిఁదరిఁజేర్చు దైవమా

శేష శైల వాస శ్రీనివాస!


43.కమలదళాక్ష గోవిందా!


కమలనిలయ రమణ కమలదళాక్షుడా

కనుల నీవె కన్న కలల నీవె

మన్ను మిన్ను నీవె యన్ని తావుల నీవె

శేష శైల వాస శ్రీనివాస!!


44.కామితఫలదా గోవిందా!


కామితమ్ము నీవె కామిత ఫలదాయ

చేరి మమ్ము దరిని జేర్చు దివ్వె

కారు చీకటి యందు కూరు కొని పోయేము

శేష శైల వాస శ్రీనివాస!!


45.పాపవినాశక గోవిందా!


శాపగ్రస్తు లమ్ము పాపవినాశకా

తాప సంద్ర తరణ దారిఁజూపు

కోరి దృంచు మయ్య క్రోధమ్ములోభమ్ము

శేషశైల వాస శ్రీనివాస!!


46.పాహి మురారే గోవిందా!


పావనమ్మయెనుగ పాహి పాహి మురారి

పాద మంట నీదు ప్రాపునంద

పాపపంకిలమున పాడైన జన్మమ్ము

శేష శైల వాస శ్రీని వాస!!


47.శ్రీ ముద్రాంకిత గోవిందా!


శ్రీముద్రాంకితుడవు శ్రీ భద్ర మూర్తివి

అభయ ముద్ర తోడఁనాదరించు

కలికలుషతరణము కటి లోతె మాకని

శేష శైల వాస శ్రీనివాస!!


48.శ్రీ వత్సాంకిత గోవిందా!


శ్రిత పారి జాత శ్రీవత్సాంకిత (శ్రీవత్స +అంకిత)

శ్రీరమనెదపొదవి శ్రీలు కురియు

నీకు ఉత్సవమ్ము,నీవత్సలముమేము

శేష శైల వాస శ్రీనివాస!!


49.ధరణీ నాయక గోవిందా!


దర్శనంబు నీయి ధరణీశనాయక

దర్శనంబు నీయి ధర్మతేజ

దర్శనంబునిచ్చి దర్శించు మమ్మేలు

శేష శైల వాస శ్రీనివాస!!


50.దినకరతేజ గోవిందా!


అనవరతము గొల్తు దినకర తేజమ్ము

దివ్య భవ్య జ్ఞాన దీపకమ్ము

సిధ్ధిబుధ్ధి శాంతి శీల సంధాయకము

శేష శైల వాస శ్రీనివాస!!


51.పద్మావతీ ప్రియ గోవిందా


పద్మవిభుడవీవె పద్మావతీప్రియ

పద్మసంభవుండె పట్టినీకు

పట్టి విడువనయ్యపాదపద్మంబులు

శేషశైలవాసశ్రీనివాస!!


52.ప్రసన్నమూర్తీ గోవిందా


సుజనమతులపాలిసుప్రసన్నమూర్తివి

భజనసేతు మయ్య భక్తసులభ

ముజ్జగములనేలు మరళీధరాహరా

శేష శైల వాస శ్రీనివాస!!


53. అభయ హస్త ప్రదర్శన గోవిందా


అలసటేదినీకు అభయ హస్తప్రదర్శ

ఆదుకొనగ మమ్ము చేదు కొనగ

ఆటవిడుపులేక ఆటలాడింతువు

శేష శైల వాస శ్రీనివాస!!


54.అర్చ్యావతార గోవింద


అర్చనంబు సేతు మర్చ్యావతారుడా

చందనాలచర్చ చారుచరిత

మరచి పోకు మయ్యమదనజనకమమ్ము

శేష శైల వాసశ్రీని వాస!!


55.శంఖ చక్రధర గోవిందా


సంకటములబాపు శంఖచక్రధరుడ

శంఖనాదభీతిచక్రఘాతి

పంకజాక్ష శ్రీశ పాలించు జగదీశ

శేష శైల వాస శ్రీనివాస!!


56.శార్ఙగదాధరగోవిందా


శౌర్యదివ్యతేజ శార్ఙగదాధర

సూర్యచంద్రనేత్రశూరవీర

సకల శాస్త్రవినుత షాడ్గుణ్యపరిపూర

శేషశైలవాస శ్రీనివాస!!


