*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻సంవత్సరాది ఆస్థానోత్సవము🌻*
🍃🌹శ్రీ వేంకటాద్రియందు చేతన రక్షణార్థమై కలియుగ ప్రత్యక్షదైవముగా అవతరించియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి చాంద్రమాన సంవత్సరాది. (ఉగాది) పండుగ దినమునందు ఆస్థానమహోత్సవము జరుగును.
🍃🌹శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము పూర్తి అయిన పిమ్మట ఉత్సవమూర్తులగు శ్రీ మలయప్పస్వామివారు తమపట్టమహిషులగు శ్రీ భూదేవులతో సువర్ణద్వారమునకు ముందుగల ఆస్థానమండవమందు సర్వభూపాల వాహనములో వేంచేయుదురు. శ్రీ సేనాధి పతివారు వేరొక పీఠమునందు దక్షిణాభి ముఖముగా వేంచేయుదురు. శ్రీవార్లకు విశేష రత్నమయములగు తిరువాభరణములతో విశేషకౌశేయదుకూలములతో బహు పరిమళ యుతములగు మనోహరములైన పుష్పమాలికలతో అలంకారము సమర్పించెదరు.
🍃🌹తరువాత శ్రీస్వామివార్ల సన్నిధానమున మాధ్యాహ్నికారాధనము ప్రారంభమై నివేదమునకు నిత్య ప్రసాదములు, విశేష ప్రసాదములు, ఆస్థాన ప్రసాదములు సిద్ధపరచి పణ్యారపాత్రములను పరిచారకులు శిరస్సు యందుంచుకుని, శ్వేతచ్ఛత్రాది మర్యాదలతో మంగళవాద్యములతో శ్రీ జియ్యంగార్లు ఆచార్య పురుషులు ఉద్యోగస్థులు ఆలయ ప్రదక్షిణముగా శ్రీస్వామివారి సన్నిధానమునకు శ్రీమలయప్పస్వామివారి సన్నిధికి చేర్చెదరు. వెంటనే శ్రీవార్లకు నివేదనము జరుగును.
🍃🌹తరువాత శ్రీవార్లకు నూతనవస్త్రములు రజతపాత్రము నందుంచినవి శ్రీ జియ్యంగారు శిరస్సునందుంచుకుని శ్వేతచ్ఛత్రాది మర్యాదలతో మంగళవాద్యములతో ఆలయ ప్రదక్షిణముగా శ్రీస్వామివారి సన్నిధానమునకు వచ్చి సమర్పించెదరు. అర్చకులు ఆ నూతన వస్త్రములను శ్రీవారికి ధరింపచేసెదరు. పిమ్మట శ్రీవారికి హారతి జరిగి గోష్టికి తీర్థవినియోగము జరుగును. మిగిలిన రెండువస్త్రములు గల రజత పాత్రమును శ్రీజియ్యంగారు శిరస్సునందుంచుకుని శ్రీమలయప్పస్వామివారి సన్నిధికివచ్చి సమర్పించెదరు. ఆ వస్త్రములను అర్చకులు శ్రీమలయప్పస్వామివారికి శ్రీ సేనాధిపతివారికి సమర్పించెదరు.
🍃🌹పిమ్మట అర్చకులకు మర్యాద జరిగి శ్రీవారికి అక్షతారోపణము జరుగును. వెంటనే సిద్ధాంతిగారు నూతన పంచాంగమును వివరించెదరు. సిద్ధాంతి గారికి మర్యాదజరుగును. తరువాత శ్రీస్వామివారికి కొలువు, మాత్రాదానము (తాంబూలదక్షిణాతిల ఫలాదియుతతండుల దానం) జరుగును. వెంటనే శ్రీవారికి హారతులు జరిగి శ్రీజియ్యంగారు వారికి సర్కారువారికి మర్యాదలు జరిగి స్థానబహుమాన పూర్వకముగా ప్రసాదములు పణ్యారములు గోష్ఠికి వినియోగము చేయబడును.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*