*_🚩అయ్యప్ప చరితం - 15 వ అధ్యాయం_🚩*

P Madhav Kumar



🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️


*‘‘మహారాజా !  మీరీ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారా అని ఎదురుచూస్తున్నాం అందరం !  మణికంఠుని చల్లని పాలనలో సుఖశాంతులతో జీవించాలన్నదే అందరి ఆశయం’’* అంటూ సభలోని ప్రజాప్రతినిధులు కూడా చెప్పడంతో రాజు తృప్తిగా నిట్టూర్చాడు !

*‘‘మణికంఠుని పట్ట్భాషేకం ! హూ ! ఎట్లా జరుగుతుందో అదీ చూస్తాను!’’* పళ్లు పటపటలాడిస్తూ లేచాడు మంత్రి వీరబాహు !మహారాజు ఇతరులతో చర్చలో వుండటం గమనించి ఎవరూ గమనించకుండా మెల్లగా లేచి బయటకు వచ్చి రాణీదేవి భవనంవైపు సాగిపోయేడు.


ఇలా జరగబోయేదంతా ముందేఅనుకునే సరికి మంత్రికి చాలా బాధవేసింది. సరే నేను ఏమి చేసేది తరువాత ఆలోచిస్తాను. ముందు ఏమి జరుగుతుందో చూస్తాను. అనుకొని అటు వైపు చూచేసరికి ..

ఆ రోజు *‘‘మహారాణి ! నీవు నారాయణుడిని , నేను పరమేశ్వరుని సంతానం కోసం ఎంతకాలంగా ప్రార్థిస్తూనే ఉన్నాము ! అయినా వారికింతవరకు మనమీద కరుణ కలగలేదు ! స్థితి , లయకారకులైన వారిద్దరు కొన్ని సందర్భాలలో పరస్పరం విరుద్ధమైన కార్యాలు చేస్తుంటారని మన గురుదేవులు చెప్పనే చెప్పారు గదా ! ఆ సంగతి నీకు గుర్తుంది కదూ ?

*‘మహావిష్ణువు వృషభ రూపంలో వచ్చిన రాక్షసుడిని వధించాడు ! పరమేశ్వరుడు వృషభాన్ని (నందిని) తన వాహనంగా చేసుకొని ఆప్యాయంతో పెంచుకున్నాడు. ఏనుగును (గజేంద్రుని) విష్ణువు కాపాడితే , పరమేశ్వరుడు రాక్షసుడైన గజాసురుని వధించాడు ! తనవారిని రక్షించడానికి విష్ణువు కృష్ణుడై గోవర్థనగిరి నెత్తుతే పరమేశ్వరుడు వింధ్య పర్వతాన్ని లోకహితం కోరి క్రిందకు వంగేలా చేశాడు. విష్ణువు కృష్ణుడిగా కాళీయుడనే విషసర్పం పడగలమీద కాళ్ళతో తొక్కుతూ నాట్యం చేస్తే పరమేశ్వరుడు విషసర్పమై వాసుకిని మెడకు హారంగా చుట్టుకున్నాడు.  ఈ విధంగా లోకరక్షణార్థం వారిద్దరూ కావించిన లీలలను ప్రస్తుతిస్తుంటారు మునిగణాలు వెండికొండమీద దర్శనమిచ్చే ఆ హరిహరులను ! అని ఈ విధంగా పరస్పర విరుద్ధమైన కార్యాలు ఆచరించే ఆ శివకేశవులను ప్రసన్నం చేసుకోవటానికి మనం తపస్సు చేయడానికి వెళితే మంచిదే కానీ రాజ్యభారాన్ని ప్రజా సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ఎవరికి అప్పచెప్పాలా అని ఆలోచిస్తున్నాను!’’* అంటూ చెప్పాడు రాజశేఖరుడు పత్ని రాణీదేవితో , తన ఆలోచన గూర్చి !  ఆమె జవాబు చెప్పేలోపల *‘‘నారాయణ ! నారాయణ ! ఏమిటి రాజ దంపతులు ఏదో గంభీరమైన విషయం గూర్చి చర్చిస్తున్నట్లున్నారు?’’* అంటూ ప్రత్యక్షమైనాడు దేవర్షి నారదుడు!