57.విరజాతీరస్ధ గోవిందా


అవిరళ రవితేజ సువిరజాతీరస్ధ

ఆదిమధ్యరహిత ఆత్మరూప

ఆది లక్ష్మి యలుగ నరుదెంచినావయ్య

శేష శైల వాస శ్రీనివాస!!


58.విరోధి మర్దన గోవిందా


ఓ విరోధి మర్ద నోవిశ్వ పోషకా

ఓ విహంగ వాహనో ముకుంద

ఓ విశాల నేత్ర యో విశ్వరూపుడా

శేష శైల వాస శ్రీనివాస!!


59.సాలగ్రామధర గోవిందా


కొండయైననీవు కొద్ది యైయుండిమా

యండ పిండ మల్లె అమరినావు

సాధుజనులగావ సాలగ్రామధరుడ

శేష శైల వాస శ్రీనివాస!!


60.సహస్ర నామ గోవిందా


శతసహస్రప్రణతి శతరూపుడా నీకు

శతసహస్రనామ శత సుబాహ

శతసహస్రనేత్ర శతకోటిరవితేజ

శేష శైల వాస శ్రీనివాస!!


61.లక్ష్మీవల్లభ గోవిందా!


ఉల్లమందునిన్నె నెల్లవేళలగొల్తు

కల్లకపట మెరుగ కలలొనైన

సిరుల నిచ్చి బ్రోవు శ్రీలక్ష్మివల్లభ

శేషశైల వాస శ్రీని వాస!!


62.లక్ష్మణాగ్రజా గోవిందా


లక్ష్యమొకటె మాకులక్ష్మణాగ్రజ,ధీర

దుర్నిరీక్ష వీక్ష దురితదూర

నిర్నిమేషమైన నీచెంత మేముంట

శేష శైల వాస శ్రీనివాస!!


63.కస్తూరీతిలకగోవిందా


కమల వదనమందు కస్తూరితిలకము

కంబుకంఠమందుకౌస్తుభమ్ము

అలదె తనువునంత హరిచందనమ్మును

శేష శైల వాస శ్రీనివాస!!


64.కాంచనాంబరధర గోవిందా!


కాంచినంత నిన్ను కాంచనాంబరధర

సంచితములుబాయు సన్నుతించ

మంచికలుగునెల్ల మదిలోన నినుబిల్వ

శేషశైలవాస శ్రీనివాస!!


65.గరుడ వాహనా గోవిందా


కరుణ నేలు కొమ్ము గరుడవాహన మమ్ము

కలకలమ్ము రేగి కలచె మదిని

కలలొనిలలొగాచు కరుణాలవాలవు

శేష శైల వాస శ్రీనివాస!!


66.గజరాజ రక్షక గోవిందా


రుజను బాపు మయ్యగజరాజరక్షక

ఆర్తత్రాణబిరుద మందినావు

నారదాదిమునుల నాద నీరాజనం

శేషశైలవాస శ్రీని వాస!!


67.వానరసేవిత గోవిందా


వాసవాదివినుత వానర సేవిత

సకల జీవ రక్ష సాధు పోష

ఉడుత నీదు చేత నుధ్ధతి నొందేను

శేషశైలవాస శ్రీనివాస!!


68.వారిధి బంధన గోవిందా


వారిజాక్షి విభుడ వారిధి బంధన

పేర్మి మీర ధరణి నేలి నావు

ఓర్మి తోడ మదిని కూరిమి చేకూర్చు

శేష శైల వాస శ్రీనివాస!!


69.ఏడు కొండల వాడ గోవిందా


వేడుకొందు మిమ్ము ఏడుకొండలవాడ

వేడుకొందుమిమ్ము వేంకటేశ

వేడుకొందు మిమ్ము వేమారుధరణీశ

శేషశైలవాస శ్రీనివాస!!


70.ఏక స్వరూపా గోవిందా


ఆది దేవు డనుచు ఆశివుని రూపంచు

ఆది శక్తి వనుచు నుందు రిలను

వేంకటాద్రిరాయ ఏకస్వరూపాయ

శేష శైల వాస శ్రీనివాస!!


