శ్రీలలిత ఆవిర్భావము – నేపథ్యము
సహస్రనామ స్తోత్రములు చాలావరకు వ్యాసప్రోక్తములు. శ్రీలలితాసహస్రనామ స్తోత్రము మిగిలిన సహస్రనామస్తోత్రముల వంటిది కాదు. సాక్షాత్తుగా అమ్మవారే వశిన్యాది దేవతల చేత పలికించింది. అమ్మవారే ఫలశ్రుతిని కూడా చెప్పింది. ఒక పెద్ద దేవతాసభలో చెప్పిన లలితాసహస్రనామ స్తోత్రమును వ్యాసభగవానుడు బ్రహ్మాండపురాణములో మనకి అందించాడు.
లలితాసహస్రనామ స్తోత్రము ఆవిర్భావము వెనక చాలా పెద్ద నేపథ్యము ఉన్నది. తారకాసుర సంహారము జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మించాలి. పార్వతీదేవియందు పరమశివుడు అనురక్తతను పొందడము కోసము మన్మధుడు తన పుష్పబాణములను విడిచి పెట్టాడు. కృద్ధుడైన శివుడు మూడవనేత్రము తెరిస్తే అందులోనుంచి వచ్చిన అగ్నిజ్వాలలో మన్మధుని శరీరము దగ్ధమై పెద్దభస్మరాశి కింద పడింది. మన్మధ బాణములు పడితే పార్వతీ పరమేశ్వరులకు అనురాగము కలుగుతుందని దేవతలు ఆశించారు. మన్మధదహనము జరిగింది. చిత్రకర్మ అనే ఆయన ఆప్రాంతమునకు వచ్చి తెల్లగా ఉన్న బూదికుప్పను చూసాడు. ఆయన కంటికి అందముగా కనపడింది. దానితో ఒక బొమ్మను చెయ్యాలనుకుని తయారు చేసాడు. దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అది పరమశివుడు రుద్రమూర్తయి తన మూడవకన్ను తెరిస్తే భస్మమైన మన్మధుని బూది. అందులోనుంచి తయారయిన వ్యక్తి వ్యగ్రతతో ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి బ్రహ్మగారు ‘భండ భండ’ అన్నారు. ఆయనతో పాటుగా విషంగుడు, విశుక్రుడు అని ఇద్దరు జన్మించారు. సోదరులతో భండుడు లోకములను బాధ పెట్టసాగాడు. ఈ లోకములో ఎవరైనా తన ఎదురుగా నిలబడిన వాళ్ళ బలములో సగము బలము ఆయనకు వచ్చేట్లుగా భండుడు రుద్రుని వలన వరము పొందాడు. రాక్షసులకు ఇటువంటి వాడే కావాలి. వారందరూ వచ్చి తమ నాయకునిగా మూర్ధాభిషిక్తుడిని చేసారు. వాళ్ళు ముగ్గురు రాక్షసులకు నాయకులు అయ్యారు. భండుడు ఈవిధముగా భండాసురుడు అయ్యాడు.
