*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻10. శ్రీరామనవమి ఆస్థానోత్సవము🌻*
🍃🌹అపార కారుణ్య వారాశియై (తిరుమల) శ్రీ శేషగిరియందు లోక రక్షణార్ధమై అర్చావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధానమున ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమీ శుభదినమున శ్రీరామ స్వామివారికి ఆస్థానము జరుగును.
🍃🌹మహావిష్ణువు త్రేతాయుగమునందు అయోధ్యా పురవాసుల పూర్వజన్మ సహస్రార్జిత పుణ్యఫలమై కౌసల్యా దశరథుల తపః ఫలరాశియై సూర్యవంశమునందు చైత్ర శుద్ధ నవమి శుభవాసరమున సూర్యాంగారక శని గురుశుక్రులు అయిదు గ్రహములు ఉచ్చస్థులై యుండగా పునర్వసు నక్షత్రయుత కర్కాటక లగ్నమునందు శ్రీరాముడుగా అవతరించెను. అందుచే చైత్ర శుద్ధ నవమీ దినము పవిత్రాతి పవిత్రమైనది. ఆ దినమున సాయంకాలము శ్రీరామస్వామివారికి చతుర్వీథులలో సర్వపరివారములతో మంగళవాద్యములతో హనుమద్వాహనోత్సవము జరుగును.
🍃🌹వెంటనే శ్రీ స్వామివారి సువర్ణద్వారము ముందు సర్వభూపాల వాహనములో శ్రీరామచక్రవర్తి స్వామివారు శ్రీ సీతామహాదేవి శ్రీ లక్ష్మణస్వామివారు ఆస్థానమునకై వేంచేయుదురు. శ్రీ ఆంజనేయ స్వామివారు మరియొక పీఠము మీద దక్షిణాభిముఖముగా వేంచేయుదురు. ఆస్థానమండపము శ్రీస్వామివార్లతోను కైంకర్య పరులతోను అధికారులతోను భక్తజనముతోను పరివారముతోను నిండి యుండ చూచువారలకు ఆనందపులకాంకురములుత్కటమై శరీర విస్మృతి కలిగి అయోధ్యయందలి శ్రీరామచక్రవర్తి ఆస్థానమును ధ్యానించు చుందురు.
🍃🌹అంతట శ్రీరామస్వామివారికి ఆరాధనము జరు గును. ప్రసాదము నివేదింపబడును. అక్షతారోపణము జరుగును. పిమ్మట శ్రీరామస్వామివారి పాదారవిందముల యందుంచిన శ్రీరామాయణమును ఆరాధకులు మీరాశీదార్లగు పౌరాణికుల కిచ్చెదరు. వారు సంప్రదాయానుసారముగ శ్రీరామజనన భాగమును అతిమనో హరముగా అతి శ్రావ్యముగా పురాణ కాలక్షేపము చేయుదురు. పిమ్మట వారికి బహుమానము జరుగును. వెంటనే శ్రీస్వామివారికి హారతులు జరిగి పిమ్మట శ్రీజియ్యంగారువారికి సర్కారు వారికి మర్యాదలు జరిగి, ఆస్థాన మర్యాదల ప్రకారం గోష్ఠికి చందన తాంబూల ప్రసాద వినియోగము జరుగును. తరువాత శ్రీరామ స్వామివారు శ్రీసీతామహా దేవి శ్రీలక్ష్మణస్వామివారు శ్రీ ఆంజనేయస్వామివారు కొలువుచాలించి శ్రీవారి సన్నిధికి వేంచేయుదురు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*