🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️
మంత్రి కుతంత్రం
మణికంఠుని మీద రాజదంపతుల వాత్సల్యానురాగాలు , ప్రజల ప్రేమాభిమానాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ! హు ! తన ఆలోచనలన్నీ తలక్రిందులైనాయి. ఎవరికో జన్మించి మహారాజు కళ్లబడి దత్తపుత్రుడుగా ఈ మణికంఠుడు వచ్చి తన మార్గానికి అడ్డుగా నిలబడిపోయాడు ! ఈ అడ్డును తొలగించుకుని రాజ్యాన్ని తన వశం కావించుకోవాలి ! ఏం చేస్తే తన మార్గం నుండి ఆ మణికంఠుడు తొలగిపోతాడు ?
తన ఇంట్లో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు మంత్రి వీరబాహు ! పైకి విశ్వాసపాత్రుడుగా నటిస్తూనే రాజ్యాన్ని ఏ విధంగా తన హస్తగతం చేసుకోవాలా అని ఆలోచిస్తూ వుంటాడు మనస్సులో ! రాజదంపతులకు సంతాన భాగ్యం లేదనీ , రాజ్యం ఆయన తదనంతరం తన వశం చేసుకోవాలనే దురాలోచనలో వున్న మంత్రికి మణికంఠుని రాక ఎంత మాత్రం నచ్చలేదు ! అందుకే అతడిని ఎట్లాగైనా తన మార్గం నుండి శాశ్వతంగా తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
*‘‘మహామంత్రీ ! ఏమిటి ఏదో దీర్ఘాలోచనలో వున్నట్లున్నారు?’’* అంటూ సేనాపతి వచ్చి పలకరించాడు !
సేనాపతి కూడా మంత్రిలాగానే మణికంఠునిపై ప్రజల ప్రేమాభిమానాలు చూసి ఈర్ష్యాసూయలతో దహించుకుపోతున్నాడు.
ఇద్దరూ కలిసి ఎట్లాగైనా మణికంఠుని త్వరలో అంతం చేయాలని ఆ రోజు చాలాసేపు చర్చించుకున్నారు.
*‘‘మహామంత్రి ! నాకొక ఉపాయం తోస్తున్నది ! మనమీద ఎవరికీ అనుమానం రాకుండా ఈ విధంగా చేస్తే.. ’’* అంటూ తనకు తోచిన పథకం చెప్పాడు సేనాపతి.
అతను చెప్పింది విన్న మంత్రి ముఖం ఆనందంతో వికసించింది.
*‘‘నేనూ సరిగ్గా అట్లాగే అనుకున్నాను ! స్వయంగా విచారించి తెలుసుకున్నాను. అటువంటి వాటిలో బాగా నిపుణుడని ! ఇంకా ఆలస్యం ఎందుకు ? పదా ! వెళ్లి కలుసుకుని విషయం చెప్పివద్దాం!’’* అంటూ లేచాడు ఉత్సాహంగా !
ఇద్దరూ వేషాలు మార్చుకుని రహస్య మార్గాన బయటకు వెళ్ళారు .
మణికంఠుని అస్వస్థత
*‘‘ప్రభూ ! ప్రభూ ! రాకుమారుడు అస్వస్థులైనారు ! విపరీతమైన బాధతో శయ్యపైనుండి లేవలేకపోతున్నారు ప్రభూ!’’* అంటూ పరిచారికలు పరుగు పరుగున వచ్చి చెప్పడంతో ఆందోళనగా మణికంఠుని శయనాగారంలోకి వెళ్ళారు రాజదంపతులు !
‘‘బాధ ! బాధ !’’ అంటూ సతమతవౌతున్నాడు మణికంఠుడు ! శరీరం శక్తి హీనమై కదలలేకపోతున్నాడు ! బంగారు మేనిఛాయ నలుపు రంగులోకి మారింది ! చర్మమంతా ముడుతలు పడి వ్రణాలతో రసి కారుతున్నది !
*‘‘అయ్యో ! ఏమిటీ విపరీత పరిస్థితి ? రాత్రివరకు ఆరోగ్యంగా వుండిన నీకు హఠాత్తుగా ఇటువంటి రోగం ఏ విధంగా సంభవించింది ? పుత్రా ! మణికంఠా ! ఇతరుల బాధలు తీర్చే నీవు ఈ విధంగా బాధపడటం చూడలేకుండా వున్నాము ! మమ్మల్ని పరీక్షించకు ! త్వరగా స్వస్థుడవు అవాలి ! మా మాట వినిపించుకో కుమారా!’’* అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది రాణి మణికంఠుని తలను ఒడిలో పెట్టుకుని !
రాజు వెంటనే రాజవైద్యులను పిలిపించాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