భండాసురునికి సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అని నలుగురు భార్యలు. విశుక్రుడు, విషంగుడు, భండాసురుడు ఒకచోట సమావేశమయ్యి మనము ఎలా జన్మించాము అన్నది పక్కన పెట్టి మనలను ఆశ్రయించిన వాళ్ళు, మనము, సుఖములు భోగములు అనుభవించడము చాలా బాగున్నది. మనలను నాయకులుగా అంగీకరించని యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష దేవతలతో ప్రారంభించి మనుష్యజాతితో సహా ఎన్నో జాతులు లోకములో మనలను నాయకులుగా అంగీకరించడము లేదు. వీళ్ళు భోగములు అనుభవించడానికి వీలులేదని వాళ్ళు ఒక ఆలోచన చేసారు. సుఖములన్నిటికీ ఆలవాలము ఎక్కడ ఉన్నదో చూసి దానిని నిర్వీర్యము చేద్దాము. భండుడు స్వర్గమునకు, విశుక్రుడు భూలోకమునకు, విషంగుడు రసాతలమునకు సూక్ష్మశరీరముతో వెళ్ళి పురుషులకు పుంసత్వమును, స్త్రీలకు రసోత్పతనము రేతస్సు లేకుండా చేస్తే, స్త్రీపురుషుల మధ్య భోగేశ్చ ఉండదు. ప్రత్యుత్పత్తి లేక మనుష్య జాతులు తమంత తాము నశించిపోతాయి. కొన్నాళ్ళకు జంతులోకము నశించిపోతుంది, దేవతలు నశించిపోతారు. మనసుని సంతోషముగా ఉంచుకోవడమన్న ప్రశ్న లేనప్పుడు లలితకళలు నశించిపోయి ప్రతివారు నీరసపడిపోతారు. భోగేశ్చ కలిగిన రాక్షసులు తప్ప ఎవ్వరూ మిగలకూడదు. మనము మాత్రమే భోగము అనుభవించాలని చిత్రమైన ఆలోచన చేసారు. ఆ కోరిక ఎంతో దూరము వెళ్ళింది. ముగ్గురూ బయలు దేరి సమస్తలోకములలో అన్ని జాతులవారికి పుంసత్వము లేకుండా, స్త్రీలలో రసత్వము – రేతస్సు లేకుండా చేసారు.
రసయేవ పరంబ్రహ్మ రసయేవ పరాగతిః
రసోఽహికాంతితత్ పురుషాం రసోరేత ఇతిస్మృతః
మనుష్యులలో ఈశ్వరానుగ్రహము వలన పెరిగే వీర్య రేతస్సులే కాంతిగా, స్మృతిగా, ఉత్సాహముగా, ప్రాణశక్తిగా ద్యోతకము అవుతూ ఉంటాయి. అవి నశిస్తే సమస్తజీవకోటి నీరస పడిపోతుంది. ఎక్కడా యజ్ఞములు, యాగములు, హోమములు లేవు. ఎవరిని చూసినా దిగులుగా ఉంటున్నారు. చిరునవ్వులు, సంతోషములు లేవు. ముగ్గురు రాక్షసులు యుద్ధము చేయకుండా లోకములో కామప్రళయమును సృష్టించారు. ఇది లలితా సహస్రనామస్తోత్రమునకు ఆవిర్భావమునకు కారణము. ఎవరికీ ఎందుకు ఇలా ఉన్నామన్న ప్రశ్న వేసుకునే ఉత్సాహముకూడా లేదు. జాతులు నశించి పోవడము ప్రారంభమయింది. లోకమంతా రాక్షసగణములు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భండాసురుని నాయకత్వము వర్దిల్లుతున్నదని దేవతలు గుర్తించారు. తన సోదరులతో కలసి పైకి కనపడకుండా, మిగిలిన రాక్షసుల వలే యుద్ధము చెయ్యకుండా సూక్ష్మరూపముతో అన్ని లోకములలో ప్రవేశించి అన్ని జాతులవారి తేజస్సునీ పాడుచేస్తున్నాడు. ఈ పరిస్థితులలోనుంచి రక్షణ కల్పించే వారు ఎవరా అనుకుని దేవతలు అందరూ కలసి వైకుంఠమునకు వెళ్ళి స్థితికారుడైన శ్రీమహావిష్ణువుని ప్రార్థన చేసారు. ఆయన ఇదివరకు నేను అవతారములను స్వీకరించి మిమ్ములను కాపాడిన మాట యథార్థము. భండుడికి ఎదుటివారిలోని సగబలమును తీసుకునే వరము ఉన్నది. అతని ముందు ఎవ్వరూ పనికిరారు. బ్రహ్మాండమునకు అవతలున్నవారిని తీసుకుని వచ్చి భండాసురుని నిర్జింపచేయాలి. బ్రహ్మాండము బయటికి వెళ్ళి ఒక తల్లిని పిలవాలి ఆవిడ వచ్చి భండాసురుని నిర్జిస్తుందని చెప్పారు.🙏
🙏 శ్రీ మాత్రే నమః 🙏