71.శ్రీ రామ కృష్ణా గోవిందా


ధర్మరూపుడొకడుకర్మయోగియొకడు

ధర్మకర్మక్షేత్రదార్శనికుడు

రామ కృష్ణ రూప మావిష్ణుతేజము

శేషశైలవాస శ్రీనివాస!


72.రఘుకులనందన గోవిందా!


రామ సుగుణ ధామ రఘుకులనందన

రార రాకుమార రణగభీర

రామ సీత చరిత రమణీయమౌ గాధ

శేష శైల వాస శ్రీనివాస!


73.ప్రత్యక్ష దేవా గోవిందా


తల్లిదండ్రిగురువు ప్రత్యక్షదైవాలు

కర్మ సాక్షి సూర్య చంద్ర యుగము

ప్రత్యహమ్ము గాచు ప్రత్యక్షదేవరా

శేషశైల వాస శ్రీనివాస!


74.పరమదయాకరగోవిందా!


పరమపదప్రదాత పరమదయాకర

భక్త పారి జాత పరమపూజ్య

వరములీయవేడ కరుణించుమోఱేడ

శేష శైల వాస శ్రీనివాస!


75.వజ్రకవచధర గోవిందా!


వందనమమ్మునీకు,వజ్రకవచధర

భక్తి చందనమ్ము భవ్య తేజ

ముక్తి నొసగు మాకు మునిబృందస్యందనా

శేషశైలవాస శ్రీనివాస!


76.వైజయంతిమాల గోవిందా!


వైజయంతి మాల వైకుంఠహరిధారి

వైళమేమముగనువేదవేద్య

వేయితలలవేల్పు వేంకటేశునిపాన్పు

శేషశైలవాస శ్రీనివాస!


77.వడ్డి కాసుల వాడ గోవిందా!


వందనమ్ములయ్య వడ్డికాసులవాడ

ముజ్జగములనేలు మూల పురుష

సజ్జనముల పాలి సంజీవకరణివి

శేష శైల వాస శ్రీనివాస!


78.వసుదేవతనయా గోవిందా!


వశమ నిన్నుఁదెలియ వసుదేవనందనా

పరవశమున మదిని పాదుకొంటి

వివశులమ్మునీదువిశ్వరూపముగాంచ

శేష శైల వాస శ్రీనివాస!


79.బిల్వ పత్రార్చిత గోవిందా!


బిల్వపత్రరూప బిల్వ పత్రార్చిత

పిల్వగానె రావె చిల్వశయన

పర్వమయ్య మాకు సర్వమైనీవుండ

శేష శైల వాస శ్రీనివాస!


80.భిక్షుక సంస్తుత గోవిందా!


భిక్ష నిడుము మాకు భిక్షుక సంస్తుత

ధర్మభిక్ష జ్ఞాన ధైర్య భిక్ష

ఆది భిక్షువునకు అర్ధభాగము నీవు

శేష శైల వాస శ్రీనివాస!


81.స్త్రీ పుం రూపా గోవిందా!


మోహనుండునీవె మోహినియననీవే

మోహరూప జగతి మోహనమ్మె

శ్రీరమారమాయస్త్రీపుంస్వరూపాయ

శేష శైల వాస శ్రీనివాస!!


82.శివ కేశవ మూర్తి గోవిందా!


శ్రీశు రూపమీవె శివతేజమునునీవె

వాసి గన్న యట్టి వరదు డీవె

చిన్మయస్వరూపి శివకేశవసుమూర్తి

శేష శైల వాస శ్రీనివాస!!


83.బ్రహ్మాండ రూపా గోవిందా!


సూర్యచంద్రుడగ్ని సుందర నేత్రాలు

నింగి గొడుగె నీకు నీలవర్ణ

అవని పాద పీఠి బ్రహ్మాండరూపుడా

శేష శైల వాస శ్రీనివాస!!


84.భక్త రక్షక గోవిందా!


భక్తి తోడ నిన్ను భజియించువారిని

ముక్తి నిచ్చి బ్రోచు మూల పురుష

భక్త రక్షకుడవు భవ నాశకుండవు

శేష శైల వాస శ్రీనివాస!!


85.నిత్య కల్యాణ గోవిందా!