*‘‘దయచేయండి మునీంద్రా ! మీ రాకతో మా గృహం పావనమైంది ! ఆసీనులుకండి !’’* సంభ్రమంగా లేచి ఆయనకు భక్తి ప్రపత్తులతో పాద పూజ చేసి ఆ తీర్థాన్ని తలలమీద జల్లుకుని అతిథి మర్యాదలు జరిపారు రాజశేఖరుడు , ఆయన పత్ని !

*‘‘త్రిలోక సంచారులైన మీకు మా గురించి తెలియకుండా వుంటుందా దేవర్షి ! సంతాన భాగ్యం కోసం ఇద్దరం మా ఇష్టదైవాలను ఎంతగానో ప్రార్థిస్తున్నాము ! వారి కరుణావృష్టి మా మీద ఎప్పుడూ ప్రసరింపజేస్తారా అని ఆశతో ఎదురుచూస్తున్నాము. మా నిరీక్షణ ఫలిస్తుందా మహర్షి?’’* అంటూ అడిగిన వాళ్లవైపు ప్రసన్నంగా చూసాడు నారదుడు !

*‘‘అతి త్వరలోనే ఫలిస్తుంది ! మీరెంతో అదృష్టవంతులు ! శివకేశవుల అనుగ్రహంతో మీరు మహిమాన్వితుడైన బాలుడికి తల్లిదండ్రులు కాగలరు ! ఆ శుభ సమయం కోసం వేచి వుండండి!’’* అంటూ వాళ్లను ఆనందభరితులను కావించాడు నారద మహర్షి !

*‘‘ధన్యులం మహర్షి ! ధన్యులం ! ఇక ఎంతకాలమైనా ఫరవాలేదు , ఆ శుభ సమయం కోసం వేచి వుంటాము ! మా హృదయభారం తీరిపోయింది మీ పలుకులతో !  మీకు మా కృతజ్ఞతలు!’’* అంటూ నమస్కరించారు రాజదంపతులు!


*రాజశేఖరుడు వేటకు వెళ్లుట - దివ్య శిశువు దర్శనం*


*‘‘మహారాజా ! మన రాజ్యం సరిహద్దు ప్రాంతంలో అరణ్యాలలో క్రూర మృగాల బాధ ఎక్కువై ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ! ఈ విషయం మీకు విన్నవించి తమను కాపాడమని కోరడానికి అక్కడ నివసించే ఆటవికులు వచ్చి మీ దర్శనం కోరుతున్నారు!’’*  అంటూ విన్నవించాడు మహామంత్రి !  నారద మహర్షి వెళ్లిన తర్వాత తేలికపడిన మనస్సుతో సభా భవనానికి వచ్చిన రాజశేఖరుడికి మంత్రి చెప్పిన వార్త ఆందోళన కలిగించింది !

*‘‘నా పాలనలో ప్రజలు ఆపదల పాలవటం నేను సహించలేను ! వెంటనే వేటకు సన్నాహాలు కావించండి ! నేను స్వయంగా బయలుదేరి వెళ్లి ఆ క్రూరమృగాలను సంహరిస్తాను’’* అంటూ ఆదేశించాడు.

వేటకు వెళ్లడానికి అన్నీ సిద్ధమైనాయి ! కొంతమంది సైనికులు వెంటరాగా వడిగల గుర్రాలు పూన్చిన రథంమీద అరణ్యభూములలోకి దూసుకుపోయాడు రాజశేఖరుడు !  క్రూర మృగాలను గురి చూసి నిశితమైన బాణాలతో కూల్చుతూ ముందుకు సాగుతున్నాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat