‘అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా’
ఈ నామములో అమ్మవారి లలాటము గురించి చెపుతున్నారు. శృంగారరసము కన్నులచేత తెలుస్తుంది. భయము హాస్యము చేత కలిగిన సంతోషము కన్నుల ద్వారా తెలుస్తుంది. ఏదైనా సమస్యతో పరితాపమును పొంది ఉన్నారా, ప్రసన్నముగా ఉన్నారా అన్న రెండు విషయములు మాత్రము నుదుటి చేత తెలుస్తాయి. ఏకాంతములో ఆలయములోకి వెళ్ళి దర్శనము చెయ్యడము కాక – చేసిన దర్శనము యొక్క అనుభూతి ద్యోతకము అవ్వాలి. ధ్యానములో అమ్మవారి లలాటదర్శనము చేత ఎటువంటి అనుభూతిని పొందుతున్నారన్నది గమనించవలసిన విషయము. జాగ్రత్తగా ధ్యానము చేయడానికి చాలా చమత్కారముగా కొన్ని అవసరమైన సూచనలను వ్యాసభగవానుడు ఈ నామములో ఇచ్చారు.
అమ్మవారి లలాటము అష్టమినాటి చంద్రునివలె ఉంటుందని అన్నారు. ‘విభ్రాజదళికస్థలశోభితా’ అనగా లలాటము శోభిస్తూ ప్రకాశిస్తున్నది. శుక్లపక్షములో, కృష్ణపక్షములోకూడా అష్టమి వస్తుంది. చంద్రుడు శుక్లపక్షములో పెరుగుతూ, కృష్ణపక్షములో తరుగుతూ ఉంటాడు. అమ్మవారి లలాటము ఏ చంద్రుడిలా ఉంటుంది ? తేడా ఏమైనా ఉంటుందా? అన్నది చమత్కారము. ఎలా ఉంటుందో చెప్పడానికి నెలరోజులు కావాలి. లలాటమును చూసి గుర్తుపడితే మనసులో అమ్మవారి లలాటము కనపడుతుంది. మరుక్షణమే పరితాపమునకు ఉపశాంతి కలుగుతుంది. దీర్ఘకాలము ఉండే పరితాపముల వలన జీవితాంతము దుఃఖము అనుభవిస్తూనే ఉంటారు. ఒక జన్మతో పోయేట్టు ఉండదు. ఎన్నో జన్మలు అనుభవించవలసిన దానిని అమ్మవారి లలాటము చూసిన ఉత్తరక్షణములో ఆ పాపము దగ్ధమైపోతుంది. వ్యాసుడు అమ్మవారి లలాటము గురించి చెప్పి మనలను ఉద్ధరించడానికి ప్రయత్నము చేస్తున్నారు. అమ్మవారి లలాటము కృష్ణపక్షములో చంద్రునిలా ఉంటుంది. ఏ పక్షములో చంద్రబింబమయినా చల్లగానే ఉంటుంది అందులో అమ్మవారి నుదురు చూడగలగాలి. బాహ్యములోచూసినప్పుడు దూరముగా ఉన్నా ధ్యానములో మనసులోనే సాక్షాత్కరిస్తుంది. లలితాసహస్రనామ స్తోత్రములో ఉన్న ఏ నామమయినా ఉద్ధరిస్తుంది. అది అనుసంధానము చేసుకోవడము రావాలి. శుక్లపక్షము అంటే చంద్రకళలు తగ్గడము, కృష్ణపక్షము అంటే చంద్రకళలు పెరగడము. పదిహేను కళలు పెరిగితే పౌర్ణమి, పదిహేను కళలు తరిగితే అమావాస్య వస్తుంది. ఎందులోనుంచి ఈ కళలు వచ్చి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయో ఆ కళకు ‘లలిత’ అని పేరు. ఆ కళనే లలితకళ, శ్రీకళ, చిత్కళ, ఆద్యకళ అనిపిలుస్తారు. అష్టమితిథినాడు మాత్రమే ఒకే పేరు ఉన్న నిత్య శుక్లపక్ష, కృష్ణపక్షములలో కూడా వస్తుంది. అష్టమితిథినాడు ఎప్పుడూ చంద్రబింబములో ఉండే నిత్య నమస్కారము చెయ్యగానే చాలా తొందరగా కోరిక తీర్చకల శక్తి ఉన్నది. ఈ నామము చెప్పినా, ధ్యానము చేసినా, చాలా తొందరగా పరితాపము తగ్గి కోరికలు తీరతాయి. ఈ మాట మహానుభావుడు వ్యాసుడు, వశిన్యాదిదేవతలు చెప్పారు. లలాటదర్శనము చేత ఈ భాగ్యమును కృపచేస్తున్నది.
భాగ్యము లలాటము చేత నిర్ణయింపబడుతుందని పెద్దలు అంటారు. సాముద్రికములో విశాలమైన లలాటము ఉంటే భాగ్యవంతులు అంటారు. అమ్మవారి లలాటము ముడత పడడము, చిట్లించుకోవడము ఉండదు. అన్నిటినీ కల్పించకలిగినది, తియ్యకలిగినది,శక్తి ఇవ్వకలిగినది అమ్మ కనక ఆవిడ లలాటము అలా ఉన్నదని చెప్పారు. కొన్ని రోజులు పెరుగుతు, తరిగిపోతు ఉన్న చంద్రబింబమును రోజు చూస్తుంటే అందులో అనేక చిత్రములు ద్యోతకము అవుతాయి. పరితాపము ఉపశమిస్తుందని కూడా చెపుతూ శంకరాచార్యులు ఒక అద్భుతమైన శ్లోకము ఇచ్చారు.
కళఙ్కః కస్తూరీ రజనికరబిమ్బం జలమయం
కలాభిః కర్పూరై ర్మరకతకరండం నిబిడితమ్ |
అతస్త్వద్భోగేన ప్రతిదిన మిదం రిక్తకుహరం
విధి ర్భూయోభూయో నిబిడయతి నూనం తవ కృతే ||
అమ్మా! లోకములో ఉన్నవాళ్ళు ఆకాశములో చంద్రబింబము ఉన్నది అంటారు. అది గరుడమణి పూసల పెట్టి. అది పారదర్శకముగా లోపల ఉన్న పదార్ధము కనపడుతూ ఉంటుంది. చంద్రబింబమని పిలవబడేది చిన్నకుప్పె. అమ్మవారు స్నానము చేసినప్పుడు వాడుకునే పరిమళ జలములు తరవాత తన శరీరమునకు అలదుకునే అంగరాగములు అందులో పెట్టి ఉంటాయి. ఆవిడ రోజూ స్నానమునకు అలంకారమునకు వాడుతుంటే కరిగిపోతుంటాయి. అలా కరగిపోవడమే కృష్ణపక్షములో చంద్రుడు తరగిపోవడము. అన్నీ తగ్గిపోతుంటే అమ్మకు అన్నీ కొడుకు తీసుకుని వచ్చి సిద్ధము చెయ్యాలి కదా. అందుకని కొడుకైన బ్రహ్మగారు వెళ్ళి తీసుకుని వచ్చి పెట్టి నిత్య బ్రహ్మోత్సవము అమ్మవారికి చేస్తుంటాడు. అమ్మవారికి అందులో కొద్దిగా పరిమళ జలములు వేస్తాడు కొంచము పెరుగుతుంది. అంగరాగములు వేస్తాడు. ఇంకొంచము పెరుగుతుంది. కస్తూరి వేస్తే ఇంకొంచము పెరుగుతుంది. పౌర్ణమి వచ్చేటప్పటికి టాయిలెట్ బాక్స్. శుక్లపక్షము, కృష్ణపక్షము కాదు బ్రహ్మగారు సామాను తెచ్చి వేస్తుంటే సామాను పెరుగుతున్నది. వాడేసుకుంటే తరిగిపోతే కృష్ణపక్షము అంటున్నారు. నీకు బ్రహ్మగారు చేస్తున్న సేవ నిత్య బ్రహ్మోత్సవము. అమ్మవారికి చేస్తున్న బ్రహ్మోత్సవాలు చూడాలి అంటే ఎవరి ఇంటిముందు వారు అరుగు మీద నించుని ఆకాశము వంక చూస్తే చాలు కనపడుతుందని అన్నారు. అమ్మవారి ముఖమండలము నుంచి వచ్చే అమృతబిందువులు మనసులను చల్లబరచి, పరితాపమునకు ఉపశాంతిని, ఆహ్లాదమును కలగచేస్తాయి.🙏
🙏 శ్రీ మాత్రే నమః🙏