నీదు చెంత నుంట నిత్యకల్యాణము

నీదు ప్రాపు మాకు నిత్య కీర్తి

నీదు సేవ చేయ నిత్య సంభరితము

శేష శైల వాస శ్రీనివాస!!


86.నీరజనాభ గోవిందా!


నేరమేమిమాది నీరజనాభుడా

చేర లేమ నిన్ను శేష శయన

కోర లేమ శరణు కోనేటి రాయుడా

శేష శైల వాస శ్రీనివాస!!


87.హాథీరామ ప్రియ గోవిందా!


హాయి కలుగు నయ్య హాథిరామప్రియ

భీతి లేదు నీవు ప్రీతిఁజెంద

భక్తసులభుడైన బావాజీ బాలాజీ

శేష శైల వాస శ్రీనివాస!!


88.హరి సర్వోత్తమ గోవిందా!


ఉత్తమంబులందు నుత్తమంబుగనీవు

హరులు గిరులు ఝరులు తరుల

యందు అభయ మీయ వయ్య హరిసర్వోత్తమ(హరిసర్వ+ఉత్తమ)

శేష శైల వాస శ్రీనివాస!!


89.జనార్దన మూర్తి గోవిందా!


పాహిపాహి పాహి భవ జనార్దనమూర్తి

పాహి పాహి దివ్య భవ్య దీప్తి

పాహిపాహిపాహి భవతారణాహరీ

శేష శైల వాస శ్రీనివాస!!


90.జగత్సాక్షి రూప గోవిందా!


అండపిండ బ్రహ్మ భాండంబులనునెల్ల

కుక్షిలోనదాచుకున్నతండ్రి

సర్వ జీవ జగతి సాక్షి రూపుండీవె

శేష శైల వాస శ్రీనివాస!!


91.అభిషేకప్రియ గోవిందా!


ఆది దేవుడగుటనభిషేకప్రియుడవు

ఆది విష్ణు వగుట నర్ప ణంబు

హరి హరాద్వైతునకునర్చనంమజ్జనం

శేష శైల వాస శ్రీని వాస!!


92.ఆపన్నివారణ గోవిందా!


ఆపదలను బాపు మాపన్నివారణ

తాప సంద్ర మందు తరణి వీవె

శాప కోప ములను శాసించు శమ మిమ్ము

శేష శైల వాస శ్రీనివాస!!


93.రత్న కిరీటా గోవిందా!


రవికులేంద్రరత్న!రత్నకిరీటుండ!

రత్న మణిమయమ్మురమ్యశోభఁ

రంజిలు మది నీకు రత్న సింహాసనం

శేష శైల వాస శ్రీనివాస!!


94.రామానుజనుత గోవిందా!


రావ కావఁరావ రామానుజనుతుడ

చేరి యేలఁరావ చిత్ర రథుడ

కోరి నినుభజింతు కోదండరాముడా

శేష శైల వాస శ్రీనివాస!!


95.స్వయం ప్రకాశ గోవిందా!


సూర్య తేజ మీవె స్వయంప్రకాశక

కర్మ సాక్షి నీవె కలియుగేశ

కరుణఁ జూప రావె కమల దళేక్షణ

శేష శైల వాస శ్రీనివాస!!


96.ఆశ్రిత పక్ష గోవిందా!


ఆశ్రిత జన పక్ష యఖిలాండ నాయకా

చిక్కులవిడదీయు చిన్మయుండ

వంతల నెడబాపు వైకుంఠవాసుడా

శేష శైల వాస శ్రీనివాస!!


97.నిత్య శుభ ప్రద గోవిందా!


నిత్య పూజ లివియె నిత్య శుభ ప్రదా

సత్య శీల సాధు సంత పోష

ప్రత్యగాత్మ జనుల పాలింప రావేల

శేష శైల వాస శ్రీనివాస!!


98.నిఖిల లోకేశా గోవిందా!


అఖిల భువన ములకు నిఖిల లోకేశుడా

సుఖము శాంతి నొసగు సూర్య తేజ

దుఃఖ తెరలఁద్రుంచు దుష్టసంహారకా

శేష శైల వాస శ్రీనివాస!


99.ఆనంద రూపా గోవిందా!


ఆశ తోడ గంటి మానంద రూపాయ

శ్వాస నీవె మాదు ధ్యాస నీవె

అంతరంగమందు నారని జ్యోతివే

శేష శైల వాస శ్రీనివాస!


100.ఆద్యంత రహితా గోవిందా!


అన్నిటగన నీవె నాద్యంత రహితుడా

దారి తెన్ను లేని వారి నేలు

తీరు తెన్ను నేర్పి తెరువు జూపుము

దేవ శేష శైల వాస శ్రీనివాస!


101.ఇహ పర దాయక గోవిందా!


అహము నణచి బ్రోతు విహ పర దాయకా

ప్రత్యహమున గొల్వ పరమపూజ్య

సత్య శీల సాధు సన్మార్గు లను గావు

శేష శైల వాస శ్రీనివాస!!


102.ఇభరాజరక్షక గోవిందా!


అభయము నిడుమయ్య యిభరాజరక్షకా

వక్ర దృష్టి నుండి నక్ర హారి

శుభము లొసగు చంద్ర సూర్యార్కనేత్రుడా

శేష శైల వాస శ్రీనివాస!


103.పరమదయాళు గోవిందా!


పరమ సంతసమ్ముపరమదయాళుడా

సతముమిమ్ముమేముసన్నుతించ

సరసమతినిఁజూడుసారసదళనేత్ర

శేష శైల వాస శ్రీనివాస!


104.పద్మనాభ హరి గోవిందా!


పరుగుపరుగునరిగి పద్మనాభహరిని

పరమ భక్తి తోడ ప్రస్తుతించ

పరవశమ్ముమీర కరుణఁజూపుస్వామి

శేష శైల వాస శ్రీనివాస!


105.తిరుమలవాసా గోవిందా!


వరములిచ్చిబ్రోవుతిరుమలవాసుడా

కరుణ తోడ మమ్ముకలుష హరణ

శరణుశరణుశరణుచక్రధారీహరీ!

శేష శైల వాస శ్రీనివాస!


106.తులసీవనమాల గోవిందా!


విలసినావుభువినితులసీవనమాల

సొలసి అలసినాము స్రొక్కినాము

అరసి మమ్ము నేలు అలమేలుమంగతో

శేష శైల వాస శ్రీనివాస!


107.శేషాద్రి నిలయాగోవిందా!


శ్రీకరముగ నిల్చి శేషాద్రి నిలయాన

చింతనమ్ముసేయవంతదీర్చు

కోరికొలచువారికొంగుబంగారంబు

శేషశైలవాస శ్రీనివాస!


108.శేష శాయి గోవిందా!


శేష శాయి వయ్య శేముషీ వల్లభా

పాపశేషములను పారద్రోలు

లేశమైనలోప మెంచక మముబ్రోవు

శేష శైల వాస శ్రీనివాస!!


ఫలశృతి:


శ్రీనివాసుమ్రోల శ్రీ దివ్యనామాల

పద్యమాల లల్లి ప్రణుతి సేయ

గళమునెత్తి పాడ గళసీమలో చేర్చ

జన్మధన్యమాయె సఫలమాయె॥॥


నిరతముపఠియించినిత్యస్మరణ చేయ

నిర్మలమ్మగుమది నిక్కముగను

నిత్యనిర్గుణుండు నిఖిల లోకేశుడు

నిన్నునన్నుగాచు నిజమునిజము॥॥


సర్వం శ్రీ శ్రీనివాసార్పణం!!మంగళంమహత్ శ్రీశ్రీశ్రీ!!!

ఏడుకొండలవాడా!వేంకటరమణా!

గోవిందా!గోవింద!!


జై శ్రీమన్నారాయణ!

జైజైశ్రీమన్నారాయణ!!

సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణ మస్తు!!!

సర్వం శ్రీ శ్రీనివాసార్పణం!!!




#srinivasa #venkateswaraswamy #VENKATESHWARA #venkateshwaraswamy #lordvenkateshwara #lordvenkateshwaraswamy #hindu #hindutemple #tirumala #thirumalathirupathidevasthanam #tirumalatemple #tirumalanews #tirupathi #tirupatibalaji #tirupatibalajitemple

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat